ధాన్యం సేకరణపై వివరణ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-11-30T09:13:29+05:30 IST

వరి ధాన్యం సేకరణపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)కి హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ధాన్యం సేకరణపై వివరణ ఇవ్వండి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, 
  • ఎఫ్‌సీఐకి హైకోర్టు నోటీసులు


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం సేకరణపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)కి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బొమ్మగాని శ్రీకర్‌ అనే 21 ఏళ్ల విద్యార్థి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఉప్పులూరి అభినవ్‌ కృష్ణ వాదనలు వినిపిస్తూ... వేల టన్నుల ధాన్యం ఇంకా రైతుల కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నదని, అకాల వర్షాలతో ధాన్యం పాడైపోతుందని పేర్కొన్నారు. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. మార్చి 31న జరిగిన సమావేశంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో ఒప్పందం కుదుర్చుకున్నదని కోర్టుకు తెలిపారు. కానీ ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేరకు కొనసాగడంలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. విచారణను డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదావేసింది.

Updated Date - 2021-11-30T09:13:29+05:30 IST