తుది అంచనా..20,398 కోట్లే!

ABN , First Publish Date - 2021-06-18T08:00:19+05:30 IST

పోలవరం తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలన్న పంచాయితీ ఢిల్లీలో కొనసాగుతోంది. 2013-14 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా 20,398.61 కోట్లేనని.

తుది అంచనా..20,398 కోట్లే!

దానికే కట్టుబడండి.. 2013-14, 17-18 లెక్కల్లో భారీ తేడా

అంచనాలు ఒక్కసారిగా 55,656 కోట్లకు ఎలా పెరిగాయ్‌?

కేంద్ర ఆర్థిక శాఖ సవరణలో 47,725 కోట్లకు ఎలా తగ్గాయ్‌?

పోలవరంపై కేంద్రం ప్రశ్నల వర్షం.. ఢిల్లీలో కొనసాగిన పంచాయితీ

జలశక్తి కార్యదర్శితో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, శ్యామలరావు భేటీ

47 వేల కోట్లకైనా ఆమోదించండి.. పునరావాసానికి 2,500 కోట్లివ్వండి 

అధికారుల అభ్యర్థన.. 500 కోట్ల బిల్లులు తిప్పిపంపడంపై అభ్యంతరం

విభాగాలవారీగా వ్యయాలపై పరిమితులు విధించొద్దని వినతి

కేంద్ర కేబినెట్‌ ‘రాజకీయ’ నిర్ణయమే!.. జలశక్తి అధికారుల సంకేతాలు!!

సీమ ఎత్తిపోతల పాతదే.. కమిటీకి దరఖాస్తులో రాష్ట్రం 


అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలన్న పంచాయితీ ఢిల్లీలో కొనసాగుతోంది. 2013-14 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా 20,398.61 కోట్లేనని.. రాష్ట్రం కూడా దానికే కట్టుబడి ఉండాలని కేంద్రం ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది. కనీసం కేంద్ర ఆర్థిక శాఖ సవరించిన రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలని రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, జల వనరుల కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, కేంద్ర జలసంఘం చైర్మన్‌ హెచ్‌కే హాల్దర్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అనధికారికంగా భేటీ అయ్యారు. తుది అంచనాలు, ప్రాజెక్టు పనుల నత్తనడకపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా.. గురువారం మళ్లీ జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌, అయ్యర్‌, హాల్దర్‌లతో దాస్‌, శ్యామలరావు తదితరులు సమావేశమయ్యారు. అంచనాల పెరుగుదలలో వ్యత్యాసాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు రావాలని జలశక్తి శాఖ నుంచి పిలుపు రావడంతో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్ర వైఖరిలో మార్పు వచ్చినట్లుందని రాష్ట్ర యంత్రాంగం భావించింది. అంచనాల లెక్కలు, కాగితాలూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అనుమతులతో అధికారులు ఢిల్లీ పయనమయ్యారు.


సాంకేతిక సలహా మండలి (టీఏసీ) రూ.55,656.87 కోట్ల తుది అంచనాకు ఆమోదముద్ర వేయడాన్ని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన సవరించిన అంచనాల కమిటీ.. అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లకు కుదించడాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ 2019 మే 21 నాటికి జరిగాయని, కనీసం ఈ మొత్తానికైనా సమ్మతి తెలపాలని కోరారు. అయితే పోలవరం పనుల్లో మార్పులూ చేర్పులూ చోటు చేసుకోవడం.. అంచనా వ్యయం పెరిగిపోవడంపై జలశక్తి శాఖ పలు ప్రశ్నలు సంధించింది. ‘2013-14కూ, 2017-18కు మధ్య లెక్కల్లో వ్యత్యాసం భారీగా ఉంది. 13-14లో రూ.20,398.61 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం అమాంతం రూ.55,656.87 కోట్లకు ఎలా ఎగబాకింది? దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టి సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు ఎలా దిగింది’ అని అడిగింది.


కారణాల వివరణ..

అంచనాల పెరుగుదల కారణాలను రాష్ట్ర అధికారులు వివరించారు. కేంద్రం వెలిబుచ్చిన సందేహాలన్నిటినీ ఇదివరకే నివృత్తి చేశామన్నారు. 41.15 మీటర్ల కాంటూరు మేరకు సహాయ పునరావాస పనులకు తక్షణమే రూ.2,800 కోట్లు విడుదల చేయాలని కోరారు. లేదంటే ఈ ఏడాది భూసేకరణ,  సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టలేమని స్పష్టం చేశారు. అలాగే 45.72 మీటర్ల కాంటూరు భూసేకరణకూ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు కాకున్నా సవరించిన రూ.47,725.74 కోట్లకైనా పెట్టుబడి సమ్మతి ఇవ్వాలని.. ఈ మొత్తాన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించే వరకూ నిధులు విడుదల చేయాలని.. రూ.20,398.61 కోట్లకు పరిమితమై ప్రాజెక్టు పనుల్లో విభాగాలవారీ వ్యయంపై పరిమితులు విధించవద్దని రాష్ట్రప్రభుత్వం కోరింది. పరిమితి దాటారంటూ ఇప్పటికే రూ.500 కోట్ల బిల్లులను తిప్పిపంపారంటూ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రం ముందస్తుగా ఖర్చు చేసిన మొత్తం రాబట్టుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది పాటు వేచి ఉండాల్సి వస్తోందని వాపోయింది. పైగా నాబార్డు నుంచి రుణం తీసుకోవడం వల్ల రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరుగుతోందని తెలిపింది. అసలే రాష్ట్రం రెవెన్యూ లోటులో ఉందని, దీనివల్ల పోలవరం కోసం ముందస్తుగా నిధులు విడుదల చేయలేకపోతున్నామని పేర్కొంది. తాగునీటి పథకం కోసం.. కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిమితులు సడలించి అదనంగా రూ.8,000 కోట్లు విడుదల చేయాలని కోరింది. త్వరితగతిన కేంద్ర కేబినెట్‌ సవరించిన అంచనా మొత్తం రూ.47,725.74 కోట్లకు ఆమోదం తెలిపేలా చూడాలని జలశక్తి శాఖను అభ్యర్థించింది. అయితే.. అధికార యంత్రాంగం తమ పని పూర్తి చేసిందని.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం మాత్రం రాజకీయ నిర్ణయమేనని కేంద్ర అధికారులు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు. దీంతో.. పోలవరం అంచనా వ్యయం, ప్రాజెక్టు పూర్తిపై సందిగ్ధత కొనసాగుతోంది.

Updated Date - 2021-06-18T08:00:19+05:30 IST