‘బయోమెట్రిక్‌’తోనే ఎరువుల విక్రయాలు

ABN , First Publish Date - 2021-05-08T08:28:59+05:30 IST

డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యానువల్‌ పద్ధతిలో ఎరువులు విక్రయించకూడదని, బయోమెట్రిక్‌ సిస్టమ్‌లోనే (ఈ-పాస్‌ మెషీన్ల ద్వారా) రైతులకు ఎరువులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది.

‘బయోమెట్రిక్‌’తోనే ఎరువుల విక్రయాలు

  • మ్యానువల్‌ వద్దు, ఈ-పాస్‌ మెషీన్లతోనే అమ్మాలి
  • మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర  ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యానువల్‌ పద్ధతిలో ఎరువులు విక్రయించకూడదని, బయోమెట్రిక్‌ సిస్టమ్‌లోనే (ఈ-పాస్‌ మెషీన్ల ద్వారా) రైతులకు ఎరువులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు అమ్మరాదని, ధరల పట్టిక, స్టాక్‌ బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేసింది.  వానాకాలం సీజన్‌లో ఎరువుల పంపిణీకి ప్రణాళిక రచించిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. 25.50 లక్షల  టన్నుల ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. మార్క్‌ఫెడ్‌ కనీసం ఐదు లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ ఉంచుకోవాలని సూచించారు.


నెలవారీ డిమాండ్‌కు అనుగుణంగా ఎరువులు అందేలా ప్రణాళిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులు, ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, డీలర్లకు సూచించారు. ఇండెంట్‌తో పని లేకుండా అత్యవసరం ఉన్న ఏరియాలకు ఎరువులు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆమోదం తర్వాతే డీఏవోలు కేటాయింపులు చేపట్టాలని పేర్కొన్నారు. రిలీజింగ్‌ ఆర్డర్‌ లేకుండా పంపిణీకి వీలులేదని స్పష్టం చేశారు. ఎరువుల లభ్యతను రైతువేదికలు ఇతరత్రా మాధ్యమాల ద్వారా ప్రతి గ్రామానికి సమాచారం అందించాలని సూచించారు. ఫెర్టిలైజర్‌ డీలర్లుగా వ్యవహరించే పీఏసీఎ్‌సలు, మార్క్‌ఫెడ్‌, ఆగ్రోస్‌ ఏజెన్సీలు.. గ్రామాల వారీగా ఎరువులు తీసుకున్న రైతుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ’’

Updated Date - 2021-05-08T08:28:59+05:30 IST