అమెరికా-కెనడా బోర్డర్‌‌లో చనిపోయిన భారతీయ కుటుంబం.. వారి మృతిపై అధికారులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-01-28T17:59:23+05:30 IST

నలుగురు సభ్యులు గల ఓ భారతీయ కుటుంబం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి మృతి చెందిన విషయం తెలిసిందే.

అమెరికా-కెనడా బోర్డర్‌‌లో చనిపోయిన భారతీయ కుటుంబం.. వారి మృతిపై అధికారులు ఏమన్నారంటే..

ఒట్టావా: నలుగురు సభ్యులు గల ఓ భారతీయ కుటుంబం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 19న అమెరికా, కెనడా బోర్డర్‌లో ఈ ఘటన జరిగింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌ ఎమర్సన్‌ బోర్డర్‌ వద్ద యూఎస్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన జగదీష్ బల్దేవ్‌భాయ్ పటేల్(39), అతని భార్య వైశాలి‌బెన్ పటేల్(37), కూతురు విహాంగి పటేల్(11), కుమారుడు ధార్మిక్ పటేల్(03) తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక నలుగురు మరణించారు. ఆ తర్వాతి రోజు మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు వీరి మృతదేహాలను బోర్డర్‌కు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి ఉన్న స్థితిలో కనుగొన్నారు. బుధవారం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మానిటోబా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం మంచులో కూరుకుపోవడంతో ఊపిరాడక పోవడమే వారి మరణానికి కారణమని ధృవీకరించింది. ఈ మేరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.


అటు ఒట్టావాలోని భారత హైకమీషన్ నలుగురు కుటుంబ సభ్యుల మృతులను గుర్తించింది. అనంతరం వివరాలను వారి బంధువులకు తెలియజేసింది. టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ కాన్సులర్ సహాయాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు భారత హైకమీషన్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఇదిలాఉంటే.. పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటోకి చేరుకుందని, ఆరు రోజుల తర్వాత యూఎస్-కెనడా బోర్డర్‌ వెంబడి ఎమర్సన్‌ సరిహద్దు వద్ద అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు ఆర్‌సీఎంపీ నిర్ధారించింది. ఆ క్రమంలోనే వారు తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని చనిపోయినట్లు కెనడా అధికారులు ధృవీకరించారని భారత హైకమీషన్ వెల్లడించింది. 


చనిపోయిన కుటుంబం నేపథ్యమిదీ...

కెనడాలో మృతి చెందిన బాధిత కుటుంబానిది వాస్తవానికి ఉన్నత నేపథ్యమే. కుటుంబ పెద్ద జగదీశ్ పటేల్ ఓ టీచర్. ఊరిలో ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ..తన భార్య వైశాలి(33), కూతురు విహాంగి(13), కుమారుడు ధార్మిక(3)ను తీసుకుని అతడు అమెరికాకు బయలు దేరాడు. పేపర్‌లో ఓ ప్రకటన ద్వారా జగదీశ్ .. ఓ ఏజంట్‌ను సంప్రదించి వీసా లేకుండానే ప్రమాదభరితమైన ప్రయాణం మొదలెట్టాడు. ఆ ఏజంట్ ఆధ్వర్యంలోనే ఇలాంటి మరికొందరు ఓ బృందంగా ఏర్పడి కెనడాకు బయలుదేరారు. ఆ తరువాత.. సరిహద్దు దాటి అమెరికా చేరుకోవాలనేది వారి ప్లాన్. ఈ ప్రమాదకర ప్రయాణం కోసం జగదీశ్ కుటుంబం గత పదేళ్లుగా డబ్బులు కూడబెట్టింది. అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రానికి చేరుకుని అక్కడి నుంచి తమ కల సాకారం చేసుకోవాలనేది వారి లక్ష్యం. ఆ గ్రామంలో నివసిస్తున్న జగదీశ్ బంధువుల్లో దాదాపు సగం మంది అమెరికాలోనే ఉన్నారని డింగుచా గ్రామస్థుడొకరు మీడియాకు తెలిపారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా అమెరికాలో స్థిరపడకపోతే తమ కుటుంబం మొత్తానికీ అవమానమని పటేల్ వర్గం వారు భావిస్తారని కూడా వ్యాఖ్యానించాడు. పటేల్ సామాజిక వర్గం దృష్టిలో అమెరికా కల అంటే..  సమాజంలో ఓ హోదా.. గౌరవానికి ప్రతీక. భారత్‌లో ఆస్తిపాస్తులున్నప్పటికీ వారు సంతృప్తి చెందలేరని, అమెరికా కల సాకారం కోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించేందుకు వెనకాడరని అక్కడి వారు చెబుతున్నమాట.

Updated Date - 2022-01-28T17:59:23+05:30 IST