కౌంటర్ ఎటాక్‌లో అయ్యన్న సూపర్

ABN , First Publish Date - 2020-10-16T19:23:12+05:30 IST

ఏపీలో ఆ నాయకుడు అధికార పార్టీకి పంటికింద రాయిలా మారారు. లీడర్ల జాతకాలు బయటపెడుతూ వారి వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. సంచలన ఆరోపణలు చేస్తూ

కౌంటర్ ఎటాక్‌లో అయ్యన్న సూపర్

ఏపీలో ఆ నాయకుడు అధికార పార్టీకి పంటికింద రాయిలా మారారు. లీడర్ల జాతకాలు బయటపెడుతూ వారి వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. సంచలన ఆరోపణలు చేస్తూ ఓ అమాత్యుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ధమ్ముంటే నిజాలు చూపించాలనే సదరు మంత్రిగారికి ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. ఇంతకీ మినిస్టర్‌ బండారాన్ని ఆ నాయకుడు ఎలా బయటపెడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్‌ ఏబీఎన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ చదవాల్సిందే.. 


ఏపీలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికార వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు. సంచలన ఆరోపణలతో ఆ పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మంత్రి గారు బెంజి కారు అంటూ మెరుపు షాట్లతో ఆధికార పార్టీని బెంబేలెత్తించారు. జగన్ పాలన మీద ఆయన హాట్ కామెంట్స్ చేస్తూ కంట్లో నలుసుగా మారారు. బెంజి కారుతో మొదలుపెట్టిన అయ్యన్నపాత్రుడి ఆరోపణలు ఇపుడు వందల ఎకరాల భూ దందా దాకా సాగింది. తాజాగా మంత్రి జయరాం 200 ఎకరాల భూములను కొనుగోలు చేశారంటూ అయ్యన్న చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. గతంలో విశాఖ భూకుంభకోణాలపై సిట్ వేయాలని డిమాండ్‌ కూడా చేశారు. 



ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది వరకు సైలెంట్‌గా ఉన్న అయ్యన్న..ఇటీవల దూకుడు పెంచారు.  జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్‌మీట్లు పెట్టి విరుచుకుపడుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం టిడిపి నేతలపై దాడులు చేయడం..పలువురు కీలక నాయకులపై కేసులు పెట్టడం..కిందిస్థాయి నేతలను ఇబ్బందులకు గురిచేయడం అయ్యన్నను కలిచివేసిందట. ఇది టిడిపి క్యాడర్‌లో  మనోధైర్యం కోల్పోయేలా చేసిందనీ..అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారని చెబుతారు.  ప్రత్యక్ష పోరాటాల కన్నా, ప్రజలకు మన వాణి వినిపించాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. తన టీమ్ ద్వారా  ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు, అన్యాయాలపై ఎప్పటికప్పుడు సమచారం సేకరిస్తున్నారని చెబుతున్నారు. పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారట. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ట్వీట్ చేశారంటే.. వెంటనే అయ్యన్నపాత్రుడు దానికి కౌంటర్‌ ట్వీట్‌ ఇస్తూ వారికి కొరకరాని కొయ్యగా మారారు. 




ఇక కార్మిక శాఖ మంత్రి జయరాంపై అయ్యన్న చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. బెంజ్‌ కారు వివాదం, కార్మిక శాఖలో అక్రమాలు,  భూముల వ్యవహారంలో వెలుగు చూస్తున్న ఆరోపణలు ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. నిరాధార ఆరోపణలని సెటైర్‌ వేసే ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చూపించే సరికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. అయ్యన్నపాత్రుడికి టిడిపి అధినాయకత్వం నుంచి పూర్తి సహాకారం అందించింది. మంత్రి జయరాంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో అయ్యన్న సక్సెస్ అయ్యారన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వానికి తగలాల్సిన దెబ్బ తగిలిందన్న విశ్లేషణలు సాగుతున్నాయట. 


మంత్రి జయరాం లోగుట్టును ఆయ్యన్న టిమ్‌ పకడ్బందీ ప్లాన్‌తో గుర్తించిందట. ఒకవేళ అధికార పార్టీ బీసి మంత్రం అందుకుంటే..అదే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్నతో బీసీ మంత్రి జయరాం లోపాలను ఎండగట్టేలా ప్లాన్‌ చేశారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో అమరావతి కేంద్రంగా టీడీపీ నాయకులు వాయిస్‌ వినిపిస్తే..ఇప్పుడు విశాఖ నుంచి వినిపించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయ్యన్నతో పాటు బండారు, మరికొందరు నేతలు స్వరం పెంచడానికి కారణం ఇదే అంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీని అదే ప్రాంతంలో తూర్పారపట్టాలని వ్యూహ రచన చేశారట. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకులున్నారనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది మరో ఆలోచన అంటున్నారు. ఇటీవల విశాఖ కలక్టరేట్‌లో మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి  మైనింగ్, రిజస్ట్రేషన్, దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించారు. దీనికి అయ్యన్న ఘాటైన విమర్శలే ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. 


మున్ముందు కూడ ఇదే తరహాలో వెళ్తాననీ, ఎక్కడా తగ్గేది లేదని అయ్యన్న నొక్కి వక్కాణిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని సంచలన విషయాలు బయటపెడతానంటున్నారు. అయ్యన్న పాత్రుడు రాబోయే రోజుల్లో ఎవరి బండారం బయటపెడుతారోనని అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుడుతుందట. ఆయన చేసే ఆరోపణలతో తమ పదవి ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానాలు వారిని వేధిస్తున్నాయట. మొత్తంగా అయ్యన్నపాత్రుడి టీమ్‌ భవిష్యత్‌లో ఎవరి జాతకం బయటపెడుతుందో వెయిట్‌ అండ్‌ సీ. 


Updated Date - 2020-10-16T19:23:12+05:30 IST