దిగ్గజ ఫుట్‌బాలర్‌ అహ్మద్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2021-04-18T05:42:31+05:30 IST

భారత ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ డిఫెండర్లలో అగ్రగణ్యుడు.. హైదరాబాద్‌కు చెందిన మాజీ ఒలింపియన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ లాలా (89) కొవిడ్‌తో మృతి చెందాడు...

దిగ్గజ ఫుట్‌బాలర్‌ అహ్మద్‌ ఇకలేరు

  • కొవిడ్‌తో మృతి 
  • ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ డిఫెండర్లలో అగ్రగణ్యుడు.. హైదరాబాద్‌కు చెందిన మాజీ ఒలింపియన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ లాలా (89) కొవిడ్‌తో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడ్రోజుల కిందట బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా, అక్కడ చేసిన కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం అర్ధరాత్రి అహ్మద్‌ తుదిశ్వాస విడిచాడు. 1932లో హైదరాబాద్‌లో జన్మించిన అహ్మద్‌.. నిజాం కళాశాల విద్యార్థి. మెల్‌బోర్న్‌ (1956) ఒలింపిక్స్‌, టోక్యో ఆసియా క్రీడల (1958)తో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.  1956లో బల్గేరియా టోర్నీతో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన అహ్మద్‌..1960లో ఢాకాలో జరిగిన ఆగాఖాన్‌ గోల్డ్‌కప్‌ నెగ్గిన జాతీయ జట్టులో కూడా అహ్మద్‌ సభ్యుడు. కెరీర్‌ తొలినాళ్లలో మహ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌కు ఆడిన అతడు 1957లో కోల్‌కతాలోని మోహన్‌ బగాన్‌ క్లబ్‌కు మారాడు. ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక సాయ్‌ కోచ్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అహ్మద్‌ కుటుంబంతో  బెంగళూరు తరలివెళ్లాడు. అతడు భారత్‌ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశాడు. అహ్మద్‌ సేవలకు ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు రాలేదని ఇప్పటికైనా అతడికి పద్మశ్రీ ప్రకటించాలని మాజీ ఒలింపియన్‌ ఎస్‌.ఎస్‌ హకీమ్‌ కోరాడు. అహ్మద్‌ మృతి పట్ల భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌, తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫల్గుణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-18T05:42:31+05:30 IST