Abn logo
Jun 19 2021 @ 03:54AM

తెలంగాణ పాస్‌పుస్తకాల ఫోర్జరీ

  • 56 కోట్ల విలువైన స్థలాలపై కన్ను..
  •  అమ్మకానికి పెట్టిన ముఠా.. 
  • ఆట కట్టించిన సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): హైసెక్యూరిటీ ఫీచర్స్‌తో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలనే ఆ ముఠా ఫోర్జరీ చేసింది. అంతేకాదు.. ఓ బడా రియల్‌ఎస్టేట్‌ సంస్థకు చెందిన రూ. 56 కోట్లు విలువ చేసే 40 ఎకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించింది. ఓ వ్యాపారవేత్తకు అమ్మేందుకు బేరం పెట్టింది. అడ్వాన్స్‌గా రూ. 8.50 కోట్లు తీసుకుంది. చివరికి పోలీసులకు చిక్కి, కటకటాలపాలైంది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామంలో ఓ బడా రియల్‌ఎస్టేట్‌ సంస్థకు 40 ఎకరాల భూమి ఉంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన పిడుగు ఆదినారాయణ మూర్తి కన్ను ఈ భూములపై పడింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కేంద్రంగా 15 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఆదినారాయణ.. భూముల క్రయవిక్రయాలు, ఫోర్జరీ పత్రాలు, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడంలో పండిపోయాడు. 


కైలాస్‌ హిల్స్‌కు చెందిన తవ్వ వెంకట మురళీ కృష్ణ, కేశంపేటకు చెందిన పిప్పల యాదయ్య, షాద్‌నగర్‌కు చెందిన కుంబర్తి రాము అలియాస్‌ రామ్‌ప్రసాద్‌, మహేశ్వరానికి చెందిన వడ్డీ అశోక్‌తో ముఠా కట్టాడు. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ కింది స్థాయి సిబ్బందిని మచ్చిక చేసుకున్నాడు. వారిద్వారా.. ఖాళీగా ఉంటున్న భూముల రిజిస్ట్రేషన్‌ పత్రాల నకలును తెప్పించుకుని, మక్కీకిమక్కీ నకిలీలు సృష్టించేవాడు. ఈ క్రమంలో గొల్లూరులోని 40 ఎకరాలు చాలా కాలంగా ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. వాటిపైనా నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించాడు. కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఈ భూమిని రూ. 56 కోట్లకు అమ్ముతామంటూ 2019లో ఒప్పందం కుదర్చుకున్నాడు. రూ.8.50 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. రెండేళ్లయినా.. సేల్‌డీడ్‌ పత్రాలు చేతికి ఇవ్వకపోవడంతో.. ఆ వ్యాపారవేత్త నుంచి ఆదినారాయణకు ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. పత్రాలను చేతికి ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంతో.. సదరు వ్యాపారవేత్త అనుమానంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వాకబు చేశారు. 


ఆ భూమి ఓ బడా రియల్‌ఎస్టేట్‌ కంపెనీకి చెందినదని గుర్తించి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం రంగంలోకి దిగి, పిడుగు ఆదినారాయణ ముఠా ఆటను కట్టించింది. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి పదుల సంఖ్యలో నకిలీ డాక్యుమెంట్లను సీజ్‌ చేసింది. అందులో.. ఏపీకి చెందిన 44, తెలంగాణకు చెందిన 7 హైసెక్యూరిటీ పట్టాదారు పాస్‌పుస్తకాలు, 16 ఖాళీ పాస్‌పుస్తకాలు, 92 రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ డాక్యుమెంట్లు, తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలకు సంబంధించిన 9 రబ్బర్‌ స్టాంపులు, 5 నకిలీ ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులు, 2 నకిలీ రేషన్‌కార్డులు ఉన్నాయి. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని, మళ్లీ విచారిస్తామని సజ్జనార్‌ వెల్లడించారు.