ఆర్థిక పటిష్ఠతపైనా దృష్టిపెట్టండి..

ABN , First Publish Date - 2021-01-03T06:07:32+05:30 IST

కొత్త సంవత్సరంలోనైనా ఆరోగ్యంపై దృష్టిసారించాలని, ఫిజికల్‌ ఫిట్‌నెట్‌ పెంచుకోవాలని చాలామంది తీర్మానించుకుంటారు. మంచిదే.

ఆర్థిక పటిష్ఠతపైనా దృష్టిపెట్టండి..

కొత్త ఏడాదిలో ఫైనాన్షియల్‌ ఫిట్‌నెస్‌ పెంచుకోండిలా.. 


కొత్త సంవత్సరంలోనైనా ఆరోగ్యంపై దృష్టిసారించాలని, ఫిజికల్‌ ఫిట్‌నెట్‌ పెంచుకోవాలని చాలామంది తీర్మానించుకుంటారు. మంచిదే. మరి మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందా..?  లేదంటే, దేహ దారుడ్యంతో పాటు ఆర్థిక పటిష్ఠతపైనా దృష్టిపెట్టండి. కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యక్తిగత, కుటుంబ అవసరాలు గుర్తించి, ముందస్తు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం కీలకంగా మారింది. ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితానికి 2021లోనే శ్రీకారం చుట్టండిలా...



అత్యవసర నిధి 

కరోనా సంక్షోభం చాలా మందికి నేర్పిన గుణపాఠమిది. ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు, ఆపత్కర పరిస్థితుల నుంచి సాఫీగా గట్టెక్కేందుకు అత్యవసర నిధి ఎంతో ముఖ్యం. కనీసం 3-6 నెలల పాటు కుటుంబ పోషణ, రోజువారీ ఖర్చులు, రుణాల తిరిగి చెల్లింపులకు అవసరమైన సొమ్మును పక్కన పెట్టుకోవడం ఉత్తమమని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఈ సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం మేలని వారంటున్నారు. 


ఆర్థిక ప్రణాళిక 

ఆర్థిక లక్ష్యాల సాధనకు ముందస్తు ప్రణాళిక ఎంతో ముఖ్యం. ఆర్థిక ప్రణాళిక ద్వారా మీ ఆదాయం లేదా సంపద నిర్వహణకు వ్యూహరచన చేయండి. తద్వారా పెట్టుబడులకు మార్గనిర్దేశం లభిస్తుంది. లక్ష్యాల సాధనకు ఎంత సమ యం పడుతుందనే విషయంలోనూ స్పష్టత లభిస్తుంది. 


బీమాతో భవిష్యత్‌కు ధీమా 

కొవిడ్‌ లాంటి సంక్షోభ సమయాల్లో బీమా కవరేజీ భవిష్యత్‌కు ధీమా కల్పిస్తుంది. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా ఉంటే ఉత్తమం. అయితే, మీ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు కవరేజీ కల్పించే, మీకు అందుబాటులో ఉండే పాలసీలను ఎంచుకోవడం ఎంతో కీలకం. అలాగే, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లింపులు, నిర్దిష్ట గడువు తేదీల్లో పాలసీల పునరుద్ధరణ కూడా ముఖ్యమే. 


క్రమానుగత పెట్టుబడులు 

చిన్న మొత్తాల్లో, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్‌లో భారీ ప్రతిఫలాలు అందుకోవచ్చు. క్రమానుగుణ పెట్టుబడుల (సిప్‌) ద్వారా పొదుపుపై ఆసక్తి పెరగడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణా అలవడుతుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు క్రమానుగత పెట్టుబడులు ఎంతో కీలకం. 


ఆరోగ్యమే మహాభాగ్యం 

జీవితంలో ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదంటారు పెద్దలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం, చురుకుదనం పెంచుకోవాలి. ఆర్థికంగా ఎదిగేందుకు శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. 


ఖర్చులకు కళ్లెం  

బాగా సంపాదించగానే సరికాదు. ఖర్చులపైనా నియంత్రణ అవసరం. ఆర్థిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యం. లేదంటే, ఆదాయం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అనవసర, విలాస ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడంతో పాటు పొదుపు పెంచడంపై దృష్టి సారించండి. నెలవారీ ఖర్చులకు ముందుగానే బడ్జెట్‌ తయారు చేసుకోండి.

నెలాఖరులో వాస్తవ ఖర్చును, బడ్జెట్‌ అంచనాతో పోల్చి చూసుకోండి. తద్వారా అనవసరమైన ఖర్చులను గుర్తించి, వాటికి కళ్లెం వేసేందుకు వీలుంటుంది. క్రెడిట్‌ కార్డును అత్యవసరాల్లోనే ఉపయోగించండి. షాపింగ్‌, ఇతర అవసరాలకు డెబిట్‌ కార్డు ద్వారానే చెల్లించండి. తద్వారా పరిమితంగా ఖర్చు చేయడం అలవాటవుతుంది. 


Updated Date - 2021-01-03T06:07:32+05:30 IST