నకిలీ దందా

ABN , First Publish Date - 2021-06-19T05:18:45+05:30 IST

ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తన దందా

నకిలీ దందా
కేశంపేటలో పట్టుబడిన నిషేధిత పత్తి విత్తనాలు

  • జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం
  • షాద్‌నగర్‌ ప్రాంతంలో ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
  • పట్టుబడుతున్న బీటీ-3 పత్తి విత్తనాలు


షాద్‌నగర్‌అర్బన్‌: ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తన దందా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. కొన్నేళ్ళుగా సాగవుతున్న బీటీ-3 (గ్లైసిల్‌)పత్తి విత్తనంపై ఎస్‌ఓటీ పోలీసులు దృష్టి పెట్టడంతో వందల ప్యాకెట్లు, క్వింటాళ్ళ కొద్ది లూజ్‌ విత్తనాలు పట్టుబడుతున్నాయి. తీగ లాగితే డొంక కదులుతుండడంతో వ్యాపారులు తమ వద్ద ఉన్న నిషేధిత పత్తి బీటీ-3 రకం విత్తనాలను చెరువుల్లో పారబోస్తున్నారు.

యథేచ్ఛగా నిషేధిత పత్తి సాగు

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో గుట్టు చప్పుడుకాకుండా నిషేధిత బీటీ-3(గ్లైసిల్‌) పత్తి విత్తనం సాగవుతోంది. కొన్నేళ్ల నుంచి గ్లైసిల్‌ పత్తి సాగువుతున్నా... వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వ్యాపారులు క్వింటాళ్ళ కొద్ది గ్లైసిల్‌ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటి సాగుతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఈ విషయమై పోలీసులు దృష్టిపెట్టడంతో నిషేధిత పత్తి విత్తన దందా వెలుగు చూస్తుంది. 

ఈనెల 9న కేశంపేట మండల కేంద్రంలోని విత్తన దుకాణంలో ఎస్‌ఓటీ పోలీసులు దాడిచేసి 150 కిలోల నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను పట్టుకుని అంజనేయులు అనే వ్యాపారిని అరెస్టు చేశారు. బుధవారం చౌదరిగూడ మండలంలోని కాసులబాద్‌లో రాజేష్‌ అనే రైతు నిషేధిత పత్తి విత్తనాలు సాగుచేస్తున్న సమయంలోనే పోలీసులు దాడి చేసి 20 ప్యాకెట్లను స్వాధీనం చేసుకు న్నారు. అదేవిధంగా కొందుర్గు మండలంలోని ఎంకిర్యాలలో విత్తన వ్యాపారం చేస్తున్న మురళి వద్ద 65 ప్యాకెట్లను పట్టుకున్నారు. అనంతరం ఫరూఖ్‌నగర్‌ మండలంలోని చించోడ్‌లో గల మహమ్మద్‌ నవాజ్‌ ఇంటిపై దాడి చేసి 150 ప్యాకెట్లు, 12కిలోల 695 గ్రాముల లూజ్‌ విత్తనాలను స్వాధీన పర్చుకున్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని శ్రీనివాసకాలనీలో ఉంటున్న మాధవరావు ఇంటిపై దాడి చేసి 46 ప్యాకెట్లను స్వాధీన పర్చుకున్నారు. షాద్‌నగర్‌లోని జీహెచ్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణ, మురళిలు చించో డ్‌లోని మహమ్మద్‌ నవాజ్‌ ఇంటిని అద్దెకు తీసుకుని నిషేధిత బీటీ-3 రకం పత్తి విత్తన దందా చేస్తున్నట్లు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సమగ్ర విచారణ జరిపితే పట్టుబడిన విత్తన దందా మూలాలు బయటపడే అవకాశం లేకపోలేదు.


పర్యావరణానికి పెను ముప్పు

నిషేధిత బీటీ-3 రకం పత్తిసాగు పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కలుపు నివారణ కోసం బీటీ-3 రకం పత్తి విత్తనాలను సాగు చేస్తున్నారు. పత్తి పైరుతోపాటు పెరిగే కలుపు నివారణ కోసం రైతులు గ్లైసిల్‌ మందును పిచికారి చేస్తున్నారు. గ్లైసిల్‌ పిచికారి వల్ల బీటీ-3 పత్తిలోని కలుపు మొక్కలు, గడ్డిజాతులు చనిపోయి, కూలీలతో కలుపు తీయించే ఖర్చు రైతుకు తప్పుతుంది. ఇలా కలుపు నివారణ కోసమే బీటీ-3 రకం పత్తిని రైతులు దొంగచాటున కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. బీటీ-3 రకం పత్తిసాగుతో భూములు, పర్యావరణం దెబ్బతిని జనం క్యాన్సర్‌ లాంటి జబ్బుల బారిన పడుతున్నారన్న ఆలోచనతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినా ఇవి మార్కెట్‌లో లభించడం పట్ల వ్యవసాయశాఖ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.



Updated Date - 2021-06-19T05:18:45+05:30 IST