తెలంగాణలో పంటలకు నిప్పు పెడుతున్న రైతులు

ABN , First Publish Date - 2020-10-28T19:47:28+05:30 IST

తెలంగాణలో రైతులకు కడుపు మండుతోంది.

తెలంగాణలో పంటలకు నిప్పు పెడుతున్న రైతులు

హైదరాబాద్: తెలంగాణలో రైతులకు కడుపు మండుతోంది. వేలకు వేలు ఖర్చుపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా పంటలు సాగుచేస్తే అవి కాస్త దిగుబడి రాకపోవడం, తెగుళ్లు సోకడంతో మండిపడుతున్నారు. దీంతో రైతులు, కౌలు రైతులు పంటలకు నిప్పుపెట్టారు. పంటలకు దోమపోటుతోపాటు ఇతర కీటకాలు చేరడంతో జగిత్యాలకు చెందిన ఓ రైతు నాలుగు ఎకరాల పంటకు నిప్పు పెట్టాడు. మెట్‌పల్లి మండలం, ఆత్మకూరుకు చెందిన తుమ్మల తిరుపతి రెడ్డి నాలుగు ఎకరాల్లో సన్నరకం వరిని సాగు చేశాడు. అయితే పంటకు దోమకాటుతోపాటు ఇతర రోగాలు రావడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి రసాయనాలు చల్లాడు. అయినా లాభం లేకపోవడంతో 4 ఎకరాల పంటకు నిప్పుపెట్టాడు. సీఎం కేసీఆర్ చెప్పడంవల్లే సన్నరకం పంట వేశానని, ఇప్పుడు పూర్తిగా నష్టపోయానని రైతు వాపోయాడు. ప్రభుత్వం తక్షణమే సాయం చేసి ఆదుకోవాలని కోరాడు.


మరోవైపు మెదక్ జిల్లాలోను కౌలు రైతులు పత్తి పంటకు నిప్పుపెట్టారు. సీఎం కేసీఆర్ చెప్పిన పంట వేశామని, పంట తెగులు ఎక్కువై నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది దొడ్డు రకం వరి, లేదా మొక్కజొన్న పంట సాగు చేసేవారమని అన్నారు. ఈసారి కేసీఆర్ చెప్పినట్లుగా సన్నరకం వరి వేశామని చెప్పారు. పంట సరిగా పండకపోవడంతోపాటు ముగ్గురు రైతులు పంటకు నిప్పు పెట్టారు.

Updated Date - 2020-10-28T19:47:28+05:30 IST