వినాశకాలంలో విపరీత బుద్ధులు!

ABN , First Publish Date - 2020-08-16T06:03:01+05:30 IST

‘‘హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలు మాకు లేవు. ఆ నగరాల్లో ఉన్నట్టుగా వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మాకు లేవు’’ ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తంచేసిన ఆవేదన ఇది! ముఖ్యమంత్రి ఆవేదనలో నిజం ఉంది. అందుకేగా, అమరావతిని అభివృద్ధి చేసుకుంటే ఈలోటు కొంతైనా తీరుతుందని పలువురు చెబుతున్నారు! మహా నగరాన్ని నిర్మించే...

వినాశకాలంలో విపరీత బుద్ధులు!

స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన దుర్ఘటనను ప్రమాదంగా చూడకుండా ఒక సామాజిక వర్గంపై కక్ష సాధించడానికి ప్రభుత్వం వాడుకోవడం వైద్య రంగానికి చెందిన వారితో పాటు వైద్యులనూ దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఆస్పత్రి యజమాని రమేశ్‌బాబును అరెస్టు చేయడం కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం జరిగితే డాక్టర్‌ రమేశ్‌ను అరెస్ట్‌ చేయాలనుకోవడం ఏమిటో తెలియదు. విజయవాడలో ఉన్న ఆస్పత్రులలోకెల్లా రమేశ్‌ ఆస్పత్రి పెద్దది. అలాంటి ఆస్పత్రిపైకుల ద్వేషంతో వ్యవహరించడం విజ్ఞత ఉన్న పాలకులు చేయవలసిన పనేనా? జగన్‌ రెడ్డి అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం అభివృద్ధి చెందుతుందా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా కుల ద్వేషంతో రగిలిపోవడం వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతారు. వైద్యులను కూడా కులం కోణంతో చూడడం రోత పుట్టిస్తోంది.


జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న నమ్మకం కుదిరాక అవినీతి కేసులలో విచారణను వేగవంతం చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. అప్పుడు వైసీపీని బీజేపీలో విలీనం చేయాలని జగన్‌పై ఒత్తిడి తేవాలన్నది కమలదళం వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకు జగన్‌ నిరాకరిస్తే అవినీతి కేసులలో ఆయనకు శిక్షపడి జైలుకు వెళ్లాల్సి రావచ్చు. వైసీపీని విలీనం చేసే ప్రతిపాదనను జగన్‌ రెడ్డి ఇదివరకే నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. భవిష్యత్తులో బీజేపీ అనుసరించబోయే వ్యూహాన్ని బట్టి జగన్‌ రెడ్డి పూర్తికాలం కొనసాగుతారా?లేక భార్య భారతి ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారా? అన్నది తెలుస్తుంది. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్ముతున్న జగన్‌ రెడ్డి భవిష్యత్తు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉంది!


‘‘హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలు మాకు లేవు. ఆ నగరాల్లో ఉన్నట్టుగా వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మాకు లేవు’’ ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తంచేసిన ఆవేదన ఇది! ముఖ్యమంత్రి ఆవేదనలో నిజం ఉంది. అందుకేగా, అమరావతిని అభివృద్ధి చేసుకుంటే ఈలోటు కొంతైనా తీరుతుందని పలువురు చెబుతున్నారు! మహా నగరాన్ని నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ కాలదన్నుతున్నది జగన్‌ రెడ్డి కాదా? మూడు రాజధానులు అనే దిక్కుమాలిన ప్రతిపాదనను తెర మీదకు తెచ్చి ‘‘మా రాజధాని ఇది’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చెప్పుకోలేని దుస్థితి తెచ్చింది ఎవరు? అమరావతిని కొనసాగించి ఉంటే హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ అక్కడికి కూడా తరలివచ్చేవి కదా! కరోనా వైరస్‌ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కొంతవరకైనా అంది ఉండేవి కదా! ఇవేవీ పట్టించుకోకుండా, ఇప్పుడు మాకు మహా నగరాలు లేవు, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలూ లేవు అని ప్రధానమంత్రి దగ్గర మొర పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఇలాంటి విషయాలలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వంగానీ, అధికారులు గానీ ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు.


కార్పొరేట్‌ ఆస్పత్రులపై చర్య తీసుకునే విషయమై తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులను మూయించితే ఎదురయ్యే ఇబ్బందులను ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆస్పత్రులను మూయిస్తే కరోనా బాధితులు వైద్యం అందక ఇబ్బందిపడతారు. అయినా వాటిని మూయించాల్సిందే అని న్యాయస్థానం ఆదేశిస్తే తాము అలాగే చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనానికి స్పష్టంచేశారు. దీంతో ప్రభుత్వ వాదనలో హేతుబద్ధత ఉందని భావించిన ధర్మాసనం కూడా ఆ వ్యవహారాన్ని అంతటితో ముగించింది. హైకోర్టు అభిప్రాయపడినట్టుగా అపోలో, బసవతారకం ఆస్పత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకొని ఉంటే ఏమి జరిగేదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా పూర్తిగా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు కొవిడ్‌ బాధితులు మరణించారు. ఆ హోటల్‌ను రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లో కూడా పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు హోటళ్లను లీజుకు తీసుకొని కరోనా బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నాయి. స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనది. అయితే, ఈ దుర్ఘటనను ప్రమాదంగా చూడకుండా ఒక సామాజిక వర్గంపై కక్ష సాధించడానికి ప్రభుత్వం వాడుకోవడం వైద్య రంగానికి చెందిన వారితో పాటు వైద్యులనూ దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.


తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతులు కూడా ఎక్కువే. అయినా ఇవేవీ పట్టని ప్రభుత్వ పెద్దలు రమేశ్‌ ఆస్పత్రిని మూయించే బృహత్తర పనిలో ఉన్నారు. ఆస్పత్రి యజమాని రమేశ్‌బాబును అరెస్టు చేయడం కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం జరిగితే డాక్టర్‌ రమేశ్‌ను అరెస్ట్‌ చేయాలనుకోవడం ఏమిటో తెలియదు. విజయవాడలో ఉన్న ఆస్పత్రులలోకెల్లా రమేశ్‌ ఆస్పత్రి పెద్దది. అలాంటి ఆస్పత్రిపై కుల ద్వేషంతో వ్యవహరించడం విజ్ఞత ఉన్న పాలకులు చేయవలసిన పనేనా? జగన్‌ రెడ్డి అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం అభివృద్ధి చెందుతుందా? రోగులకు, వైద్యులకు మధ్య ఉండేది నమ్మకం మాత్రమే. ఏ ఆస్పత్రికి వెళ్లి ఏ వైద్యుడ్ని కలిస్తే నాణ్యమైన వైద్యం అందుతుందని భావిస్తే రోగులు అక్కడికే వెళతారు. ఇక్కడ వైద్యులు గానీ, రోగులు గానీ కులం గురించి చూడరు కదా! జగన్‌ రెడ్డి కుటుంబంలో ఎవరికైనా వైద్యం అవసరం అయితే కులం చూసి వెళ్లరు కదా! హైదరాబాద్‌లో అన్ని కులాలకు చెందినవారూ కార్పొరేట్‌ ఆస్పత్రులను నెలకొల్పారు. స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిలో భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయా? అని తనిఖీలు చేయించింది. ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా సరైన భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించారు. అయినా వివాదాన్ని సాగదీయకుండా జాగ్రత్తలు సూచించారు. జగన్‌ రెడ్డి చేస్తున్నదేంటి? డాక్టర్‌ రమేశ్‌ బాబును అరెస్టు చేయడం ఆయనకు అత్యంత ప్రాధాన్యమైంది. తెలంగాణ అధికారులు హైకోర్టులో వాదించిన దానికి భిన్నంగా అక్కడి అధికారులు కూడా ప్రభుత్వ పెద్దలకు వంత పాడుతున్నారు. ఇలా అయితే మూడు రాజధానులు కాదు గదా, 30 రాజధానులు ప్రకటించినా ఆ రాష్ట్రంలో పనిచేయడానికి వైద్యులు ఇష్టపడతారా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా కుల ద్వేషంతో రగిలిపోవడం వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతారు. వైద్యులను కూడా కులం కోణంతో చూడడం రోత పుట్టిస్తోంది.


రాష్ట్రమేగతి బాగుపడునోయ్‌!

ఈ ఉదంతం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఇతరత్రా పరిణామాలు కూడా దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టడాన్ని ఇప్పటివరకు కనలేదు వినలేదు. కానీ, ఘనత వహించిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ పని కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం మాపై నిఘా పెట్టడం ఏమిటి? అని న్యాయమూర్తులు ఆశ్చర్యపోతున్నారు. న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం జగన్‌ రెడ్డికి సరదాగా ఉంటోంది. ఇప్పటివరకూ పనిచేసిన ముఖ్యమంత్రులు అందరూ న్యాయమూర్తులతో గౌరవంతో మెలిగేవారు. కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలసి రాష్ట్రంలో పరిస్థితులను బ్రీఫ్‌ చేయడం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం ఇటువంటి సున్నితమైన అంశాలపై ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. న్యాయ వ్యవస్థతో ఘర్షణకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొందరు న్యాయమూర్తులను ఆయన కూడా కలిశారు. అయితే, ఆ సందర్భంగా జగన్‌ రెడ్డి వ్యవహారధోరణి సదరు న్యాయమూర్తులను కంగు తినిపించింది. ‘‘నేను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను. మీరు మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటారు.


మీకంటే నేనే గొప్ప!’’ అన్నట్టుగా జగన్‌ రెడ్డి మాటలు ఉన్నాయట! న్యాయమూర్తులతో సున్నితంగా వ్యవహరించడం జగన్‌ రెడ్డితో కాదని గ్రహించిన వైసీపీ పెద్దలు కొందరు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం మొదలెట్టారు. ఈ పరిణామం కూడా ఎక్కడో బెడిసికొట్టింది. ఒక న్యాయమూర్తి ఇంట్లో శుభకార్యానికి వైసీపీకి చెందిన ఇద్దరు ముఖ్యులు హాజరయ్యారు. ఆ తర్వాత సదరు న్యాయమూర్తితో వారి సంబంధాలు మరింత బెడిసి కొట్టాయట. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టుగా జగన్‌ రెడ్డి బాటలోనే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నారేమో తెలియదు. న్యాయ వ్యవస్థతో ఘర్షణ పడటం, అందులో భాగంగా న్యాయమూర్తులపై నిఘా పెట్టడం జగన్‌ రెడ్డి ప్రాధాన్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గిట్టనివారిపై కక్షగట్టి వెంటాడి వేధిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలలో కూడా అంతే పట్టుదలగా ఉంటున్నారా? అంటే లేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. దేశంలో బల్క్‌ డ్రగ్స్‌కు సంబంధించి రెండు పార్కులను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఇందులో ఒక పార్క్‌ ఆంధ్రప్రదేశ్‌కు లభించే అవకాశం ఉంది. ఈ పార్క్‌ వస్తే వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉద్యోగాలూ లభిస్తాయి. ఇదే విషయాన్ని కొంత మంది అధికారులు, పారిశ్రామికవేత్తలు జగన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ‘‘అలాంటివి మనదాకా ఎందుకు వస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేటాయిస్తారు’’ అని తేల్చిపారేశారట. మార్గదర్శకాల ప్రకారం మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినా ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టారట. ఇదే పార్క్‌ కోసం తెలంగాణకు చెందిన మంత్రి కేటీఆర్‌ ప్రతి రెండు రోజులకొకసారి కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నారు. సదరు పార్క్‌ను తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ, అధికారులకూ ఇలాంటి వాటిపట్ల ఆసక్తి లేకపోవటం ఆశ్చర్యంగా ఉందని కేంద్రంలోని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికై వడ్డీ రాయితీని అయిదారు శాతానికి పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇందుకోసం సాలీనా రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు, సంక్షేమం కోసం చేస్తున్న ఖర్చులో 500 కోట్లు ఎంత? అని వాదించే ప్రయత్నం చేయగా, ‘‘ఎవరో పరిశ్రమ పెట్టి లాభపడటానికి నేనెందుకు 500 కోట్లు ఖర్చు చేయాలి’’ అని కరాఖండీగా చెప్పేశారట. ఒక ముఖ్యమంత్రి ఆలోచనలు ఇంత వికృతంగా ఉంటే ఏ రాష్ట్రమైనా ఎలా బాగుపడుతుంది? జగన్‌ రెడ్డి వ్యవహార శైలి గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి ఒకరిని ఇటీవల పోలీసులు అనధికారికంగా నిర్బంధించి కొట్టారట. గతంలో సదరు అధికారి ముఖ్యమంత్రిని దూషించిన సంఘటనకు, ఇప్పుడు పోలీసులు ఆయనకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కు సంబంధం ఉందని జనం చెప్పుకొంటున్నారు. వైసీపీకి చెందిన ముఖ్య నేతలకు సంబంధించిన సమాచారం చెప్పాల్సిందిగా సదరు వ్యక్తిని పోలీసులు హింసించారని కూడా ప్రచారంలో ఉంది. మొత్తంమీద ఆయనను పోలీసులు కొట్టడం వాస్తవం. కారణం ఏమిటన్నది త్వరలో తెలుస్తుంది. మరో సందర్భంలో మరో పారిశ్రామికవేత్తను ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి స్వయంగా బెదిరించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌ చేయించి సదరు పారిశ్రామికవేత్తను పిలిపించారట. పెద్దల ఆదేశాల మేరకు కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన తన కంపెనీలో కొంత వాటాను ఇతరులకు బదలాయించారట. అయినా ఒత్తిళ్లు తగ్గకపోవడంతో ఆయన ప్రస్తుతం అమెరికా వెళ్లిపోయారు. ఇవన్నీ చూస్తుంటే, వింటుంటే, ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న సామెత గుర్తుకొస్తోంది.


బీజేపీ చేతిలో ‘భవిత’!

ఈ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదు. ఆ స్థానాన్ని మేం భర్తీ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ప్రకటించారు. 0.5 శాతం నుంచి 40–50 శాతానికి ఎగబాకాలనుకోవడంలో తప్పులేదు. అయితే ‘అప్ప ఆరాటమే గానీ బావ బతకడు’ అన్నట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి. అధికార వైసీపీతో పెట్టుకున్న రహస్య ఒప్పందాన్ని తెగదెంపులు చేసుకోకుండా అదెలా సాధ్యమో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి దాదాపు ఆరు శాతం ఓట్లు సాధించిన జనసేనాని పవన్‌ తోడుగా ఉంటే అధికారంలోకి రావొచ్చునని బీజేపీ నాయకులు ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, అంచనాలెప్పుడూ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న మూడు రాజధానుల వివాదంతో పాటు ఇతరత్రా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో అడుగులు వేయకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీనే ప్రధానంగా విమర్శించడం వల్ల ఎవరైనా అధికారంలోకి వస్తారా? ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై కేసులు ఉన్నందున ఆయనను ఎప్పుడైనా నిలువరించవచ్చునని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పోలిస్తే జగన్‌ రెడ్డిది దూకుడు వైఖరి. కొన్ని విషయాల్లో ఆయన మొండిగానే కాకుండా మూర్ఖంగానూ వ్యవహరిస్తారు.


అవినీతి కేసుల నుంచి విముక్తి పొందడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూనే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా జగన్‌ రెడ్డి రూపొందించుకున్నారు. కేసుల నుంచి బయటపడే విషయంలో సహాయ పడతారన్న నమ్మకంతో గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఓడరేవులను, ఇతర వ్యాపారాలను హస్తగతం చేసుకోవడంలో అదానీకి జగన్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. ముంబై ఎయిర్‌ పోర్టులో వాటా ఇవ్వడానికి నిరాకరించిన జీవీ కృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ, ఈడీ కేసులలో ఇరికించిన అదానీ ఇప్పుడు జగన్‌ రెడ్డి బలహీనతను ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, అదానీ చెప్పినంత మాత్రాన జగన్‌ను కేసుల నుంచి బీజేపీ పెద్దలు విముక్తం చేస్తారని చెప్పలేం. అయినా అంబానీ, అదానీ సహకారంతో కేసుల నుంచి బయటపడాలని జగన్‌ అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించని పక్షంలో మళ్లీ జైలుకు వెళ్లడానికి కూడా జగన్‌ రెడ్డి ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించుకున్నారని చెబుతున్నారు. అవినీతి కేసులలో తనకు శిక్షపడి జైలుకు వెళ్లవలసి వస్తే ముఖ్యమంత్రిగా తన స్థానంలో తన భార్య భారతిని నియమించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ కారణంగానే న్యాయ వ్యవస్థతో ఢీకొనడానికి కూడా ఆయన వెనకాడటం లేదని చెబుతున్నారు. అయితే, కమలనాథుల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న నమ్మకం కుదిరాక అవినీతి కేసులలో విచారణను వేగవంతం చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. అప్పుడు వైసీపీని బీజేపీలో విలీనం చేయాలని జగన్‌పై ఒత్తిడి తేవాలన్నది కమలదళం వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకు జగన్‌ నిరాకరిస్తే అవినీతి కేసులలో ఆయనకు శిక్షపడి జైలుకు వెళ్లాల్సి రావచ్చు. అయితే, వైసీపీని విలీనం చేసే ప్రతిపాదనను జగన్‌ రెడ్డి ఇదివరకే నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతికూల పరిణామాలకు సైతం సిద్ధపడాలని జగన్‌ రెడ్డి ఇదివరకే తన సన్నిహితులకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీ అనుసరించబోయే వ్యూహాన్ని బట్టి జగన్‌ రెడ్డి పూర్తికాలం కొనసాగుతారా? లేక భార్య భారతి ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారా? అన్నది తెలుస్తుంది. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్ముతున్న జగన్‌ రెడ్డి భవిష్యత్తు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-08-16T06:03:01+05:30 IST