కృష్ణాలో బాలికపై గ్యాంగ్ రేప్
ABN , First Publish Date - 2021-09-05T08:31:17+05:30 IST
బాలికకు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన శనివారం కృష్ణాజిల్లా కృత్తివెన్ను పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
- ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్
- వివాహితపై ఆటోడ్రైవర్ అత్యాచారం
కృత్తివెన్ను, సెప్టెంబరు 4: బాలికకు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన శనివారం కృష్ణాజిల్లా కృత్తివెన్ను పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ దుశ్చర్యకు ఒడిగట్టి న ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం, కృత్తివెన్ను మండల పరిధిలోని చినపాండ్రాక గ్రామానికి చెం దిన బాలిక(15) పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకులు అంతబాబు, తరుణ్, మరో మైనర్ ఈ నెల 2వ తేదీ రాత్రిన బాధితురాలిని సమీపంలోని గొడ్ల సావిడికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై గణేశ్‌కుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామ ని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
వివాహితపై ఆటోడ్రైవర్ అత్యాచారం
చిలకలూరిపేట సమీపంలో ఘాతుకం
ప్రత్తిపాడు: వివాహితపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పొత్తూరు గ్రామానికి చెందిన వివాహిత చిలకలూరిపేట వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ సమయంలో ఆటోలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారు మధ్యలో దిగిపోయారు. ఆ తరువాత ఆటో డ్రైవర్ గొర్రెముచ్చు శివరామయ్య... ఆమెను మాటల్లో పెట్టి హైవేపై నుంచి కోండ్రుపాడు రోడ్డులోనికి ఆటోను తిప్పి సమీపంలో ఉన్న పొలాలవైపు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న 50 వేల రూపాయల నగదును తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి 100 డయల్ ద్వారా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అదే రాత్రి శివరామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం ప్రకాశం జిల్లా కొండేపి అని ఎస్సై అశోక్ తెలిపారు.