గంటల కొద్దీ వ్యాయామం..ప్రాణాపాయం

ABN , First Publish Date - 2022-06-12T14:34:19+05:30 IST

ఏదైనా ఎక్కువ చేస్తే అనర్థమే అన్నది పెద్దల మాట. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చేయాలనుకునే వారు ముందుగా గుండె పనితీరు కు సంబంధించిన పరీక్షలు

గంటల కొద్దీ వ్యాయామం..ప్రాణాపాయం

ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి  

హృద్రోగ నిపుణుల సూచన


హైదరాబాద్‌ సిటీ: ఏదైనా ఎక్కువ చేస్తే అనర్థమే అన్నది పెద్దల మాట. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చేయాలనుకునే వారు ముందుగా గుండె పనితీరు కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిదని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ఏ మేరకు బరువు ఎత్తాలి, ఎంత సేపు చేస్తే శ్రేయస్కరం అన్నది నిర్ధారించుకున్న తర్వాతే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ బరువు ఎత్తడం, గంటల కొద్దీ వ్యాయామం చేస్తుండడంతో కొంతమందికి అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. గుండెలో ఏ ఒక్క వాల్వ్‌ సన్నగా ఉన్నా రక్త సరఫరా సాఫీగా జరగదని, అది హృదయ స్పందనలపై ప్రభావం చూపి గుండెపోటుకు దారితీస్తుందని కేర్‌ ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్‌ వినోత్‌కుమార్‌ తెలిపారు. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా గుండె జబ్బు ఉంటే పిల్లలకు 30 ఏళ్ల లోపు వచ్చే ముప్పు ఉంటుంది. ఇలాంటి వారు వ్యాయామాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొందరిలో గుండె కండరాలు పెరిగి ఉంటాయి. కానీ వారికి ఈ విషయం తెలియదు. మరికొందరు అబ్‌స్ట్రెకివ్‌ కార్డియో మయోపతితో ఇబ్బంది పడుతుంటారు, కార్డియో ఎర్త్‌మియా ఇబ్బందులు వస్తాయి.

ఇలాంటి వారు వ్యాయామం చేస్తుంటే నిమిషాల్లోనే గుండె ఆగి మరణించే ప్రమాదముందని నిమ్స్‌ ప్రొఫెసర్‌, కార్డియాలజిస్టు డాక్టర్‌ సాయి సతీష్‌ వివరించారు. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వేగంగా వ్యాయామం చేయడం, ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కార్డియాక్‌ మరణాలు సంభవిస్తుంటాయి. వ్యాయామం చేయడం మంచిదేనని, అయితే ఏ మేరకు బరువులు ఎత్తాలి, ట్రెడ్‌మిల్‌కు ఎంత సమయం కేటాయించాలి అనే విషయాలను గమనించాలని సాయి సతీష్‌ సూచిస్తున్నారు. కార్డియో మయోపతి, గుండెలో విద్యుత్‌ ప్రేరేపణలో తేడాల వల్ల గుండె వేగం పెరిగి వైఫల్యం చెందుతుంటాయని చెప్పారు. 


ముందే ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు

జిమ్‌లో వ్యాయామం చేయాలనుకునే వారు తప్పని సరిగా ఈసీజీ, 2డీ ఎకో చేయించుకోవాలి. కొంతమందిలో గుండెనొప్పికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించవు. అలాంటి వారి గుండె కవాటాల్లో ఇబ్బందులు ఉంటాయి. పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె పనితీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గుండెలో విద్యుత్‌ ప్రేరేపణలు అసాధారణంగా ఉంటే అకస్మాత్తుగా గుండె స్పందనలు పెరిగి మరణానికి దారితీస్తుంది. కళ్లు తిరిగి పడిపోవడం, మగతగా అనిపించడం వంటి ఇబ్బందులుంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. గంటల కొద్దీ వ్యాయామాలు చేయాలన్నా, బరువులు ఎత్తాలన్నా కార్డియాలజిస్టులతో ముం దుగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల తప్పని సరిగా హృద్రోగులను సంప్రదించాలి.

-డాక్టర్‌ సాయి సతీష్‌, విభాగాధిపతి, 

కార్డియాలజీ యూనిట్‌ 1, నిమ్స్‌


ట్రెడ్‌మిల్‌ ద్వారా ముందే పసిగట్టొచ్చు

వ్యాయామానికి ముందు తప్పనిసరిగా హృద్రోగ వైద్యులను సంప్రదించాలి. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేసి నిర్ధారణకు వస్తారు. మున్ముందు గుండె స్పందనల్లో తేడా తెలుసుకునేందుకు ట్రెడ్‌మిల్‌ పరీక్ష చేస్తారు. గుండె కండరాల్లో వాపు.. కవాటాల వ్యాకోచం.. గుండె వాపు... హార్ట్‌ పంపింగ్‌ను పరిశీలిస్తారు. బ్లాక్స్‌ ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తారు. కొందరిలో మధుమేహం, బీపీ వంటివి లేకపోయినా అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ముప్పు ఉంటుంది. ధూమపానం చేసే వారిలో 20 శాతం బ్లాక్స్‌ ఉంటే వ్యాయామం చేసే సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. 

- డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, 

సీనియర్‌ కార్డియాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి

Updated Date - 2022-06-12T14:34:19+05:30 IST