మద్దతు ధరలతో పర్యావరణ లబ్ధి

ABN , First Publish Date - 2021-01-19T09:45:40+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన కనీస మద్దతు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ పంటల దిగుబడులకు ఎట్టి పరిస్థితులలోను...

మద్దతు ధరలతో పర్యావరణ లబ్ధి

వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన కనీస మద్దతు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ పంటల దిగుబడులకు ఎట్టి పరిస్థితులలోను కనీస లాభదాయక ధర లభించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలనేది ఈ డిమాండ్ లోని ప్రధాన అంశం. మరొక దృష్టికోణం నుంచి కూడా ఈ డిమాండ్‌ను చూడవలసి ఉంది. మన నదులను నిత్యం సజీవంగా ఉంచేందుకు కనీస మద్దతు ధరను ఒక సాధనంగా చేసుకోవలసి ఉంది. అదెలాగో వివరిస్తాను. 


నదులు కాలుష్యరహితంగా, స్వచ్ఛ వాహినులుగా ఉండాలంటే వాటిలో ఎల్లప్పుడూ తగినంత నీరు ప్రవహిస్తూ ఉండాలి. మనిషి ఆరోగ్యవంతుడుగా ఉండడానికి అతని శరీరంలో తగినంత రక్తం ఉండడం ఎంత అవసరమో నది సజీవంగా ఉండేందుకు అందులో సదా తగినంత నీరు ప్రవహిస్తుండడం కూడా అంతే అవసరం. పంటలసాగుకు నదీజలాలను ఉపయోగించుకోవడం రైతుల హక్కు. ఈ హక్కును సాకారం చేసేందుకు ప్రభుత్వాలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. నదీ జలాలపై మరో హక్కుదారు సాక్షాత్తు ఆ ప్రకృతి వనరే. అంటే నది, వివిధ జలచరాలు, జలసంబంధ వృక్షజాతుల మనుగడకు, నదీశోభను ఆస్వాదించేందుకు, మతాచారాల నిర్వహణకు నదులు సదా నిండుగా ప్రవహించడం అవసరం. నదిలో సహజ ప్రవాహాన్ని ‘పర్యావరణ ప్రవాహం’ (ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్) అంటారు. జలశాస్త్రవేత్తలు దీనినే క్లుప్తంగా ఈ-ఫ్లోస్ అంటారు. ఒక నదిని సజీవంగా ఉంచేందుకు ఈ-ఫ్లోస్ ఏ పరిమాణంలో అవసరం అన్న విషయమై పలు అధ్యయనాలు జరిగాయి. గంగానదికి సంబంధించి ఈ విషయాలను ప్రస్తావిస్తాను. అయితే అదే తర్కం ఇతర నదులకు కూడా వర్తిస్తుంది. 


గంగానదిలో 29 నుంచి 67 శాతం మేరకు పర్యావరణ ప్రవాహం ఉండాలని కొలంబోలోని ‘అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థ‍’ (ఐడబ్ల్యు ఎమ్‌ఐ) 2006లో సూచించింది. ఈ విషయంలో సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ గుప్తా (ఈ వ్యాస సహ రచయిత) వాదనలు విన్న అనంతరం నరోరా జలాశయం నుంచి 50 శాతం నీటిని తప్పనిసరిగా విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు 2011లో ఒక ఆదేశాన్ని జారీ చేసింది. కాన్పూర్‌కు ఎగువున ఉన్న భిథూర్ జలాశయం నుంచి 47 శాతం నీటిని విడుదల చేయాలని 2012లో ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్’ 2012లో సిఫారసు చేసింది. చిల్లా జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు గంగాజలాలను మళ్ళిస్తున్న పశులోక్ బ్యారేజ్ నుంచి 55 శాతం నీటిని విడుదల చేయాలని ఏడు ఐఐటీల కన్సార్టియం సిఫారసు చేసింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ 2015లో రూపొందించిన నివేదిక ఒకటి ఐఐటీల సిఫారసును సమర్థించింది. 


భీమ్‌గోడ బ్యారేజ్ నుంచి 36 నుంచి 57 క్యుమెక్స్ (క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్) నీటిని విడుదల చేయవలసిన అవసరముందని 2018 అక్టోబర్‌లో జల్‌శక్తి మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బిజ్నోర్, నరోరా, కాన్పూర్ దిగువ ప్రాంతాలకు 24 నుంచి 48 క్యుమెక్స్ నీటిని ఈ-ఫ్లోస్‌గా విడుదల చేయాలని ఆ మంత్రిత్వశాఖ నిర్దేశించింది. ఆయా జలాశయాలలో లభ్యమయ్యే మొత్తం నీటిలో ఇది 6 శాతం. ఇప్పటికీ అమల్లో ఉన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని, ప్రస్తావిత అధ్యయనాల సిఫారసులు, సూచనలను జల్ మంత్రిత్వశాఖ ఉపేక్షించిందని అర్థమవుతోంది. 


మనకు ఆహారభద్రత ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. సమస్య ఏమిటంటే ఈ రెండిటిలో ఏదో ఒక దానివైపు మనం మొగ్గవలసిన సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఎందుకని? మన రైతులు తమ పంటపొలాల సాగుకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని దుర్వినియోగపరుస్తున్నారు. అవసరమైన దాని కంటే ఎక్కువ నీటిని తమ పొలాల్లోకి పారించుకుంటున్నారు. దీనివల్ల అవసరాలకు మించి భారీ పరిమాణంలో సాగుజలాల సరఫరా ఆవశ్యకమవుతోంది. రైతులు తాము ఉపయోగించుకునే నీటికి విధిగా నిర్దిష్ట మొత్తంలో ధర చెల్లింపును అనివార్యం చేయడమే సమస్యకు పరిష్కారం. దీనివల్ల వారు సాగునీటిని వృథా చేయకుండా అవసరాల మేరకు ఉపయోగించుకుంటారు. తక్కువ నీటిని ఉపయోగించుకోవడం ద్వారా దేశానికి ఆహార భద్రతనూ సమకూర్చగలుగుతారు. అయితే ఉపయోగించుకున్న సాగునీటికి ధర చెల్లించవలసిరావడం వల్ల రైతుల ఉత్పత్తి ఖర్చులు విధిగా పెరుగుతాయి. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు పరస్పరానుగుణంగా కనీస మద్దతు ధరను పెంచడం ద్వారా సాగువ్యయాల సమస్యను అధిగమించవచ్చు. రైతులు తాము ఉపయోగించుకునే సాగునీటికి ధర చెల్లించవలసి ఉంటుంది. అయితే పంట దిగుబడుల విక్రయాల ద్వారా వారు తమ ఉత్పత్తి ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారు. 


కనీస మద్దతు ధర పెంపుదల అంతిమ భారం పట్టణ, నగరవాసులపై పడుతుంది. వాళ్లు తమకు అవసరమైన సకల ఆహారపదార్థాలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవలసి ఉండడంతో అధిక ధరలభారాన్ని మోయవలసి ఉంటుంది. కనీస మద్దతు ధర పెరిగినందున పట్టణ వాసులు విధిగా తమ ఆహారానికి మరింత అధికంగా ఖర్చుచేయవలసి ఉంటుంది. ఇప్పుడు మన ముందు ఒక సమస్య ఉన్నది. చౌక ఆహారధాన్యాలనో లేదా సజీవనదులనో మనం కోరుకోవాలి. తాము దేనిని కోరుకొంటున్నారో ప్రజలే నిర్ణయించుకోవాలి. చౌక ఆహారధాన్యాలను కోరుకునే వారూ, అలాగే జలచరాల, జలసంబంధమైన వృక్షజాతులు, మత్స్యకారుల జీవనాధారాల మనుగడను నదిశోభను కోరుకునేవారూ ఉంటారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని 50 శాతం నీటిని విడుదల చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని జల్ శక్తి మంత్రిత్వశాఖ ఎట్టి పరిస్థితులలోనూ అమలుపరచకూడదు. ప్రస్తావిత అధ్యయనాల సిఫారసులనే అమలుపరచాలి. అదే సమయంలో రైతులపై సాగునీటి ధర భారం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి, అందుకు అనుగుణంగా కనీస మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-01-19T09:45:40+05:30 IST