Abn logo
May 21 2020 @ 00:49AM

పరాధీన భారత్‌‌గా పతనం కానున్నామా!

స్వాతంత్ర్యం నుండి లక్షలకోట్ల పెట్టుబడితో నిర్మించుకుంటూ వచ్చిన 339 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటికరణ చేస్తునట్లు అర్థిక మంత్రి చివరి నాలుగు, ఐదు ఆర్థిక ప్యాకేజీల్లో ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులుగా ఉన్న స్టీలు, పెట్రోలియం, గ్యాస్‌, విద్యుత్‌, మైనింగ్‌, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, బొగ్గు, టెలికం, షిప్పింగ్‌, రవాణా, ఎలక్ట్రికల్‌ ఇతర అనేక రకాల భారీ ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో కనుమరుగు అవబోతున్నాయి. ఆఖరికి రక్షణ, అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతిచ్చారు. ఇలా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను బడా కార్పోరేట్‌ సంస్థల గుప్పెట్లో పెట్టబోతున్నారు. ఈ చర్యలు దేశ స్వావలంబనను దెబ్బతీసి పరాధీనతకు దారితీస్తాయి. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డ భారత ఆర్థిక వ్యవస్థను ‘ఆత్మ నిర్భర భారత్‌’ పేరిట గాడిలో పెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు, వివిధ రకాల చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజలను తీవ్ర ప్రమాదంలో పడేశాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థను అడ్డుఅదుపు లేకుండా కొల్లగొట్టుకోవటానికి విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదార్లులకు గేట్లన్నీ ఎత్తేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ రంగాలను చావుదెబ్బ తీయబోతున్నారు. ఈ చర్యలు దేశ స్వావలంబనను దెబ్బతీసి దేశ పరాధీనతకు దారితీస్తాయి. 


స్వాతంత్ర్యం నుండి లక్షలకోట్ల పెట్టుబడితో నిర్మించుకుంటూ వచ్చిన 339 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటికరణ చేస్తునట్లు అర్థిక మంత్రి చివరి నాలుగు, ఐదు ఆర్థిక ప్యాకేజీల్లో ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులుగా ఉన్న స్టీలు, పెట్రోలియం, గ్యాస్‌, విద్యుత్‌, మైనింగ్‌, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, బొగ్గు, టెలికం, షిప్పింగ్‌, రవాణా, ఎలక్ట్రికల్‌ ఇతర అనేక రకాల భారీ ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో కనుమరుగు అవబోతున్నాయి.


నేడు అత్యధిక ప్రభుత్వ రంగ సంస్థలు గణనీయమైన లాభాలు గడిస్తున్నాయి. 2018-19లో ఇవి రూ.1.74 లక్షల కోట్లు లాభాలు ఆర్జించాయి. కేవలం 70 కంపెనీలు మాత్రమే రూ.31వేల కోట్లు నష్టాలు పొందాయి. ఇదే కాలంలో ఉత్పత్తుల అమ్మకాలు ద్వారా రూ.25.43లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాయి. మొత్తం ఈ కంపెనీల వద్ద నేడు రూ.9.93లక్షల కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో గత ఏడాది రూ.3.68లక్షల కోట్లు, డివిడెండ్స్‌ రూపంలో రూ.71వేలకోట్లు చెల్లించాయి. 2020-21బడ్జెట్‌లో రూ.1.50లక్షల కోట్లు డివిడెండ్స్‌ రూపంలో ఈ రంగాల నుండి వస్తాయని పేర్కొన్నారు. ఇవి ఏడాదికి కార్మిక వేతనాల క్రింద రూ.1.53లక్షల కోట్లు చెల్లిస్తున్నాయి.


ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం రూ.26లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం చూస్తే వీటి విలువ 20రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవిగాక ప్రతి ఏడాది ఈ కంపెనీలు విస్తరణ కోసం సగటున రూ.2.5లక్షల కోట్లు నూతన పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే అనేక నగరాల అభివృద్ధికి మూలకేంద్రాలుగా, ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్‌ పెరుగుదలకు, సేవా రంగం విస్తరణకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇంత ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వెనుక- దేశ ప్రయోజనాల కన్నా విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్థల లాభాలే ముఖ్యంగా భావించి బిజేపి ఈ చర్యకు పాల్పడింది.


కీలకమైన రంగాలను కూడా ప్రైవేట్‌పరం చేయటానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడింది. బొగ్గు రంగాన్ని 1973లో జాతీయం చేశారు. అప్పటినుండి ఈ రంగంలో ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ఇండియా, సింగరేణి కోలరీస్‌ సంస్థలే ఉత్పత్తి చేయటంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం కూడా కొనసాగిస్తూ గణనీయంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. అందుకే ఈ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అవకాశమివ్వాలని చాలాకాలం నుండి స్వదేశీ, విదేశీ బడా సంస్థలు బిజెపిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. కోల్‌ ఇండియా, సింగరేణి కోలరీస్‌ కంపెనీలను ప్రైవేటీకరించడం లేదని కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74శాతం మాత్రమే అనుమతిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. మొదటగా 50బొగ్గు కేంద్రాలను ప్రైవేట్‌ సంస్థలకి ఇవ్వబోతున్నారు. ఈ బొగ్గు గనులను పొందిన సంస్థలు తమ సొంత అవసరాలకే గాక బహిరంగ మార్కెట్‌లో కూడా ఉత్పత్తిని అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చారు. వీటినే నాన్‌ క్యాపిటివ్‌ మైన్స్‌ అంటారు.


గతంలో ఎవరైన స్టీల్‌, ధర్మల్‌ విద్యుత్‌ప్లాంట్‌ పెట్టినవారికి ఆ పరిశ్రమ అవసరం మేరకు బొగ్గు గనులు కేటాయించే విధానం ఉండేది. తద్వారా జరిగే ఉత్పత్తిని క్యాప్టివ్‌ మైనింగ్‌ అంటారు. ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు. ఇప్పుడు బొగ్గు గనులు పొందే పెట్టుబడిదార్లు బొగ్గు ఉత్పత్తిని దేశంలోను, విదేశాల్లోను ఎక్కడైనా అమ్ముకునే అధికారం లభిస్తున్నది. దీని వల్ల జరిగేదేమంటే ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు ఉత్పత్తి మార్కెట్టును కోల్పోయి మూతపడతాయి. ప్రైవేట్‌ సంస్థలు అతితక్కువ ఖర్చుతో బొగ్గు ఉత్పత్తి చేసి మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధిస్తాయి. ఎందుకంటే కోల్‌ ఇండియా, సింగరేణి కోలరీస్‌ సంస్థలో మొత్తం ఉత్పత్తి వ్యయంలో ఉద్యోగుల జీతాలు, భద్రతా ప్రమాణాల వ్యయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీల్లో సుమారు 5లక్షలమంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేట్ సంస్థలు తక్కువ మందితో తక్కువ వేతనాలు చెల్లించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటాయి. వచ్చిన ఆదాయాన్నంతటిని లాభాల రూపంలో విదేశాలకు తరలించుకుపోతాయి. కేవలం రెండు, మూడు బడా కార్పొరేట్‌ సంస్థలే దేశీయ బొగ్గు ఉత్పత్తిని శాసించే పరిణామం ఏర్పడుతుంది.


ప్రభుత్వరంగ సంస్థలకి అదనపు టెక్నాలజీని సమకూర్చగలిగినా లేదా మరొక ప్రభుత్వరంగ సంస్థను ఈ రంగంలో ఏర్పాటు చేసినా మన దేశ అవసరాలకు అవసరమైన బొగ్గు ఉత్పత్తులను ప్రభుత్వరంగంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో పెద్ద డిమాండ్‌ సృష్టించబడుతుంది. అంతేకాక బొగ్గు ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఈ వనరులు పరిమిత స్థాయిలో ఉంటాయి గనుక గరిష్టంగా వెలికి తీయటానికి, సమాజ అవసరాలకు పూర్తిగా ఉపయోగపడటానికి దోహదపడతాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్‌ లాభాలకు బలవుతాయి.


దేశంలోని ముడి ఇనుము, బాక్సైట్‌ వంటి ఖనిజాలను సుమారు 500బ్లాకులను కూడా ప్రైవేట్‌పరం చేస్తునట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వీటిపై ఎక్కువ భాగం ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండిసి)కి గుత్తాధి పత్యం ఉంది. ప్రస్తుత నిర్ణయంతో ఈ సంస్థ మనుగడ కోల్పోనున్నది. 2020 మార్చికి దేశంలో 334 నాన్‌క్యాప్టివ్‌ మినరల్‌ బ్లాక్‌ల లీజు గడువు పూర్తయ్యింది. ఇందులో 46 ముడి ఇనుప ఖనిజంతోపాటు బాక్సైట్‌ గనులున్నాయి. ఇవన్నీ కొద్దిమంది బడా పెట్టుబడిదార్ల పరం అవనున్నాయి. ఖనిజ సంపదకోసం విచ్చలవిడిగా తవ్వకాలు మొదలై పర్యావరణ అనుమతులు, భూసేకరణ, అటవీ హక్కుల చట్టాలన్నీ నీరుగారిపోతాయి. ఆదివాసీలను క్రూరంగా తరిమేస్తారు. తీవ్ర పర్యావరణ సమస్యలు మొదలవుతాయి.


మరొక ముఖ్యమైన నిర్ణయం ప్రభుత్వ ఎయిర్‌ పోర్టులను హోల్‌సేల్‍గా బడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం. తక్షణం భువనేశ్వర్‌, వారణాసి, ఇండోర్‌, త్రిచి, అమృతసర్‌, రాయపూర్‌ ఎయిర్‌ పోర్టులను పిపిపి పేర ప్రైవేట్‌ సంస్థలకి అప్పగిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇవన్నీ బిజెపి మిత్రుడైన గౌతమ్ అదాని పరం చేయబోతున్నారు. గత ఏడాది లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌, మంగుళూరు, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌ పోర్టులను అదానీ సంస్థకు లీజుకిచ్చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబాయి, బెంగుళూర్‌ ఎయిర్‌ పోర్టులను చాలాకాలం క్రితమే జిఎంఆర్‌ వంటి సంస్థలపరం చేసారు. మొత్తం ప్రభుత్వ ఆధీనంలో 129 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. కేవలం లాభాలొస్తున్నది 35 మాత్రమే. ఇవన్నీ ఇప్పుడు ప్రైవేట్‌పరమౌతున్నాయి. వీటితో పాటు వీటికి ఆయా నగరాల్లో ఉన్న వేలకోట్ల విలువైన వందల ఎకరాల భూములు కూడా ప్రైవేట్‌ సంస్థల వశమవనున్నాయి.


నాలుగు వ్యూహాత్మక రంగాలను ప్రైవేటికరించటం లేదని ఆర్థిక మంత్రి చెప్పిన మాటల్లో కూడ నిజం లేదు. ఎందుకంటే రక్షణ రంగాన్ని కూడా వదల్లేదు. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు తయారు చేస్తున్న రక్షణ ఉత్పత్తుల్లోకి కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తెరలేపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేట్‌ సంస్థగా మార్చి స్టాక్‌ మార్కెట్‌లో లిస్టు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఏడాదికి సుమారు 30వేల కోట్ల విలువగల ఆయుధ ఉత్పత్తులను అతితక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నాయి. మన సైన్యానికి అవసరమైన ఫిరంగి పరికరాలు, పిస్తోళ్లు, ఇంజన్లు, ట్రక్కులు, బాంబులు, రాకెట్‌ లాంచర్లు, ప్యారాచూట్లు, ఫీల్డ్‌గన్స్‌, బుల్లెట్‌ఫ్రూఫ్‌, నేవీ, ఎయిర్‍ఫోర్స్‌లకు మందుగుండు సామగ్రి వీటన్నింటిని ఇప్పుడు ప్రైవేట్‌సంస్థలు ఉత్పత్తి చేయటానికి అనుమతిచ్చారు. ఇప్పటివరకు ఆయుధ ఉత్పత్తులన్నీ ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలే తయారు చేస్తున్నాయి. ఇప్పటికే దేశానికి అవసరమైన ఆయుధాల తయారీకి అంబానీ, అదానీ, ఎల్‌&టి, టాటా, పిఫావ డిఫెన్స్‌ తదితర సంస్థలకి లైసెన్స్‌లు కూడా మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సంస్థలు ఇప్పుడు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాడ్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకొని మన దేశీయ రక్షణ బడ్జెట్‌నంతా కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్య దేశ రక్షణ వ్యవస్థను పెనుప్రమాదంలో పడేసింది.


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేంద్ర పాలిత విద్యుత్‌ పంపిణీ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. వీటి తరువాత రాష్ట్రాలు కూడా తమ ఆధీనంలోని డిస్కమ్‌లను ప్రైవేటీకరిచాలని ఆదేశించారు. ఇప్పటివరకు డిస్కమ్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. ఆఖరికి అంతరిక్షరంగంలో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతిచ్చారు. ఇప్పటికే ఉన్న ఉపగ్రహాల ప్రయోగాలను, ఇతర అంతరిక్ష ఆధారిత సేవలన్నింటిని ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను బడా కార్పోరేట్‌ సంస్థల గుప్పెట్లో పెట్టబోతున్నారు. ఈ చర్యలు దేశ స్వావలంబనను దెబ్బతీసి పరాధీనతకు దారితీస్తాయి.

డా. బి.గంగారావు

ఆర్థిక రంగ నిపుణులు 

Advertisement
Advertisement
Advertisement