గాంధీలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-21T09:53:35+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది..

గాంధీలో అగ్ని ప్రమాదం

భయాందోళనలకు గురైన రోగులు.. ప్రాణనష్టం జరగకుండా సిబ్బంది చర్యలు

రోగులను వేరే వార్డుల్లోకి తరలింపు

పూర్తిగా దగ్ధమైన విద్యుత్‌ కేబుళ్లు 

గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం 

3 రోజుల్లో మరమ్మతులు చేయిస్తామన్న అధికారులు

అడ్డగుట్ట, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన  సూపరింటెండెంట్‌ రాజారావు వెంటనే సిబ్బం దిని అప్రమత్తం చేసి పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం ఉద యం 7.20 గంటల సమయంలో సెల్లార్‌లోని విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ కేబుళ్లలో మంటలు వ్యాపించి సెల్లార్‌ నుంచి నాలుగు అంతస్తుల వరకు విద్యుత్‌ కేబుళ్ల మీదుగా మంటలు చెలరేగాయి. ఆర్థో, నెఫ్రాలజీ, ఇతర అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో మంటలు వ్యాపించాయి. ఆ విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో వారికి ప్రమాదం తప్పింది. గైనిక్‌ వార్డులో ఫీజు బాక్సులో భారీగా మంటలు వ్యా పించి వైర్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన అంతస్తులోని పక్క వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు అటెండర్లను వేరే వార్డుల్లోకి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాంధీకి చేరుకొని ముందుగా గైనిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో మంటలను ఆర్పేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు గాంధీ ఆస్పత్రి సూపర్‌వైజర్లు, సెక్యూరిటీగార్డులు, వార్డు బాయ్‌లు దాదాపు 45 నిమిషాలు శ్రమించడంతో మంటలు వ్యాపించకుండా ప్రమాదాన్ని నివారించగలిగారు. ఆస్పత్రిలో జరిగిన ప్రమాద విషయం తెలుసుకున్న డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి గాంధీ ఆస్పత్రికి చేరుకుని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆస్పత్రిలో విద్యుత్‌ కేబుళ్లు పూర్తి గా కాలిపోయాయని, మూడు రోజుల్లో  మరమ్మతు చేయిస్తా మని చెప్పారు. కాగా, అగ్ని ప్రమాదం వల్ల ఉదయం 7.20 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆస్పత్రిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో చిన్న చిన్న శస్త్ర చికిత్సలు వాయిదాపడ్డాయి.  


జాగ్రత్తల వల్లే ప్రమాదం తప్పింది

ఆస్పత్రిలో ‘ఫైర్‌ సేఫ్టీ’ని ఇటీవలే ఏర్పాటు చేశాం. దాని వల్లనే ఈ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగాం. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రమాదాలపై పలుసార్లు ఆస్పత్రి ఆవరణలో మాక్‌డ్రిల్‌ నిర్వహించాం. ఆస్పత్రిలో అగ్నిప్రమాదాల ని వారణకు ఇటీవల 120 మంది సిబ్బందితో ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మంటల తీవ్రత పెరగకుండా మా సిబ్బంది బాధ్యత తీసుకుని పనిచేశారు. 

- రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌

Updated Date - 2021-10-21T09:53:35+05:30 IST