‘ఐ.వి.ఎఫ్‌’తో సంతాన సాఫల్యం!

ABN , First Publish Date - 2021-07-25T20:40:12+05:30 IST

సహజసిద్ధంగా పిల్లలను కనలేని దంపతుల్లో ప్రపంచవ్యాప్తంగా...

‘ఐ.వి.ఎఫ్‌’తో సంతాన సాఫల్యం!

సహజసిద్ధంగా పిల్లలను కనలేని దంపతుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐ.వి.ఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) కృత్రిమ గర్భధారణ ప్రక్రియ చాలాకాలంగా కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. మంచి ఫలితాలను ఇస్తోంది. అత్యాఽధునిక హంగులు సంతరించుకుంటూ, పిల్లల్లేని దంపతులకు సంతాన సాఫల్యాన్ని చేకూరుస్తున్న ఐ.వి.ఎఫ్‌ విధానం, సహజసిద్ధ గర్భధారణ  పొందలేకపోయిన దంపతులు ఎంచుకోదగిన ఉత్తమమైన ప్రత్యామ్నాయం.. 


నేడు ప్రపంచ ఐ.వి.ఎఫ్‌ దినోత్సవం

పెళ్లైన ఏడాది వరకూ ఎలాంటి గర్భనిరోధక సాధనాలూ ఉపయోగించకపోయినా గర్భం దాల్చలేని దంపతులు ముందుగా వైద్యులను సంప్రదించాలి. కొన్నాళ్లపాటు వారి వైద్యచికిత్సను తీసుకోవాలి. అప్పుడు కూడా ఫలితం లేకపోతే వైద్యుల సలహాతో ఐ.వి.ఎఫ్‌ కోసం ప్రయత్నించవచ్చు. అంతకంటే ముందు మహిళలు హార్మోన్‌ పరీక్షలు, అండాల విడుదల మొదలైన పునరుత్పత్తి అవకాశాలను గమనించుకోవాలి. అలాగే పురుషులు కూడా వీర్య సంబంధ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా దంపతులిద్దరూ గర్భధారణకు అనుకూలమైన ఆరోగ్యాన్ని సమకూర్చుకున్న తర్వాత మొదట ఐయుఐ, ఆ తర్వాత ఐ.వి.ఎఫ్‌ ద్వారా పిల్లల కోసం ప్రయత్నించాలి. 


పండంటి బిడ్డ కోసం...

అధిక బరువుతో ఉన్న మహిళల్లో  పి.సి.ఒ.డి, మధుమేహం, థైరాయిడ్‌ మొదలైన హార్మోన్‌ అసమతౌల్యాలను తెచ్చి పెడుతుంది. మానసిక ఒత్తిళ్లు అధికమవుతాయి. శారీరక సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలిని అలవరుచుకోవాలి. అలాగే మానసిక ఒత్తిడి లేని జీవనం అలవాటు చేసుకోవాలి. పురుషులు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అనుసరించాలి. వేళకు తిండి, నిద్ర, వ్యాయామం తప్పనిసరి. పిల్లలు కలగలేదనే ఒత్తిడికి లోను కాకుండా, పిల్లలను కనగలమనే ఆత్మవిశ్వాసంతో నడుచుకోగలిగితే ఐ.వి.ఎఫ్‌ సక్సెస్‌ రేటు కూడా పెరుగుతుంది. ఒకసారి ఆస్పత్రిలో చికిత్స మొదలుపెట్టిన తరువాత డాక్టర్లు చెప్పినట్లు క్రమం తప్పకుండా వారి దగ్గరికి వెళ్లాలి. నిర్లక్ష్యం పనికిరాదు. మందులు కచ్చితంగా వాడాలి. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది. 


వైఫల్యానికి ఆస్కారం లేకుండా...

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్యులకు చెందిన ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఎంచుకోవాలి. నేరుగా ఐ.వి.ఎఫ్‌కు ప్రయత్నించకుండా దంపతులిద్దరికీ ఆరోగ్య పరీక్షలు చేసి, లోపాలను సరిదిద్ది, ఆ తర్వాతే ఐ.వి.ఎఫ్‌ ప్రక్రియకు ప్రోత్సహించే ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఆశ్రయించడం అవసరం. ఇలా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఐ.వి.ఎఫ్‌కు ప్రయత్నించాలి. అప్పుడే కృత్రిమ గర్భధారణ విజయవంతమై పండంటి బిడ్డను పొందే వీలుంటుంది. అంతవరకు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. 


ఇవి గుర్తుంచుకోవాలి...

ఈ ప్రక్రియ విజయావకాశాలు పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఐ.వి.ఎఫ్‌ కచ్చితంగా సక్సెస్‌ సాఽధించాలంటే, అందుకు అడ్డు తగిలే అంశాలను ముందుగానే సరిదిద్దుకోవాలి. మహిళ వయసు, అండాల ఉత్పత్తి, ఇంప్లాంటేషన్‌...పురుషుల వీర్యం నాణ్యత  మొదలైన అంశాల మీద ఐ.వి.ఎఫ్‌ సక్సెస్‌ రేటు ఆధారపడి ఉంటుంది. ఇది దంపతులిద్దరి ఆరోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. మరీ ముఖ్యంగా...

కొందరు మహిళల అండాశయాలు తక్కువ అండాలను తయారు చేస్తూ ఉంటాయి. హార్మోన్‌ ఇంజెక్షన్లకు కూడా వారి శరీరాలు స్పందించకపోవచ్చు.

ఎంబ్రియోలో క్రోమోజోములకు సంబంధించిన లోపాలున్నా, జన్యు సమస్యలున్నా ఎంబ్రియో గర్భాశయంలో సక్రమంగా ఇంప్లాంట్‌ కాలేదు. ఫలితంగా ఐ.వి.ఎఫ్‌ ఫెయిల్‌ కావచ్చు.

కొందరు మహిళల గర్భాశయం గర్భధారణకు అనువుగా ఉండదు. ఇలాంటప్పుడు ఐ.వి.ఎఫ్‌ ఫెయిల్‌ కావచ్చు. వీటన్నిటికీ వైద్యులు పరిష్కారాలను సూచిస్తారు. 


ఏం చేయాలి?

హార్మోన్‌ ఇంజెక్షన్లను మార్చడం, ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యు పరీక్షలు జరపడం, పి.సి.ఒ, ఎండోమెట్రియాసిస్‌ మొదలైన సమస్యలను ముందుగానే సరిదిద్దుకోవడం, మన్నికైన వీర్యకణాలను ఎంచుకోవడం, అసిస్టెడ్‌ హ్యాచింగ్‌ విధానాన్ని అనుసరించడం, డోనార్‌ ఎగ్స్‌, డోనార్స్‌ ఎంబ్రియో లేదా అద్దె గర్భాలను ఆశ్రయించడం ద్వారా సంతానాన్ని పొందవచ్చు. అలాగే రెండోసారి ప్రయత్నించే ఐ.వి.ఎఫ్‌ సక్సెస్‌ సాధించడం కోసం...

మహిళలు అధిక బరువు తగ్గాలి. వ్యాయామాన్ని పెంచాలి. మైక్రోన్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. కంటి నిండి నిద్ర పోతూ, ఒత్తిడి లేని జీవనశైలి అలవరుచుకోవాలి. థైరాయిడ్‌, మధుమేహం, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ఐ.వి.ఎఫ్‌తో ప్రయాణం ఆసాంతం మానసిక, శారీరక, ఆర్ధిక ఒత్తిడిలతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఐ.వి.ఎఫ్‌ సక్సెస్‌ సాధించడం కోసం ఓర్పుతో, మానసిక ప్రశాంతతతో నడుచుకోవడం అవసరం. 


- డా.ప్రీతిరెడ్డి, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు, రెయిన్‌బో హాస్పిటల్‌, హైదరాబాద్‌


Updated Date - 2021-07-25T20:40:12+05:30 IST