మూడు నెలలలు... 22 ఐపీవోలు...

ABN , First Publish Date - 2021-04-23T01:05:37+05:30 IST

కిందటి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ఐపీవోల హవా నడిచింది.

మూడు నెలలలు... 22 ఐపీవోలు...

బెంగళూరు : కిందటి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ఐపీవోల హవా నడిచింది. ఏకంగా 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. వీటి విలువ దాదాపు రూ. 19 వేల కోట్లు లేదా 2.5 బిలియన్ డాలర్లకు పైనే. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓలను చూస్తే సంఖ్యాపరంగా ప్రపంచంలో భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది.


ఈవై ఇండియా ఐపీవో నివేదిక ప్రకారం... కన్స్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్, బహుళార్ధ పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమోటివ్, ట్రాన్స్‌పొర్టేషన్ రంగాలకు చెందిన సంస్థలు స్టాక్ మార్కెట్‌లోకి అధికంగా వచ్చాయి. ఐదు చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. వీటిలో భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్ప్ ఐపీవో అతిపెద్దది. ఈ ఇష్యూ విలువ రూ. 4,740 కోట్లు. ఈ ఏప్రిల్-జూన్ కాలంలోను ఐపీవోలు భారీగానే వస్తాయనే అంచనాలున్నాయి.  ప్రధాన మార్కెట్‌లో 17 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా, గతేడాది తొలి త్రైమాసికంలో ఒక్క కంపెనీ మాత్రమే ఐపీఓకు రావడం గమనార్హం.


గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో పది కంపెనీలు ఆఫరింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మరో ఇరవై కంపెనీలు ఐపీఓకు వచ్చే అవకాశముంది. మరో 30 కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు వాటాలను ఉపసంహరించుకునే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-04-23T01:05:37+05:30 IST