Abn logo
Jun 10 2021 @ 03:27AM

నోట్ల ముద్రణ ఆఖరి అస్త్రం

ప్రస్తుతానికి భారత్‌కు అంత దుర్గతేం పట్టలేదు 

కొవిడ్‌ బాండ్ల ద్వారానూ నిధులు సమీకరించవచ్చు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 


న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్లను ముద్రించడం ద్వారా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘‘ప్రభుత్వం సహేతుక వడ్డీ రేట్లకు మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించలేని పరిస్థితుల్లో ఆర్‌బీఐ నోట్లు ముద్రించక తప్పదు. ప్రస్తుతం భారత్‌ అంత దుర్భర పరిస్థితిలో ఏం లేద’’ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.


వైరస్‌ మలి విడత ఉధృతి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కొవిడ్‌ బాండ్ల జారీ ద్వారానూ ప్రభుత్వం నిధులు సమీకరించవచ్చని సుబ్బారావు సూచించారు. ‘‘బడ్జెట్‌ రుణ సమీకరణ ప్రణాళికలో భాగంగా కొంత మొత్తాన్ని మార్కెట్‌కు బదులుగా ప్రజలకు కొవిడ్‌ బాండ్లను జారీ చేయటం ద్వారా నిధులు పోగేయవచ్చు. బాండ్లపై సరసమైన వడ్డీ రేటు చెల్లించగలిగితే, మదుపుదారులకు బ్యాంక్‌ ఎఫ్‌డీల కంటే అధిక రిటర్నులు లభిస్తాయి. అంతేకాదు, కొవిడ్‌ బాండ్లతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగదు. కాబట్టి ఆర్‌బీఐ ద్రవ్య నిర్వహణ కార్యకలాపాలకు అవాంతరంగా మారే అవకాశం ఉండద’’ని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. గత ఆర్థిక సంవత్సరం (2020- 21)లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతానికి క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. ప్రపంచ బ్యాంక్‌ అయితే 8.3 శాతానికి పరిమితం కావచ్చంటోంది. మరో వైపు ఎస్‌బీఐ ఏకంగా 7.9 శాతానికి కుదించింది. 


కరోనా కట్టడి కోసం విధిస్తోన్న లాక్‌డౌన్‌లు తదితర ఆంక్షలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. కానీ, ఈ సంక్షోభం నుంచి ఊరట కల్పించే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతోపాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభు త్వ పెట్టుబడులను భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం మార్కెట్‌ నుంచి బడ్జెట్‌ అంచనాల కంటే అధికంగా రుణాలు సేకరించాల్సి రావడంతో 2020-21లో ద్రవ్య లోటు (ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. ఈసారి ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం మార్కెట్‌ నుంచి రూ.15 లక్షల కోట్లకు పైగా రుణాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ సహా పలువురు విశ్లేషకులు ఆర్‌బీఐ నోట్లు ముద్రించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయడ్డారు. దాంతో మార్కెట్లో ఈ చర్చకు తెరలేచింది. 


లాభాపేక్ష సంస్థ కాదు.. 

ఆర్‌బీఐ వాణిజ్య సంస్థ కాదని, లాభాల ఆర్జన దాని ఉద్దేశం కాదని సుబ్బారావు అన్నారు. అయితే, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఆర్‌బీఐ కొంత లాభం ఆర్జిస్తుంది. ఖర్చులు తీర్చుకోవడంతోపాటు నగదు నిల్వలు పెంచుకునేందుకు అందులో కొంత వాటాను అట్టిపెట్టుకొని, అదనపు లాభాలను ప్రభుత్వానికి బదిలీ చేస్తుందన్నారు. అంతేతప్ప లాభార్జనే ప్రధానోద్దేశంగా ఆర్‌బీఐ ఏమీ చేయరాదన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకు ఆర్‌బీఐ లాభాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందా..? అన్న ప్రశ్నకు సుబ్బారావు పై విధంగా సమాధానమిచ్చారు. ఈ మధ్యనే ఆర్‌బీఐ తన లాభాల్లోంచి రూ.99,122 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసింది. 


ఆర్‌బీఐకి పరిమితులున్నాయ్‌.. 

అగ్రరాజ్యాల సెంట్రల్‌ బ్యాంకులైన యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ)తో పోలిస్తే ఆర్‌బీఐకి పరిమితులున్నాయని సుబ్బారావు అన్నారు. ‘‘అగ్రరాజ్యాల సెంట్రల్‌ బ్యాంకులకు విధానపరమైన వెసులుబాటుతో పాటు సమస్య పరిష్కారానికి అన్ని విధాలా ప్రయత్నించే శక్తిసామర్థ్యాలున్నాయి. మనకంత సౌలభ్యం లేదు. పైగా, వర్ధమాన సెంట్రల్‌ బ్యాంక్‌ల మితిమీరిన విధానాలను మార్కెట్లు క్షమించే పరిస్థితుల్లేవని’’ ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ మరిన్ని అసాధారణ విధానాలను అవలంబించవచ్చా..? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. 


పరోక్షంగా ముద్రిస్తూనే ఉంది.. 

ప్రభుత్వ లోటు భర్తీ చేసేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే నోట్లు ముద్రిస్తోంది. కాకపోతే ఇది పరోక్షంగా జరుగుతోంది. ఉదాహరణకు, ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా బాండ్ల కొనుగోలు లేదా ఫారెక్స్‌ ఆపరేషన్స్‌ ద్వారా డాలర్లు కొనుగోలు చేసి ఆర్‌బీఐ ద్రవ్య సరఫరా చేస్తోంది. ఆ నిధులు పరోక్షంగా ప్రభుత్వ రుణ సమీకరణకు దోహదపడతాయి. ఈ విధానంలో మార్కెట్లోకి ఏ విధంగా ద్రవ్య సరఫరా జరగాలి..? ఎంత విడుదల చేయాలన్న నిర్ణయం ఆర్‌బీఐ చేతుల్లో ఉంటుంది. నేరుగా ప్రభుత్వ లోటును పూడ్చాల్సి వస్తే, ఎంత, ఏ సమయంలో అన్న అంశాలను ఆర్‌బీఐకి బదులు కేంద్ర అవసరం నిర్ణయిస్తుంది. దాంతో ద్రవ్య సరఫరాపై ఆర్‌బీఐ నియంత్రణ కోల్పోతుంది. తత్ఫలితంగా ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది. 

దువ్వూరి సుబ్బారావు 

Advertisement