సమీకృత కలెక్టరేట్‌లకు నిధుల కటకట!

ABN , First Publish Date - 2021-01-18T08:17:51+05:30 IST

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడింది. సకాలంలో నిధులు అందక పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగిపోతోంది

సమీకృత కలెక్టరేట్‌లకు నిధుల కటకట!

15 జిల్లా కేంద్రాల్లో ఇంకా నిర్మాణ దశలోనే.. జాప్యంతో పెరిగిపోతున్న వ్యయం

బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపు.. 10 కేంద్రాల్లోనే పూర్తయిన నిర్మాణం


కలెక్టరేట్‌ల పురోగతి ఇదీ..

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నవి(10): సిద్దిపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, జనగాం, పెద్దపల్లి, వికారాబాద్‌, మేడ్చల్‌ 

80 శాతం పనులు పూర్తయినవి(6): మెదక్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, యాదాద్రి, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌

25-70 శాతం పనులు జరిగినవి(9): ఖమ్మం, సూర్యాపేట, నిర్మల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి

భూసేకరణ జరగాల్సింది(1): వరంగల్‌ రూరల్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడింది. సకాలంలో నిధులు అందక పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగిపోతోంది. సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి జిల్లాల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవడంతో దాని ప్రభావం కలెక్టరేట్‌ల పనులపైనా పడింది. చేసిన పనులకు బిల్లుల కోసమే కాంట్రాక్టర్లు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 10 జిల్లాల కలెక్టరేట్‌లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఆరు కేంద్రాల్లో 80-90 శాతం పనులు జరగగా, తొమ్మిది చోట్ల నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్‌కైతే ఇప్పటికీ స్థల సేకరణ కూడా ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణం కోసం 2017 అక్టోబరులో శంకుస్థాపనలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఏడాదిలోగా భవన నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. కానీ, భూసేకరణ, నిధుల కొరత వంటి కారణాలతో ఆలస్యమవుతోంది.  సీఎం కేసీఆర్‌ 2018 మే 9న శంకుస్థాపన చేసిన మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ పనులు పూర్తికావడానికి కూడా మరో ఏడాది పట్టవచ్చంటున్నారు.


అంచనా వ్యయాలు పెంచుతూ ప్రతిపాదనలు

పనుల్లో అసాధారణ జాప్యం జరుగుతుండడంతో కలెక్టరేట్‌ల నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. ఖమ్మం కలెక్టరేట్‌ను రూ.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా.. ఆ వ్యయాన్ని మరో రూ.15 కోట్లు పెంచుతూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటివరకు రూ.12 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. ఇక యాదాద్రి కలెక్టరేట్‌ను రూ.32.18 కోట్ల అంచనాతో 2017లో చేపట్టగా.. ఇప్పటివరకు రూ.30.74 కోట్ల మేర పనులు జరిగాయి. అయితే అంచనా వ్యయాన్ని రూ.53 కోట్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రూ. 41.80 కోట్ల అంచనాతో చేపట్టిన నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌కు ఇప్పటివరకు కేవలం రూ.11 కోట్లు మాత్రమే వెచ్చించారు. కనీసం 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. మేడ్చల్‌ కలెక్టరేట్‌కు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.45 కోట్ల మేర చెల్లించారు. మరో రూ.10 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. 

Updated Date - 2021-01-18T08:17:51+05:30 IST