నటుడు దర్జీ అయ్యాడు
ABN , First Publish Date - 2020-04-09T05:30:00+05:30 IST
మలయాళ నటుడు ఇంద్రన్స్ కుట్టు మిషన్ ముందు కూర్చొని ఏదో కుడుతున్నారు. చూసేవారందరికీ ఇదేదో సినిమా సీన్‌లా అనిపించవచ్చు. కానీ... ఇది నటన కాదు...
- మలయాళ నటుడు ఇంద్రన్స్ కుట్టు మిషన్ ముందు కూర్చొని ఏదో కుడుతున్నారు. చూసేవారందరికీ ఇదేదో సినిమా సీన్‌లా అనిపించవచ్చు. కానీ... ఇది నటన కాదు... నిజం! నటుడు కాకముందు దర్జీగా జీవనం సాగించిన ఆయన... ఈ కరోనా కాలంలో తిరిగి పాత వృత్తిలో ఒదిగిపోయారు.
కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బ్రేక్ ద చైన్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంట్లోనే మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో ఇంద్రన్స్ అవగాహన కల్పించారు. అందుకోసం కేవలం నటించకుండా నిజంగానే మాస్క్‌లు కుట్టారు. వీటి తయారీకి ఎలాంటి వస్త్రాన్ని ఎంచుకోవాలి, సులువుగా ఎలా కుట్టాలనే చిట్కాలు ఇచ్చారు. పూజప్పురా కేంద్ర కారాగారంలోని నేరస్తులతో కలిసి మాస్క్‌లు కుడుతున్న ఈ షార్ట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ నటులు, ఇతర ప్రముఖులు సైతం దీన్ని షేర్ చేసి, ఇంద్రన్స్‌ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల పాత్రలు పోషించిన ఇంద్రన్స్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్నో అవార్డులు అందుకున్న ఇంద్రన్స్ ప్రభుత్వం అడగ్గానే భేషజాలకు పోకుండా టైలరింగ్ చేయడానికి ఒప్పుకోవడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.