‘కౌలు’కు కష్టం

ABN , First Publish Date - 2021-06-13T08:21:50+05:30 IST

రాష్ట్రంలో పంట పొలాల కౌలు ధరలు ఏమాత్రం పెరగకపోగా, 20 శాతం దాకా తగ్గాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో గతేడాది ధరలకే ఈ ఏడాదీ కౌలు ఒప్పందాలు జరుగుతున్నా..

‘కౌలు’కు కష్టం

20% తగ్గిన పొలాల కౌలు ధరలు 

అయినా ముందుకురాని రైతన్నలు 

రెండేళ్లుగా నష్టాలు.. దక్కని ‘మద్దతు’

తుఫాన్లు, కొవిడ్‌ నిబంధనల ఎఫెక్ట్‌ 

చాలామంది కౌలురైతులకు దక్కని నష్ట పరిహారం, పెట్టుబడి సాయం 

ఆర్థిక సమస్యలతో సాగుపై అనాసక్తి 


గతేడాది విస్తారంగా వర్షాలు కురిసినా, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. కొవిడ్‌ నిబంధనలతోనూ అన్నదాతలు నష్టపోయారు. దీనికితోడు ఈ-క్రాప్‌, కౌలుసాగు హక్కుపత్రం(సీసీఆర్‌సీ)లు లేని కౌలురైతులకు పరిహారం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పెట్టుబడి సాయం కూడా దక్కలేదు. ఆశించిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోగా.. కొవిడ్‌ నేపథ్యంలో గ్రామాల్లో అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. మరోవైపు సాగుకు పెట్టుబడులు పెరగడం.. కూలీల సమస్యలతో చాలామంది కౌలుదారులు వ్యవసాయంపై ఆసక్తి చూపడం లేదు. 


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పంట పొలాల కౌలు ధరలు ఏమాత్రం పెరగకపోగా, 20 శాతం దాకా తగ్గాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో గతేడాది ధరలకే ఈ ఏడాదీ కౌలు ఒప్పందాలు జరుగుతున్నా.. కాలువల చివరి భూములకు, మెట్ట పొలాలకు డిమాండ్‌ తగ్గింది. కౌలుదారులు తక్కువ ధరకు అడుగుతున్నారని పలు ప్రాంతాల రైతులు చెబుతున్నారు. గతేడాది రాష్ట్రంలో మెట్ట పొలాలు ఎకరానికి అతి తక్కువగా రూ.15 వేలు కౌలు లభించగా, ఈ ఏడాది రూ.12 వేలు కూడా పలకడం లేదు. మిర్చి సాగు చేసే మెట్ట భూమిని నిరుడు గరిష్ఠంగా రూ.40 వేలకు తీసుకుంటే, ఈ ఏడాది అంత కంటే తక్కువకు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. పత్తి, అపరాలు పండించే పొలాలను నిరుడు రూ.18-20 వేలు దాకా ఇవ్వగా, ఈ ఏడాది రూ.16 వేలు మించిన దాఖలా లేదు. వరి సాగు చేసే మాగాణి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి 8-10-12 బస్తాల కౌలు విధానం కొనసాగుతోంది. నగదు రూపంలో అయితే డెల్టా ప్రాంతాల్లో రూ.20 వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.15 వేలు మించి ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం దాకా అంతకుముందు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రవ్యాప్తంగా కౌలు ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. భూముల ధరలకు రెక్కలు రావడం, భూయజమానులు వ్యవసాయానికి దూరమవుతూ రావడం, కౌలుదారులు ఆసక్తిగా ఉండటం ప్రధాన కారణాలు. అప్పట్లో రాయలసీమలో కరువు సమస్యలు వెంటాడినా, కోస్తాలో కౌలు సేద్యం బాగానే సాగింది. గడిచిన రెండేళ్లల్లో వరుస విపత్తులతో రైతులు పంట నష్టపోయారు. ఇందులో కౌలు రైతులే అధికంగా ఉన్నట్లు కౌలురైతుల సంఘం చెబుతోంది. నిరుడు వర్షాలు ఆశాజనకంగా కురిసినా, తుఫాన్లు, ఈదురుగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారిలో 40 శాతం దాకా కౌలు రైతులు ఉన్నారు. కొన్ని పంటలకు మద్దతు ధర లభించినా, మరొకొన్నింటికి దక్కక నష్టాలు చవిచూశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అరకొరగానే అందింది. ఈ-క్రాప్‌, కౌలుసాగు హక్కుపత్రం(సీసీఆర్‌సీ)లు లేని కౌలుదారులకు ఆ కొద్ది పరిహారం కూడా అందలేదు. 


సాగుపై కరోనా ప్రభావం 

వ్యవసాయంపై కరోనా కూడా ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా బారిన పడిన కొంత మంది కౌలు రైతు కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డాయి. సాగు కోసం కౌలు రైతులకు బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలివ్వకపోగా, గ్రామాల్లో అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు పంట అమ్ముకునేటప్పుడు ఈ-క్రాప్‌ నిబంధన.. ప్రభుత్వ సంస్థలకు అమ్మితే సొమ్ము చేతికి రావటంలో జాప్యం కావడం, మార్కెట్‌లో దళారులదే రాజ్యం కావటం, కొవిడ్‌ నిబంధనలు తలనొప్పిగా మారడం వంటి కారణాలతో చాలామంది కౌలు రైతులు పొలాలు కౌలుకు తీసుకోవటానికే భయపడుతున్నారు. దీంతో నిరుడు ఇచ్చిన కౌలు ధరే ఇవ్వండని భూయజమానులు తగ్గుతున్నారు. అయినా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కౌలుదారులు వెనుకాడుతున్నారు.


కౌలు రైతులకు ఏదీ ‘భరోసా’? 

రెవెన్యూ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన కొత్త కౌలు చట్టం ద్వారా భూయజమాని అంగీకరించిన కౌలురైతులకే కౌలుసాగు హక్కుపత్రం ఇస్తుండటంతో ఇప్పటి వరకు 4లక్షల మందికే సీసీఆర్‌సీలు జారీ అయ్యాయి. మొదటి ఏడాది అయితే లక్షమందికి కూడా సీసీఆర్‌సీలు ఇవ్వలేదు. సీసీఆర్‌సీ పొందినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన సుమారు 45 వేల మందే రైతు భరోసా పథకం లబ్ధి పొందారు. రైతు భరోసాలో ఇతర కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ మొండిచేయి చూపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పెట్టుబడి సాయం గత రెండేళ్లు కౌలు రైతుల్లో 10 శాతం మందికి కూడా దక్కలేదు. దేశవ్యాప్తంగా పంట ఎక్కడైనా అమ్ముకునేలా వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌ విధానాన్ని కేంద్రం అమలు చేస్తున్నా.. ఏపీలో రైతులు ఈ-క్రాప్‌ రిజిస్ర్టేషన్‌ లేకుంటే పంట అమ్ముకోవటం కష్టంగా ఉంటోం ది. కౌలు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నం కాదు. 

Updated Date - 2021-06-13T08:21:50+05:30 IST