వైఎస్‌ సన్నిహితులతో ఆత్మీయ సమావేశం

ABN , First Publish Date - 2021-08-31T09:56:02+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో కలహాలు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వైఎ్‌సఆర్‌ దుర్మరణం చెంది పుష్కర కాలం అయిన సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి తలపెట్టిన ఆత్మీయ

వైఎస్‌ సన్నిహితులతో ఆత్మీయ సమావేశం

వైఎస్‌ 12వ వర్ధంతి సందర్భంగా

2న హైదరాబాద్‌లో నిర్వహణ

ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలకు ఆహ్వానం పంపిన విజయమ్మ 

జగన్‌, వైసీపీ నేతలకు అందని పిలుపు 

తెలంగాణపైనే విజయమ్మ ఫోకస్‌

కాంగ్రెస్‌, గులాబీ నేతలకూ ఆహ్వానం 

కార్యక్రమ నిర్వహణలో షర్మిలే కీలకం 

ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ 

సమాధి వద్ద విజయమ్మ, షర్మిల నివాళి


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో కలహాలు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వైఎ్‌సఆర్‌ దుర్మరణం చెంది పుష్కర కాలం అయిన సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి తలపెట్టిన ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆనాటి వైఎ్‌సఆర్‌ మంత్రివర్గ సభ్యులు, సహచర నాయకులు, సన్నిహితులు తదితరులతో సెప్టెంబరు 2న హైదరాబాద్‌ శివారు మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశం జరగనుంది. పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్‌ సన్నిహితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నా.. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను, ఆయన పార్టీలో ఉన్న వారిని ఆహ్వానించడం లేదని ప్రచారం జరుగుతోంది.


ఇరు రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల్లో ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్న వారినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నా వైసీపీ నేతలను ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎ్‌సఆర్‌కు అప్పట్లో సన్నిహితంగా ఉన్న నేతలతో పాటుగా అధికారులనూ ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కేవీపీ రాంచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితర నాయకులను, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎంపీలుగా ఉన్న డి. శ్రీనివాస్‌, కె. కేశవరావు, సురేశ్‌రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రె్‌సలో కోమటిరెడ్డి సోదరులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇతర సీనియర్‌ నాయకులను వైఎస్‌ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వైఎ్‌సఆర్‌ కూతురు, వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా పాల్గొంటున్నారు. సుమారు వంద నుంచి 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగానూ ఉన్న విజయలక్ష్మి.. అన్ని పార్టీల్లోని వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానిస్తూ.. కుమారుడు వైఎస్‌ జగన్‌ను,  వైసీపీ నేతలను ఆహ్వానించడం లేదన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షర్మిల.. కార్యక్రమం నిర్వహణలో తన వంతు కీలక పాత్రనూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.


అయితే ఈ కార్యక్రమానికి వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రాంతంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ పెట్టడంలోను, ఆమె సభల నిర్వహణలోనూ విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. వైఎ్‌సఆర్‌ను మరోసారి స్ఫురణలోకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా నిర్వహిస్తుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 


ఇడుపుల పాయలోనూ జగన్‌కు దూరమే..! 

సెప్టెంబరు 2న ఉదయం వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిల, వైఎ్‌సఆర్‌ కుటుంబ సభ్యులు ఏపీలోని ఇడుపులపాయలో వైఎస్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. అదేరోజున ఏపీ సీఎం జగన్‌ కూడా వైఎస్‌ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నట్లు చెబుతున్నారు. అయితే జగన్‌ నివాళి అర్పించే సమయానికి, విజయలక్ష్మి, షర్మిలలు నివాళి అర్పించే సమయం క్లాష్‌ కాకుండా షెడ్యూల్‌ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ అంశం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. 


నేడు గజ్వేల్‌లో షర్మిల దీక్ష

హైదరాబాద్‌/గజ్వేల్‌: వైఎస్‌ షర్మిల మంగళవారం సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించనున్నారు. తొలుత గజ్వేల్‌ మండలం అంతరావుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం గుండన్నపల్లిలో ఒకరోజు దీక్ష చేపడతారు. కాగా, ఆలిండియా సూఫీ ఉస్లేమా కౌన్సిల్‌ అధ్యక్షుడు హకీం సూఫీ.. సోమవారం షర్మిలను కలిసి ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే పలు పార్టీ పార్లమెంటు కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను, కార్యవర్గ సభ్యులను షర్మిల నియమించారు. 

Updated Date - 2021-08-31T09:56:02+05:30 IST