Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిక్కుల్లో ఫౌచీ.. తాను చెప్పిందే నిజ‌మైంద‌న్న ట్రంప్‌!

మీడియా చేతిలో నిపుణుడి ఈ-మెయిల్స్‌ సమాచారం..

చైనాతో సన్నిహిత సంబంధాలున్నట్లుగా అనుమానాలు

బహిర్గతపరచిన అమెరికా మీడియా

వాషింగ్టన్‌: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు అంటొనీ ఫౌచీ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఈ-మెయిల్స్‌ తాజాగా బహిర్గతం కావడమే ఇందుకు కారణం. పలు కీలక సమాచారం కలిగిన మెయిల్స్‌ వాటిలో ఉన్నాయి. సమాచార చట్టం స్వేచ్ఛ(ఎఫ్‌ఓఐఏ)ను వినియోగించుకుని వాషింగ్టన్‌ పోస్ట్‌, బజ్‌ ఫీడ్‌ న్యూస్‌, సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థలు ఆయన మెయిల్స్‌ సారాంశాన్ని సంపాదించాయి.


చైనాకు ఫౌచీ మద్దతు

ఫౌచీ వ్యవహారంపై అనుమానం కలిగించేలా మెయిల్స్‌ ఉండటం గమనార్హం. గత ఏడాది జనవరిలో అంటువ్యాధుల నిపుణుడు క్రియస్టియన్‌ అండర్సన్‌ నుంచి ఫౌచీకి ఒక మెయిల్‌ వచ్చింది. వైర్‌సలోని అసహజ లక్షణాలను చూస్తుంటే.. దీన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారేమోనన్న అనుమానం కలుగుతోందని అండర్సన్‌ మెయిల్‌లో పేర్కొన్నారు. అందుకు మెయిల్‌లో సమాధానం ఇవ్వకుండా, ఫోన్లో మాట్లాడతానని ఫౌచీ ఆయనకు తెలిపారు. ఇక.. గత ఏడాది అమెరికాలో కరోనా మొదలైన కొత్తలో.. వైరస్‌ చైనాలోని ల్యాబ్‌ నుంచే పుట్టి ఉండొచ్చన్న అనుమానాన్ని ఫౌచీ తన సహోద్యోగి వద్ద వ్యక్తం చేశారు. అయితే.. ఇటీవల వూహాన్‌ ల్యాబ్‌పై సెనేట్‌ విచారణలో మాత్రం చైనా పరిశోధకుల్ని వెనకేసుకొచ్చారు.


చైనా రోగనిరోధక కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ జార్జ్‌ ఎఫ్‌ గావ్‌తోనూ ఫౌచీకి సన్నిహిత సంబంధాలున్నాయని మెయిల్స్‌ ద్వారా వెల్లడైంది. ఫౌచీ క్షేమ సమాచారం కనుక్కున్న గావ్‌, సైన్స్‌ మ్యాగజైన్‌లో తాను మాటాడినట్లుగా వచ్చిన ఒక వ్యాసంపై ఆయనకు వివరణ ఇచ్చారు. ‘‘నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఏం ఫర్లేదు. మనం కలిసి దీన్నుంచి బయటపడదాం’’ అంటూ ఫౌచీ దానికి సమాధానం ఇచ్చారు.


వూహాన్‌కు పరోక్ష నిధులు

2014-19 మధ్యకాలంలో జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి కోట్లాది రూపాయలు ఎకోహెల్త్‌ అలయెన్స్‌ అనే సంస్థకు అందాయి. ఆ సంస్థ వూహాన్‌ వైరాలజీ సంస్థకు నిధులు అందించింది. ఎకోహెల్త్‌ అధినేత పీటర్‌ డస్‌జాక్‌ ఫౌచీకి కృతజ్ఞతలు చెబుతూ గత ఏడాది చేసిన మెయిల్‌ సారాంశం ఇది: ‘‘వైరస్‌ సహజంగానే ఉత్పన్నమైందని. శాస్త్రీయ ఆధారం ఉందని చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు. అత్యంత నమ్మకమైన మీ నుంచి వచ్చిన వ్యాఖ్యలు, వైరస్‌ పుట్టుక గురించి ఉన్న కథల్ని తొలగిస్తాయి’’ అని పీటర్‌ పేర్కొనడం ఆసక్తికరం. కాగా.. తన ఈ-మెయిల్స్‌ను మీడియా తప్పుగా అర్థం చేసుకుని, ప్రచారం చేస్తోందని ఫౌచీ పేర్కొన్నారు.


ఈ మెయిల్స్‌ బయటపడిన తర్వాతి నుంచీ.. 2019లో వూహాన్‌ ల్యాబ్‌లో వైరస్‌ బారిన పడ్డ ముగ్గురి ఆరోగ్య నివేదికలను చైనా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తుండటం విచిత్రం. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష కార్యాలయం ఫౌచీని వెనకేసుకొచ్చింది. దేశంలో మహమ్మారిని అదుపులోకి తీసుకురావడంలో ఫౌచీ కీలక పాత్ర పోషించారని బైడెన్‌ భావిస్తున్నట్లు శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు.

నేను చెప్పిందే నిజమైంది!: ట్రంప్‌

కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందని తను చెప్పిన విషయంలో తాను చెప్పిందే నిజమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చెప్పిందే నిజమంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాలు, జరిగిన విధ్వంసానికి గాను చైనా రూ. 7.2 కోట్ల కోట్ల జరిమానా విధించాలి’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement