సీజనల్‌ దోపిడీ

ABN , First Publish Date - 2021-09-14T05:34:40+05:30 IST

సీజనల్‌ దోపిడీ

సీజనల్‌ దోపిడీ
జరిమానా విధించనున్నట్టు శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డు

పారిశుధ్య చర్యల పేరుతో దొంగబిల్లులు!

అక్రమాలకు అడ్డాగా పంచాయతీలు

సామగ్రి పేరుతో నిధుల స్వాహా

ప్రతీ సీజన్‌లో సాగుతున్న తంతే ఇది..

క్షేత్రస్థాయిలో కనిపించని పారిశుధ్య నిర్వహణ 

మురికి కూపాలుగా దర్శనమిస్తున్న ఖాళీ ప్లాట్లు

పారిశుధ్య నిర్వహణ లోపంతో పెరుగుతున్న వ్యాధులు

ఖమ్మం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అసలే వర్షాకాలం... వ్యాధులు ప్రబలే సమయం. వ్యాధులు ప్రబలడానికి కారణం పారిశుధ్య నిర్వహణసక్రమంగా లేకపోవడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. పల్లెల నుంచి పట్టణాల వరకు జ్వరాలతో మంచాన పడుతున్న వేళ అన్ని గ్రామ పంచాయితీలు, పట్టణాలు, నగరాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసు కోవాలి. అలాంటి సీజనల్‌ చర్యల పేరుతో జిల్లాలో ఏటా దోపిడీ జరుగు తోందని, నిధుల ఖర్చుల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన గ్రామపంచాయతీలు పరిశుభ్రత పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఒక పనికి రెండు పనులు కలిపి దొంగబిల్లులతో దందా చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోవు. 

బ్లీచింగ్‌ పేరిట బిల్లులు స్వాహా?

పారిశుధ్య నిర్వహణకు గాను ప్రతీ ఏటా బడ్జెట్‌ నుంచి నిధులను ఉపయోగించుకునేందుకు పంచాయతీలకు వీలుంటుంది. జిల్లాలోని పంచాయతీల్లో ఏటా పారిశుధ్యం కోసం సుమారు రూ.కోట్లలోనే ఖర్చు చేస్తున్నారు. ఇందులో సగం వరకు సామగ్రిని కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తారు. ప్రతీ పంచాయతీలోనూ బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌ లాంటి వాటిని ఉపయోగించి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో మురికి కాల్వలను శుభ్రం చేయడం, నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్‌, ఫినాయిల్‌ లాంటివి చల్లడం, తాగునీటి ట్యాంకులను బ్లీచింగ్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చేయాలి. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్‌ కూడా చేయాల్సి ఉం టుంది. అయితే నిజానికి బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌ లాంటివి కొనుగో లు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపి నిధులు స్వాహా చేస్తున్న ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న పంచాయతీలు మొదలుకుని పెద్ద పంచాయతీల వరకు ఎక్కడా కూడా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేని పరిస్థితి. చిన్న పంచాతీయల్లో కూడా పారిశుధ్య నిర్వహణ కోసం ఏడాదికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలను మాత్రం అరికట్టలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. చాలా గ్రామా ల్లో ఇళ్ల మధ్యే నీరు నిలుస్తున్నా.. కాల్వల్లో మురుగు పేరు కుపోతున్నా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారనీ, గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల శుభ్రంపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేనో, ఎంపీ, మంత్రినో గ్రామంలో పర్యటిస్తే వీఐపీ టూర్‌ పేరుతో అదనంగా బిల్లులు డ్రా చేస్తున్నట్టు వినికిడి. వీఐపీ వచ్చిన సమయంలో కాల్వలు శుభ్రం చేయడం, సు న్నం బ్లీచింగ్‌ చల్లడం చేస్తుంటారు. అంతేనా కొన్ని చోట్ల అదనంగా రోజువారీ కూలీ కింద కార్మికులను ఉపయోగించుకున్నట్టుగా లెక్కల్లో రాస్తున్నట్టు ఆరోపణలున్నాయి. 

పెద్ద పంచాయతీల్లో భారీగా... 

జిల్లాలోని చిన్న పంచాయితీలతోపాటుగా, పెద్ద పంచాయితీలైన కల్లూరు, నేలకొండపల్లి, పెద్దతండా లాంటి మేజర్‌ పంచాయతీ ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మేజర్‌ పంచాయతీల్లో సాధారణ బడ్జెట్‌ రూ.లక్షల్లోనే ఉంటుంది. ఇదంతా ఆయా పంచాయతీల పరిధిలోని పన్నుల రూపంలో వస్తుంది. ఇందులో 50 శాతం అక్కడ పనిచేసేవారికి, 15శాతం పారిశుధ్య నిర్వహణ కోసం వినియోగించడంతోపాటు అవసరాన్ని బట్టి ఎంత నిధులైనా కేటాయించుకునే వీలుంది. మిగిలిన వాటిల్లో కాలువలు శుభ్రం చేసేందుకు, రోడ్లు బాగుచేసేందుకు, తాగునీటి అవసరాలకు ఉపయోగించాలి. కాగా ఆయా నిధుల్లో కొందరు కార్యదర్శులు, ఈవోపీ ఆర్‌డీలు కుమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీకి మూడు నెలలకు ఐదు బస్తాల సున్నం, బ్లీచింగ్‌ అవసరమైతే రెండు బస్తాలే కొనుగోలు చేసి లెక్కల్లో మాత్రం ఐదు బస్తాలు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫినాయిల్‌, ఫాగింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఫాగి ంగ్‌ చేయకపోయినా లెక్క ల్లో మాత్రం చేస్తున్నట్టు పేర్కొంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

పట్టణాల ఆకారం.. వికారం..

ఖమ్మం నగరంతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా లాంటి పట్టణ ప్రాంతాల ఆకారం వికారంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లోనూ సీజనల్‌ వ్యాధులు ప్రబలే సమయంలో ఫాగింగ్‌ చేయడం, కాల్వలు శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ చల్లడం లాంటి పనులు చేయాల్సి ఉంది. నగరంలో ఖాళీ ప్లాట్లను పరిశుభ్రంగా ఉంచేలా యజమానులను అప్రమత్తం చేయాలి. లేదంటే వారికి జరిమానా విధించాలి కూడా. అయితే ఇటీవల ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు అలా నీరు నిల్వ ఉన్న కొన్ని ఖాళీప్లాట్ల విషయంలో రూ.25వేలు జరిమానా అంటూ ఒకటి రెండు చోట్ల బోర్డులు పాతి మమ అనిపించారు. అలాంటి వేలాది ప్లాట్లు ఖమ్మం నగరం నడిబొడ్డున నీటి నిల్వలతో కనిపిస్తున్నా, పిచ్చి మొక్కలు పెరిగి దోమలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఒకటి రెండు డివిజన్లు మినహా బ్లీచింగ్‌ చల్లిన సంఘటనలూ లేవు. మరుగుకాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుడు నీరు రోడ్లపైకి చేరడం, ఖాళీ ప్లాట్లలో చేరి అంతా అధ్వానంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. డ్రైడేపై విస్తృత ప్రచారం చేస్తున్న ఉన్నతాధికారులు పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించాలని, లెక్కల్లో అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-09-14T05:34:40+05:30 IST