సూపర్‌ ఫైట్‌

ABN , First Publish Date - 2021-06-11T10:14:39+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

సూపర్‌ ఫైట్‌

నేడే చూడండి! రాత్రి 9 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

సెమీస్‌లో జొకోవిచ్‌ గీ నడాల్‌ 


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఒకే పార్శ్వంలో ఉన్న వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జొకోవిచ్‌.. క్లే కోర్టు రారాజు రఫెల్‌ నడాల్‌ మధ్య శుక్రవారం సెమీఫైనల్‌ జరుగనుంది. గతేడాది వీరిద్దరు ఫైనల్‌లో తలపడగా స్పెయిన్‌ బుల్‌ విజేతగా నిలిచాడు. ఏకంగా 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌పై కన్నేసిన నడాల్‌ ను ఈసారి ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో జొకో ఉన్నాడు. అందుకే ఇది ఇతర మ్యాచ్‌లా కాదని, క్లే కోర్టులో నడాల్‌తో ఆడడ మంటే అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కోవడమేనని చెబుతున్నాడు. తనకెంతో అచ్చొచ్చిన ఈ గ్రాండ్‌ స్లామ్‌లో నడాల్‌ 7-1 తేడాతో జొకో విచ్‌పై స్పష్టమైన ఆధిక్యంలో కొన సాగుతున్నాడు.రొలాండ్‌ గారోస్‌లో ఎక్కడలేని జోష్‌తో చెలరేగడం నడాల్‌కు అలవాటు. ఓవరాల్‌గా మాత్రం జొకోవిచ్‌ 29-28తో నడాల్‌ పై  ఆధిక్యంలో ఉన్నాడు. ఈ సె మీస్‌కంటే ముందు సిట్సిపాస్‌- జ్వెరెవ్‌ల మధ్య పురుషుల తొలి సెమీఫైనల్‌ జరుగుతుంది.



చెమటోడ్చి..:

అంతకుముందు భారత కాలమానం ప్రకారం గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-7 (5/7), 7-5 తేడాతో మాటియో బెరెట్టిని (ఇటలీ)పై కష్టపడి నె గ్గాడు. తొలి రెండు సెట్‌లను సునాయాసంగా దక్కించుకున్న నొవాక్‌కు మూడో సెట్‌ నామ మాత్రమే అనుకున్నా.. మాటియో నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. చివరకు టైబ్రేక్‌ ద్వారా ప్రత్యర్థికి సెట్‌ను కోల్పోయాడు. అటు నాలుగోదైన చివరి సెట్‌లోనూ జొకోవిచ్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. శక్తివంతమైన సర్వీస్‌లతో విరుచుకుపడిన మాటియో జొకోను వణికించాడు. అయితే అనుభవంతో కూడిన ఆటతో చివరకు గట్టెక్కాడు.


ఫైనల్లో క్రెజికోవా,పవ్లిచెన్‌కోవా

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెక్‌ సుందరి క్రెజికోవా.. రష్యా బ్యూటీ  పవ్లిచెన్‌కోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరికిదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం. సరికొత్త చాంపియన్‌ కోసం శుక్రవారం ఈ ఇద్దరి మధ్య తుది పోరు జరుగుతుంది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పవ్లిచెన్‌కోవా 7-5, 6-3 తేడాతో తమర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై గెలిచింది. దీంతో ఆరేళ్ల తర్వాత రష్యన్‌ క్రీడాకారిణి ఓ మేజర్‌ టోర్నీ సింగిల్స్‌ ఫైనల్‌కు చేరినట్టయింది. చివరిసారి షరపోవా 2015 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆడింది. ఇక హోరాహోరీగా సాగిన రెండో సెమీస్‌లో క్రెజికోవా 7-5, 4-6, 9-7 తేడాతో సకారి (గ్రీస్‌)పై గెలిచింది. తొలి సెట్‌ను క్రెజికోవా.. ఆ తర్వాత సెట్‌ సకారి గెలవగా చివరి సెట్‌ హోరాహోరీగా సాగింది. 5-3తో ఆధిక్యంలో ఉన్న దశలో సకారి ఒత్తిడికి లోనై రెండుసార్లు మ్యాచ్‌ గెలిచే అవకాశం చేజార్చుకుంది. ఆ తర్వాత ఇరువురూ పట్టు విడవకుండా ఆడడంతో ఈ సెట్‌ సుదీర్ఘంగా సాగింది. చివరకు 9-7తో క్రెజికోవా వశమైంది. 



Updated Date - 2021-06-11T10:14:39+05:30 IST