పొరుగింటి పండగ రుచులు

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

సంక్రాంతి పండగ అనగానే ఇంటి ముందు రంగవల్లులు, పతంగుల రెపరెపలతో పాటు, రకరకాల పిండి వంటలు ఘుమఘుమలాడతాయి. బొబ్బట్లు, సకినాలు నోరూరిస్తాయి. అయితే ఈసారి వాటితో పాటు వివిధ రాష్ట్రాల్లో పండగ..

పొరుగింటి పండగ రుచులు

సంక్రాంతి పండగ అనగానే ఇంటి ముందు రంగవల్లులు, పతంగుల రెపరెపలతో పాటు, రకరకాల పిండి వంటలు ఘుమఘుమలాడతాయి. బొబ్బట్లు, సకినాలు నోరూరిస్తాయి. అయితే ఈసారి వాటితో పాటు వివిధ రాష్ట్రాల్లో పండగ రోజున చేసుకునే కొన్ని ప్రత్యేక వంటలను ట్రై చేయండి. వాటి తయారీ విశేషాలు ఇవి...


పటిశప్త (బెంగాల్‌)

కావలసినవి

బొంబాయి రవ్వ - పావుకేజీ, మైదా - 400 గ్రా, పంచదార 200గ్రా, కోవా - 300గ్రా, నూనె - సరిపడా, పాలు - ఒక లీటరు.

తయారీ విధానం

 ముందుగా పాలను బాగా మరిగించాలి. పాలు చిక్కగా అవుతున్న సమయంలో కోవా, కొద్దిగా పంచదార వేసి చిక్కటి పేస్టులా అయ్యేలా చేసుకోవాలి.

  మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిగిలిన పంచదార వేయాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కొద్దిగా నూనె వేసుకుంటూ రవ్వ, మైదా పిండి మిశ్రమాన్ని దోశలా పోయాలి.

  తరువాత చిక్కటి పేస్టులా చేసుకున్న కోవా మిశ్రమాన్ని పైన వేసి రోల్‌లా చుట్టాలి. 

  గోధుమరంగులోకి మారే వరకు కాల్చుకుని సర్వ్‌ చేసుకోవాలి.



చక్కెర పొంగల్‌ (తమిళనాడు)

కావలసినవి

బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు - పావు కప్పు, బెల్లం - ఒక కప్పు, జీడిపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌, తినే కర్పూరం - చిటికెడు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నెయ్యి - అర కప్పు, నీళ్లు - తగినన్ని.

తయారీ విధానం

 స్టవ్‌పై పాన్‌ పెట్టి పెసరపప్పును డ్రై రోస్ట్‌ చేయాలి. చల్లారిన తరువాత పప్పును శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి పప్పుతో పాటు కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

 తరువాత స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి వేడి అయ్యాక బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బెల్లం కరిగి చిక్కగా అయిన తరువాత స్టవ్‌ ఆర్పేయాలి.

  కుక్కర్‌లో ఉడికించుకున్న బియ్యం, పప్పును పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. తరువాత బెల్లం పానకం వేయాలి. యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై కాసేపు ఉడికించి దింపుకోవాలి.

  స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి. ఈ జీడిపప్పును, ఎండుద్రాక్ష, తినే కర్పూరాన్ని పొంగల్‌లో కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.


మకర చౌలా (ఒడిశా)

కావలసినవి

 బాస్మతి బియ్యం - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, అరటిపండ్లు - మూడు, ఆపిల్‌ ముక్కలు - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, దానిమ్మ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌.తయారీ విధానం

 బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.

  తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. 

  కొబ్బరి తురుము, పాలు వేసి మరోసారి గ్రైండ్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.

  ఇప్పుడు ఆపిల్‌ ముక్కలు, పంచదార, దానిమ్మగింజలు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. 

 చివరగా అరటి పండు ముక్కలు వేసి సర్వ్‌ చేసుకోవాలి.


మినప్పప్పు కచోరీ (ఉత్తరప్రదేశ్‌)

కావలసినవి 

మైదా - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు - అరకప్పు, అల్లం ముక్క - చిన్నది, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, సోంపు పొడి - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా. 

  మినప్పప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.

  ఒక పాత్రలో మైదా, గోధుమపిండి తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, కొద్దిగా ఉప్పు, నెయ్యి, కొద్దిగా నూనె వేసి కలియబెట్టుకోవాలి.

  తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా అయ్యేలా కలుపుకొని పలుచటి వస్త్రం కప్పి పక్కన పెట్టాలి.

  ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కాసేపు వేగిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు, ఇంగువ వేసుకోవాలి. 

  తరువాత మినప్పప్పు పేస్టు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నసైజు బాల్స్‌ చేసుకోవాలి.

 ఇప్పుడు మెత్తగా కలిపిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. తరువాత మధ్యలో మినప్పప్పు మిశ్రమం బాల్‌ను పెట్టాలి. చివరలు దగ్గరకు ఒత్తి మళ్లీ చేత్తో కచోరీలా ఒత్తుకోవాలి.

  పాన్‌లో నూనె పోసి కచోరీలు వేయించుకోవాలి.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST