AP Highcourt: మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు
ABN , First Publish Date - 2022-09-14T20:47:04+05:30 IST
మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల మందస్తు బెయిల్
అమరావతి: రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో మాజీ మంత్రి నారాయణ (Narayana)కు ఏపీ హైకోర్టు (AP high court) మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం నారాయణ (TDP Leader) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు (High court)లో విచారణకు రాగా.... నారాయణ (Former minister) తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పోసాని కోరారు. కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కాగా... ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు... మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.