యోగా మ్యాట్‌ ఎలా ఉండాలంటే...

ABN , First Publish Date - 2021-06-02T05:30:00+05:30 IST

మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలతో పాటు ఇమ్యూనిటీ పెంచే ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం కూడా కరోనా బారి నుంచి కాపాడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకుముందు వ్యాయామం ఊసెత్తని వారు సైతం

యోగా మ్యాట్‌ ఎలా ఉండాలంటే...

మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలతో పాటు ఇమ్యూనిటీ పెంచే ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం కూడా కరోనా బారి నుంచి కాపాడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకుముందు వ్యాయామం ఊసెత్తని వారు సైతం ఇప్పుడు ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇంట్లో చిన్న చిన్న వర్కవుట్లు, యోగా చేస్తున్నారు. దీంతో యోగా మ్యాట్ల విక్రయాలు బాగా పెరిగాయి. అయితే యోగా, వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే... మ్యాట్‌ ఎంపికలో కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. 


సరైన సైజ్‌ ఎంచుకోండి:  మీరు ఎంత పొడుగు ఉన్నారు, మీకు ఎంత వెడల్పు అవసరం అనే విషయాల ఆధారంగా మ్యాట్‌ సైజ్‌ను ఎంచుకోవాలి. సాధారణంగా యోగా మ్యాట్‌ సైజు ఆరడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. మీరు ఇంకాస్త  పొడుగు ఉండి, మీ భుజాలు వెడల్పు ఉన్నట్టయితే ఏడడుగుల పొడవైన మ్యాట్‌ కావాలి. అలాగే రెండున్నర అడుగుల వరకూ వెడల్పు అవసరం. ఆ మేరకు మ్యాట్‌ ఎంపిక చేసుకోండి.


ఎంత దళసరిగా ఉండాలంటే: పల్చగా ఉన్న వాటికన్నా దళసరిగా ఉన్న మ్యాట్స్‌ ఎంచుకోవడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. మరీ పల్చగా ఉంటే వ్యాయామ సమయంలో మోకాళ్ళు, మోచేతులు కింద మోపాల్సి వచ్చినప్పుడు నొప్పి కలుగుతుంది. మీరు ఎటువంటి వర్కవుట్లు చేస్తారనే దానిపై ఆధారపడి మ్యాట్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా 10 మిల్లీ మీటర్లు, అంతకన్నా ఎక్కువ దళసరిగా ఉండే మ్యాట్లు అన్ని రకాల వ్యాయామాలకూ అనువుగా ఉంటాయి. 


నాణ్యమైన మెటీరియల్‌: నాణ్యత ఉన్న మ్యాట్‌ మీద గ్రిప్‌ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామ సమయంలో మీకు చెమట పట్టినా... ఆ తడిలో గ్రిప్‌ కోల్పోకుండా ఉండాలంటే... నాణ్యమైన మ్యాట్‌ తప్పనిసరి. అత్యున్నత నాణ్యత ఉన్న ఇథిలీన్‌- వినైల్‌ అసిటేట్‌ (ఇవిఎ)తో తయారైన మ్యాట్స్‌ మన్నికగా చక్కని గ్రిప్‌తో ఉంటాయి.


సమయం- సౌకర్యం: మీరు ఎక్కువ సేపు మ్యాట్‌ మీద యోగా, వ్యాయామం చేయాలన్నా లేదా క్లిష్టమైన ఆసనాలు వేయాలన్నా గ్రిప్‌తో పాటు సౌకర్యం కూడా ప్రధానం. అలాగే కొత్తగా వ్యాయామం మొదలుపెట్టిన వారికి అభ్యాసంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దళసరిగా, కాస్త మెత్తగా ఉండే మ్యాట్‌ అనువుగా ఉంటుంది. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని మ్యాట్‌ ఎంచుకోండి.

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST