ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2021-10-24T04:14:53+05:30 IST

వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యవతకు శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గానికి ఒక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనకే పరిమితమైంది.

ఎదురుచూపులు!

  • స్టడీ సెంటర్‌ ఏర్పాటయ్యేదెన్నడో?
  • నియోజకవర్గానికొకటి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం
  • నేటికీ ముందుకు సాగని ప్రక్రియ 
  • ప్రారంభిస్తే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు లబ్ధి
  • దూర ప్రాంతాలకు వెళ్తూ నష్టపోతున్న నిరుద్యోగులు


వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యవతకు శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గానికి ఒక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనకే పరిమితమైంది.  మరో రెండు, మూడు నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్టడీ సెంటర్‌ ఏర్పాటు కాకపోవడంతో పేద విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక స్థానికంగా శిక్షణ పొందలేక సతమతమవుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి):

నియోజకవర్గాని ఒక స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ప్రతిపాదించిన స్టడీ సెంటర్లలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వడమే కాకుండా పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో సేవలు అందించేలా వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కలిగిన భవనాలను గుర్తించాలని ప్రభుత్వం సంబంధిత అఽధికారులకు సూచించింది. స్టడీ సర్కిల్‌ నిర్వహణకు కళాశాలలు, పాఠశాలలతో పాటు గ్రంథాలయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గత జూన్‌ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి అన్ని నియోజకవర్గాల్లో స్టడీ సెంటర్లు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించినా ఇంత వరకు ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  వికారాబాద్‌లో స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయాలంటూ గత రెండు దశాబ్దాలుగా ప్రాంత నిరుద్యోగులు, విద్యావంతులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేస్తే వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువతను సన్నద్ధం చేసే విధంగా ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలతో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌, ఉపాధ్యాయ, పోలీస్‌ తదితర ఉద్యోగాలు సాధించేందుకు ఈ సెంటర్లలో ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడనుంది. 

స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ..

హైదరాబాద్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్డడీ సర్కిళ్లలో సంబంధిత వర్గాల నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల సాఽధన కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. నిపుణులైన శిక్షకులతో వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించడమే కాకుండా అవసరమైన సూచనలు, సలహాలు చేస్తూ నిరుద్యోగులు ఉద్యోగాలకు ఎంపిక కావడంలో స్టడీ సెంటర్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే విషయమై ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణకు ఎంపికైన నిరుద్యోగులకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పించడమే కాకుండా మెటీరియల్‌ కూడా అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత ంగా శిక్షణ ఇచ్చే  స్టడీ సర్కిళ్లలో అవకాశం కోసం తీవ్ర పోటీ ఉంటోంది. ప్రవేశాల కోసం అర్హత పరీక్ష నిర్వహించి దాంట్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. 

శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు..

ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మూడు, నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. త్వరలో 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని  ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లలో చేరి శిక్షణ పొందుతున్నారు. యువతీ యువకులు కొందరు స్థానికంగా ఉండే కోచింగ్‌ సెంటర్లలో చేరగా, మరికొందరు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో చేరారు. కొందరు రూములు అద్దెకు తీసుకోగా, మరికొందరు హాస్టళ్లలో ఉండి శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దూరప్రాంతాలకు వెళ్ల డం ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగాలు సాధించాలనే తపన వారిని ఆ దిశగా ముందుకు వెళ్లేలా చేస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లకు వెళుతున్నారు. అయితే ఉద్యోగం సాఽ దించాలనే తపన ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ స్టడీ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్‌ వం టి నగరాలకు వెళ్లకుండానే స్థానికంగానే ఉచిత శిక్షణ పొందే సదుపాయం ఏర్పడుతుంది. వచ్చే రెండు, మూడు నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-10-24T04:14:53+05:30 IST