ఎగుమతుల్లో భారీ వృద్ధి

ABN , First Publish Date - 2021-05-03T06:51:54+05:30 IST

భారత ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 3,021 కోట్ల డాలర్లకు...

ఎగుమతుల్లో భారీ వృద్ధి

  • ఏప్రిల్‌లో 3,021 కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: భారత ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 3,021 కోట్ల డాలర్లకు (రూ.2,26,575 కోట్లు) చేరాయి. ఇంజనీరింగ్‌, వజ్రాలు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాలు ఈ వృద్ధికి ఊతం ఇచ్చాయి. సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఇతర రంగాల్లో జనపనార, ఫార్మాస్యూటికల్స్‌, తివాచీలు, హస్తకళా ఉత్పత్తులు, తోలు, ఆయిల్‌ మీల్‌, జీడిపప్పు, ఉన్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 1,524 కోట్ల డాలర్లకు (రూ.1,14,300 కోట్లు) పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎగుమతుల పరిమాణం 1017 కోట్ల డాలర్లు, వాణిజ్య లోటు 692 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్‌ నెలలో దిగుమతులు కూడా మూడింతల వృద్ధిని సాధించాయి. గత ఏప్రిల్‌తో పోల్చితే దిగుమతులు 1,709 కోట్ల డాలర్ల  నుంచి 4,545 కోట్ల డాలర్లకు పెరిగాయి. విభాగాలవారీగా చూస్తే ఆయిల్‌ దిగుమతులు 1,080 కోట్ల డాలర్లకు పెరిగాయి. కరోనా ప్రభావంతో గత ఏడాది ఏప్రిల్‌లో ఎగుమతులు రికార్డు స్థాయిలో 60 శాతానికి పైగా క్షీణించడమే ఈ ఏప్రిల్‌లో ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదు కావడానికి (బేస్‌ ఎఫెక్ట్‌) కారణమంటున్నారు. 


పెరిగిన బంగారం దిగుమతులు: ఏప్రిల్‌ నెలలో బంగారం దిగుమతుల విలువ 612 కోట్ల డాలర్లు (రూ. 45,900 కోట్లు). గత ఏడాది ఏప్రిల్‌తో ఇవి 283 కోట్ల డాలర్లకే పరిమితమయ్యాయి. ఎలక్ర్టానికల్‌ వస్తువులు, రవాణా పరికరాలు, ఖనిజాలు, యంత్రసామగ్రి, టెక్స్‌టైల్‌ యార్న్‌, వంటనూనెలు, ఇయాల్‌, ఇనుము, ఉక్కు దిగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతిదారుల ఆర్డర్‌ బుకింగ్‌ స్థితి మెరుగ్గా ఉండడాన్ని ఈ వృద్ధి ప్రతిబింబిస్తున్నదని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య (ఫియో) ప్రెసిడెంట్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌ అన్నారు. దేశంలో క్రమంగా పరిస్థితులు మెరుగు పడడం కూడా రాబోయే కాలంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది శుభసూచిక అని  సరాఫ్‌ అన్నారు. 


Updated Date - 2021-05-03T06:51:54+05:30 IST