వైసీపీలో భగ్గుమన్న పాతకక్షలు

ABN , First Publish Date - 2021-01-18T08:54:15+05:30 IST

కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గ కేంద్రంలోని పాతపేటలో వైసీపీ వర్గీయులు ఆదివారం పరస్పరం కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

వైసీపీలో భగ్గుమన్న పాతకక్షలు

పరస్పరం కత్తులతో దాడులు..ఏడుగురికి గాయాలు  

రణరంగంగా మారిన డోన్‌ పాతపేట 


డోన్‌, జనవరి 17: కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గ కేంద్రంలోని పాతపేటలో వైసీపీ వర్గీయులు ఆదివారం పరస్పరం కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పాతపేటలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. గడచిన రెండు నెలల్లో పలుమార్లు స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల వారు డోన్‌ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈనేపథ్యంలో పాతపేటలోని చౌక్‌లో కటిక  నాగరాజు, ఫరీద్‌ మధ్య ఆదివారం మాటామాటా పెరిగింది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని నాగరాజు, వారి అనుచరులు కత్తులు, రాడ్లతో ఫరీద్‌పై దాడికి పాల్పడ్డారు. అక్కడనే ఉన్న ఫరీద్‌ వర్గీయులు ఎదురు దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు అరగంట పాటు జరిగిన దాడులతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. స్థానికులు భయాందోళన చెందారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన నాగరాజు, కిరణ్‌, కిషోర్‌, మరో వర్గంలో ఫరీద్‌, వలీ, నాని, మహమ్మద్‌ గాయపడ్డారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం అక్కడికి చేరుకుని గాయపడిన వారిని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


తీవ్రంగా గాయపడిన నాగరాజు, కిషోర్‌, కిరణ్‌ను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, ఈఘటనకు సంబంధించి  8 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక వర్గానికి చెందిన కటిక నాగరాజు, కిషోర్‌, కిరణ్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశామని, మరో వర్గానికి చెందిన ఫరీద్‌, వలి, నాని, మహమ్మద్‌పై కూడా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. 

Updated Date - 2021-01-18T08:54:15+05:30 IST