తల లేకున్నా కాంతిని గుర్తించే ‘ఫ్లాట్‌వార్మ్‌’

ABN , First Publish Date - 2021-06-22T09:24:22+05:30 IST

మనం కళ్లతోనే వెలుగునైనా, చీకటినైనా గుర్తిస్తాం.. అలాంటిది ఏకంగా తలే లేకున్నా.. కాంతిని పసిగట్టగల ఒక సూక్ష్మజీవిని హైదరాబాద్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరే ‘ ప్లనారియన్‌ ఫ్లాట్‌వార్మ్‌’.

తల లేకున్నా కాంతిని గుర్తించే ‘ఫ్లాట్‌వార్మ్‌’

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మనం కళ్లతోనే వెలుగునైనా, చీకటినైనా గుర్తిస్తాం.. అలాంటిది ఏకంగా తలే లేకున్నా.. కాంతిని పసిగట్టగల ఒక సూక్ష్మజీవిని హైదరాబాద్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరే ‘ ప్లనారియన్‌ ఫ్లాట్‌వార్మ్‌’. ఇది అకశేరుకం..  కేవ లం 1 నుంచి 10 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఫ్లాట్‌వార్మ్‌లు చెరువులు, నదులు, సరస్సులు, నీటి కుంటలు, కాల్వల్లో ఉంటాయి. వాటికి ఉండే అతిసూక్ష్మమైన కళ్లు సూర్యకాంతిని తాళలేవు. కాంతిని చూడకుండా ఉండేందుకుగానూ ఇవి రాళ్లురప్పలు, బురద, మొక్కల కింద తలదాచుకుంటాయి. అధ్యయనంలో భాగంగా ఫ్లాట్‌వార్మ్‌ తలను తొలగించి దాని శరీరంపైకి అతికొద్ది మోతాదులో అతినీల లోహిత కిరణాలను శాస్త్రవేత్తలు ప్రసరింపజేశారు. ఆ పరిస్థితిలోనూ అది కాంతిని గుర్తించి.. కాంతి లేని ప్రదేశం వైపుగా పాక్కుంటూ వెళ్లిపోవడాన్ని గుర్తించారు. 


కంటితో సంబంధం లేకుండా.. ఫ్లాట్‌వార్మ్‌కు కాంతికి సంబంధించిన సమాచారాన్ని అందించేలా దాని శరీరంలో నేచురల్‌ లైట్‌ సెన్సింగ్‌ ప్రొటీన్లు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఆ ప్రొటీన్ల గుట్టును తెలుసుకోగలిగితే కంటిచూపు లేని వారికి దైనందిన జీవితంలో ఉపయోగపడగలిగే సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు డాక్టర్‌ ఆకా్‌షగుల్యానీ, నిషాన్‌ సెట్టింగార్‌, ఇన్‌స్టెమ్‌ బెంగుళూరుకు చెందిన డాక్టర్‌ దాశరథి పాలకొడేటి జరిపిన సంయుక్త అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఓ ప్రముఖ అమెరికన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Updated Date - 2021-06-22T09:24:22+05:30 IST