కుండపోత

ABN , First Publish Date - 2020-10-14T07:50:30+05:30 IST

వానంటే వాన కాదు! కుండపోతలాంటి వాన! ఆగకుండా కురిసిన జడి వాన! గుంటూరులో మొదలుపెట్టి... కృష్ణా జిల్లాలో కుమ్మేసి, ఉభయ గోదావరి జిల్లాలను కుదిపేసి, ఆపై ఉత్తరాంధ్రను తడిపేసిన వాన!...

కుండపోత

తీరం దాటుతూ ముంచెత్తిన వాయుగుండం

కాకినాడలో తీరం దాటిన వాయుగుండం

తూర్పుగోదావరి జిల్లా కకావికలం 

పశ్చిమ గోదావరిలోనూ తీరం విలవిల

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

బెజవాడలో 10 ఏళ్లలో అతి భారీ వాన

లక్షలాది ఎకరాల్లో పంట మునక 

తీరంలో 75 కి.మీ. వేగంతో గాలులు

4.5 మీటర్ల ఎత్తుకు ఎగసిన అలలు

ఉప్పొంగిన వాగులు.. వంకలు

కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

హైదరాబాద్‌కూ రాకపోకలు బంద్‌

కూలిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు

అంధకారంలో అనేక గ్రామాలు

జలదిగ్బంధంలో రైల్వేస్టేషన్లు, బస్‌ డిపోలు

ప్రభుత్వ కార్యాలయాల్లోకీ చేరిన నీరు

ఇళ్లు, గోడలు కూలి ఇద్దరి మృతి

ప్రవాహాల్లో నలుగురు గల్లంతు


వానంటే వాన కాదు! కుండపోతలాంటి వాన! ఆగకుండా కురిసిన జడి వాన! గుంటూరులో మొదలుపెట్టి... కృష్ణా జిల్లాలో కుమ్మేసి, ఉభయ గోదావరి జిల్లాలను కుదిపేసి, ఆపై ఉత్తరాంధ్రను తడిపేసిన వాన! తీవ్ర వాయుగుండం తుఫానుగా మారకముందే మంగళవారం ఉదయం కాకినాడ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి నుంచే వాన దంచికొట్టడం మొదలైంది. మంగళవారం కూడా కురుస్తూనే ఉంది. దీని దెబ్బకు వాగులు పొంగిపొర్లాయి. పలుచోట్ల వంకలు రోడ్లెక్కడంతో రాకపోకలు ఆగిపోయాయి. పొట్ట దశకు వస్తున్న వరి చేలు కిందికి పడకేశాయి. విజయవాడలో కొన్ని రహదారులు కాల్వలను తలపించాయి. ఇక... హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజూ కుంభవృష్టి కురిసింది. దాదాపు పాతికేళ్ల కిందట  హైదరాబాద్‌లో ముంపు ప్రాంతాల నుంచి పడవల్లో ప్రజలను తరలించారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఏర్పడింది. రహదారులపై ‘ఏర్లు’ పారాయి. కార్లు, వాహనాలు మునిగిపోయి... కొట్టుకుపోయేంతగా పోటెత్తాయి. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌ సాగర్‌ పూర్తిగా నిండింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ వాన కుమ్మేసింది. ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జంట నగరాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించారు. వరద నీరు జాతీయ రహదారిపైకి ఎక్కడంతో హైదరాబాద్‌-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తీరం దాటుతూనే జల విలయం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిపించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాను ముంచింది. మంగళవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరం దాటింది. ఆ సమయంలో తీరప్రాంతంలో గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్ర తీరం వద్ద అలలు 4.5 మీటర్ల ఎత్తుకు ఎగశాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాలుగు విద్యుత్‌ సబ్‌స్టేషన్లలోకీ నీరు  చేరడంతో అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రవాహాల్లో నలుగురు గల్లంతయ్యారు. ఇల్లు, గోడ కూలి ఇద్దరు మరణించారు. విశాఖ జిల్లాలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోవడంతో మహిళ మరణించారు. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లో ఎడతెరపి లేకుండా జడివాన పడింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వానలు కురిశాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. 


రాష్ట్రవ్యాప్తంగా 368 మండలాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగితా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాగులు, వంకలు, కాల్వలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండవ, ఏలేరు, పంపా జలశయాలు నిండుకుండల్లా మారాయి. ఉప్పాడలో 15 ఇళ్లు కూలిపోయాయి. ఏలేరు రిజర్వాయర్‌ నిండుకోవడంతో 12 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఏలేరు సుద్దగడ్డ వాగు పొంగడంతో గొల్లప్రోలు పట్టణంలోని ఈబీసీ కాలనీ నీట మునిగింది.  కాకినాడ మత్యకారులు ఆరుగురు సముద్రంలో వేటకు వె ళ్లడంతో ఫైబర్‌ బోటు బోల్తా పడింది. వారి హాహాకారాలు విని అటుగా వెళ్తున్న ఇంజిన్‌ బోటులోని మత్య్పకారులు రక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో  1,30,232 హెక్టార్ల వరి పంట నీటమునిగింది. గోదావరి నదిలో వరద పెరుగుతోంది.

Updated Date - 2020-10-14T07:50:30+05:30 IST