ట్రంప్ ఫేస్‌బుక్ పోస్టుపై.. జుకర్‌బర్గ్‌కు ఉద్యోగుల‌ సెగ

ABN , First Publish Date - 2020-06-04T14:07:15+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన వివాదాస్పద పోస్ట్‌పై ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆ కంపెనీ ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది.

ట్రంప్ ఫేస్‌బుక్ పోస్టుపై.. జుకర్‌బర్గ్‌కు ఉద్యోగుల‌ సెగ

శాన్‌ఫ్రాన్సిస్కో, జూన్‌ 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన వివాదాస్పద పోస్ట్‌పై ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆ కంపెనీ ఉద్యోగుల నుంచి  తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా ఈ విషయంలో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌పై కంపెనీ ఉద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం 90 నిమిషాలపాటు కంపెనీ ఉద్యోగులతో వీడియో కాల్‌ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ అనుసరిస్తున్న విధానాన్ని ఉద్యోగులు లేవనెత్తారు. కొంత మంది తమ ఆందోళనను వ్యక్తం చేశారు. నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం నేపథ్యంలో అగ్రరాజ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల పట్ల ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ ‘‘దోచుకోవడం ప్రారంభం అయితే షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’’ అని మే 28న ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.


ట్రంప్‌ చేసిన పోస్ట్‌ ఫేస్‌బుక్‌ విధానాలను ఉల్లంఘించేలా ఉందని ఉద్యోగు లు మండిపడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌ను తొలగించకుండా కొనసాగడంపై జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులు ప్రశ్నించారు. అయితే ఆ మెసేజ్‌ హింసను ప్రేరేపించే విధంగా ఉందని తాను, కంపెనీ విధాన బృందం భావించడం లేదని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. కాబట్టి ఫేస్‌బుక్‌ విధాన నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో విధానంలో మార్పులు చేయాలా లేదా నిబంధనలు ఉల్లంఘించే పోస్ట్‌లను తొలగించకుండా వాటిని ఎత్తి చూపే విధంగా ఉంచాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నట్టు జుకర్గ్‌బర్గ్‌ పేర్కొన్నట్టుగా ఒక ఉద్యోగి తెలిపారు.  


Updated Date - 2020-06-04T14:07:15+05:30 IST