2 లక్షల కేసులకు...ఖాళీ ఆక్సిజన్‌ బెడ్లు 2 వేలే

ABN , First Publish Date - 2021-05-14T09:02:03+05:30 IST

‘‘రాష్ట్రంలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్నవారు రెండు లక్షలు. రోజుకు 20 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే రాష్ట్రంలో ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకలు 2,000 మాత్రమే ఖాళీగా

2 లక్షల కేసులకు...ఖాళీ ఆక్సిజన్‌ బెడ్లు 2 వేలే

రోజూ 20 వేలకుపైగా పాజిటివ్‌లు

మీ డాష్‌ బోర్డు చూసే గుండె బద్దలవుతోంది

ప్రభుత్వ వైఫల్యంతో వేల సంఖ్యలో మరణాలు

వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టకుండా కులం పేరుతో దూషించడమా: టీడీపీ 

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్నవారు రెండు లక్షలు. రోజుకు 20 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే రాష్ట్రంలో ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకలు 2,000 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇది ప్రభుత్వ డాష్‌ బోర్డు సమాచారం. ఆక్సిజన్‌ అవసరమై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వేల మంది రోగులు ఎక్కడికి వెళ్ళాలి? దిక్కులేని పరిస్థితుల్లో ఆస్పత్రుల గేట్ల ముందు ప్రాణాలు వదలడమేనా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రుల్లో వసతులు, సదుపాయాలు పెంచడాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని, దాని ఫలితంగా సామాన్యులు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని విమర్శించారు. ‘‘ప్రభుత్వ డాష్‌ బోర్డులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఐసీయూ పడకలు కేవలం 377. వెంటిలేటర్లు 693. ఆక్సిజన్‌ పడకలు 1397.  అందుకే ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్లు దొరక్క పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. ఉత్తరాంధ్రలో 45 వేల మంది చికిత్స పొందుతున్న రోగులు ఉంటే ఐసీయూ పడకలు కేవలం 37, వెంటిలేటర్‌ పడకలు కేవలం 4 మాత్రం ఖాళీలు న్నాయి’’ అని వివరించారు. 21 వేల యాక్టివ్‌ కేసులున్న చిత్తూరు జిల్లాలో వెంటిలేటర్‌ పడకలు 2, ఐసీయు పడకలు 36 మాత్రం ఖాళీ ఉన్నాయన్నారు.


 నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఒక్క వెంటిలేటర్‌ పడక కూడా లేదని, ఐసీయూ పడకలు మాత్రం కేవలం 6 ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప మొత్తం మీద ఒక్క ఐసీయు పడక మాత్రమే ఖాళీగా ఉందని డాష్‌ బోర్డు సూచిస్తోందన్నారు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలు ఒక్కటీ ఖాళీ లేదని, ఆరోగ్య శ్రీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో కూడా సగం జిల్లాల్లో వెంటిలేటర్‌, ఐసీయూ పడకలు ఖాళీ అని చూపిస్తోందని వెల్లడించారు. ‘‘కరోనా మొదటి దశ తర్వాత అనేక రాష్ట్రాలు వెంటిలేటర్‌, ఐసీయూ సామర్థ్యం పెంచుకొన్నాయి. ఈ రాష్ట్రంలో మాత్రం కాళ్ళు బారజాపి పడుకొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఈ ప్రభుత్వంలో ఒక్కరైనా బాధ్యత తీసుకొన్నారా? వ్యాక్సిన్‌ కంపెనీలకు ఆర్డర్లు పెట్టకుండా, డబ్బులు చెల్లించకుండా వాటి యజమానులకు కులం అంటకట్టి చేతులు దులుపుకొంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఒక కంపెనీ మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేస్తుంటే దానిని కులం పేరుతో దూషిస్తారా? అంత కుల ద్వేషం ఉంటే ఆ కంపెనీ వ్యాక్సిన్‌నే ఎందుకు వేయించుకొన్నారు? వేరేది వేయించుకోలేకపోయారా? చేతగాని దద్దమ్మ మాటలతో కాలక్షేపం చేసే బదులు దిగిపోతే చేతనైనవాడు ఎవరైనా వచ్చి పాలన చేస్తారు’’ అని పట్టాభి అన్నారు.

Updated Date - 2021-05-14T09:02:03+05:30 IST