Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతిపై ఒట్టేసి.. చిందేసి..

  • నెల్లూరు జిల్లాలో నడిచిన రైతులు
  • యాత్రను అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు
  • దేవుళ్ల రథాలపై పోలీసుల అభ్యంతరం
  • కొద్దిసేపు ఉద్రిక్తత.. అనంతరం సాఫీగానే


నెల్లూరురూరల్‌, నవంబరు 30: రాజధాని చుట్టూ కమ్మిన చీకట్లను చెదరగొట్టేలా డప్పు వాయిద్యాలు, చిందులు! వర్షాల కారణంగా ఆగిన రైతుల మహాపాదయాత్ర.. రెండు రోజుల విరామం తర్వాత మంగళవారం తిరిగి ప్రారంభమైంది. నెల్లూరు రూరల్‌లోని అం బాపురం నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ యాత్రసాగింది. రాజధానిని నిలబెడతామని అమరావతిపై ఒట్టేసి కదులుతున్న రైతులు, మహిళలకు దారిపొడవునా చిందులేస్తూ స్థానికులు స్వాగతాలు పలికారు. మొత్తం 10 కిలోమీటర్లు యాత్రికులు నడిచారు. ఆమంచర్ల జంక్షన్‌ వరకు స్థానికులు, టీడీపీ శ్రేణులు, రైతులకు మద్దతు తెలిపిన వారంతా డప్పు వాయిద్యాలకు చిందు లేస్తూ అమరావతి రైతులను హుషారెక్కించారు. అనంతరం ఆమంచర్ల వద్ద భోజనాల కోసం ఆగారు. అనంతరం బయల్దేరిన పాదయాత్రకు సౌత్‌మోపూరు క్రాస్‌రోడ్డు దాటాక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యం లో భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ఘన స్వాగ తం పలికాయి. ఆమంచర్ల వద్ద రైసు మిల్లర్స్‌ అసోసియోషన్‌ నేతలు రంగయ్యనాయుడు మరికొందరు... రైతులను పలకరించారు. మట్టెంపాడు వరకు పాదయాత్రను జేఏసీ నాయకులు కొనసాగించారు. అయి తే, అక్కడ రాత్రి బసకు అనుకూలత లేకపోవడంతో తిరిగి అంబాపురంలోని శాలివాహన కల్యాణ మండపానికి చేరుకున్నారు. బుధవారం మట్టెంపాడు నుంచి యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. 


కాళ్లు పట్టుకుంటాం.. కనికరించండి..

ఉదయం యాత్రను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా.. ఏఎస్పీ బల్లి రవిచంద్ర తన సిబ్బంది తో అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రలో ఏసు, అల్లా రథాలను తొలగించాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో అవి లేవని అభ్యంతరం తెలిపారు. ‘‘మీ కాళ్లు పట్టుకుంటాం.. మాపై కనికరం చూపండి. మా పాదయాత్రకు అడ్డురావద్దు. మాకు అన్నీ మతాలు, కులాలు ఒక్కటే. అందరి దేవుళ్లను మేం సమానంగా చూస్తాం. మీరొచ్చి మా మధ్య విభేదా లు పెట్టొద్దు.’’ అంటూ అమరావతి రైతులు పోలీసుల కాళ్లు పట్టుకుని అభ్యర్థించారు.  ప్రారంభం నుంచీ ముగ్గురు దేవుళ్ల రథా లు తమతోనే వస్తున్నాయని, ఇంతకాలం లేనిది ఇప్పుడే అభ్యంతరం చెబుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ నాయకులు ప్రశ్నించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో అల్లా, ఏసుప్రభు వాహనాలను ముందు పంపేసి పాదయాత్రను కొనసాగించారు. 


పలకరింపులపై నిఘా

పాదయాత్రలో రైతులకు సంఘీభావం గా కదిలేవారిపై కన్నేశారు. పలకరింపుగా మాట్లాడినవారిపై నిఘా ఉంచారు. వారి వివరాలు, వారితో ఎవరెవరు వచ్చారు. పార్టీ, ప్రజా సంఘాలా? వంటి విషయాలను విచారించారు. చివరకు వారు వచ్చిన వాహనం నంబర్లను కూడా నమో దు చేసుకున్నారు. కాగా, జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం రూ.50 వేల నగదును రైతుల కు అందచేసింది.  


సిగ్గనిపించడం లేదా?

ఇప్పటివరకు మూడు జిల్లాలు దాటుకొని 70 శాతం దూరం పూర్తిచేసుకున్న పాదయాత్రను ఇంకా అడ్డుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి సిగ్గేయడం లేదా అని అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ మండిపడ్డారు. కొన్ని చోట్ల తమకు వసతి ఏర్పాటు చేసినవారిపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement