పాలమూరు-రంగారెడ్డికి రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వండి

ABN , First Publish Date - 2022-09-15T08:47:10+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది.

పాలమూరు-రంగారెడ్డికి రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వండి

  • ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీకి తెలంగాణ విజ్ఞప్తి
  • కరువు ప్రాంతానికి సాగు, తాగునీటి కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వెల్లడి
  • సీడబ్ల్యూసీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ దాఖలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. బుధవారం కేంద్ర పర్యావరణ, వాతావరణ, అటవీ మంత్రిత్వశాఖకు చెందిన ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ) పాలమూరు ఎత్తిపోతల పథకానికి రెండో దశ అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తుపై వర్చువల్‌గా సమావేశమైంది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి వీలుగా 60 రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల నీటిని తరలించేలా 90టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌లో 8.51 టీఎంసీలు, ఏదులలో 6.55 టీఎంసీలు, వట్టెంలో 16.74 టీఎంసీలు, కరివెనలో 17.34 టీఎంసీలు, ఉద్ధండాపూర్‌లో 16.03 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పంప్‌హౌస్‌ల నిర్మాణం ఒక్కటే జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పొందడానికి వీలుగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర పర్యావరణ శాఖ తెలంగాణకు 2017 అక్టోబరులోనే అనుమతి ఇచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. సుదీర్ఘ విరామం అనంతరం పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు పెట్టారు.  తెలంగాణ విజ్ఙప్తిని అంగీకరించి... బుధవారం ఈఏసీ సమావేశం కాగా.. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు ప్రాజెక్టు అవసరాన్ని నివేదించారు. కరువు ప్రాంతాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించడానికి వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని, పనులు దాదాపు పూర్తికావస్తున్నాయని, ఎన్జీటీ ఆదేశాలతో పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. రెండో దశ పర్యావరణ అనుమతిస్తేనే పనుల నిర్మాణం చేపట్టడానికి వీలు దొరుకుతుందని నివేదించారు.      


సీడబ్ల్యూసీలో పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ దాఖలు 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి కోరుతూ కేంద్ర జలవన రుల సంఘంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీ ఆర్‌)ను దాఖలు చేసింది. ఈ నెల 3న ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ హమీద్‌ఖాన్‌ ఈ డీపీఆర్‌ను సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరిపై అనుమతి లేని ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌ జారీ చేయగా ఆ జాబితాలో పాలమూరు కూడా ఉంది. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పలుమార్లు కోరగా.. నాన్చుతూ వచ్చి గుట్టుగా డీపీఆర్‌ దాఖలు చేయడం గమనార్హం. కృష్ణాలో నికర జలాలతోనే పాలమూరు-రంగారెడ్డికి అనుమతి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ దాఖలు చేసింది. 

Updated Date - 2022-09-15T08:47:10+05:30 IST