ఏయూ మాజీ ఉప కులపతి రాధాకృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-29T09:07:27+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) ప్రస్తుత చైర్మన్‌ ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ (79)

ఏయూ మాజీ ఉప కులపతి రాధాకృష్ణ కన్నుమూత

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) ప్రస్తుత చైర్మన్‌ ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ (79) శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి చంద్రాణి నాలుగేళ్ల కిందట మృతిచెందగా, కుమారుడు వంశీ, కుమార్తె అఖిల అమెరికాలో ఉంటున్నారు. వీరు సోమవారం నగరానికి చేరుకోనున్నారు. అదేరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 12వ ఉప కులపతి (1998 నుంచి 2001 వరకు)గా పనిచేసిన రాధాకృష్ణ.. సమర్థ సేవలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక అధ్యయనవేత్తగా, పరిపాలనాదక్షునిగా పేరుగాంచిన రాధాకృష్ణ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో 1942 అక్టోబరు పదో తేదీన జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రం, సాంఖ్యాక శాస్ర్తాల్లో పీజీ చేశారు.


అనంతరం పూణె విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 1969లో ఔరంగాబాద్‌ మరట్వాడా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1971 నుంచి 1980 వరకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ రీసెర్చ్‌లో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగాధిపతిగా సేవలు అందించారు. 1985లో సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 1998 నుంచి 2001 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేశారు. ప్రొఫెసర్‌ రాధాకృష్ణ మృతిపట్ల ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు సంతాపాన్ని వ్యక్తంచేశారు.

Updated Date - 2022-01-29T09:07:27+05:30 IST