Abn logo
Oct 23 2020 @ 02:27AM

జగన్మాత వైభవము

Kaakateeya

యా దేవీ సర్వభూతేషు..

తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం

విరించిః సంచిన్వన్‌ విరచయతి లోకానవికలమ్‌

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

హరః సక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్‌

త్రిమూర్తులకూ ఆరాధ్యురాలు అయిన ఆ జగన్మాత గురించి ఆదిశంకరులు అద్భుతంగా వర్ణించిన శ్లోకమిది. ఆ తల్లి పాదపద్మాల నుంచి వెలువడిన రేణువుల్లో ఒకదానితో బ్రహ్మదేవుడు ఈ సకల లోకాలనూ సృష్టిస్తున్నాడట. ఆదిశేషుడి రూపంలో శ్రీ మహావిష్ణువు ఆ రేణువునే కష్టంగా మోస్తున్నాడట. లయకారుడైన ఈశ్వరుడు ఆ జగన్మాత పాదం నుంచి వెలువడిన రేణువులనే తన ఒంటిపై భస్మంగా నిత్యం ధరిస్తున్నాడట.


అంతేకాదు.. ‘‘అమ్మా, నీ దయచేతనే త్రిమూర్తులు విధులు నిర్వహించగలుగుతున్నారు. మూలాధార (పృథ్వీ తత్వం), మణిపూరక (జల తత్వం), స్వాధిష్ఠాన (అగ్నితత్వం), అనాహత (వాయు తత్వం), విశుద్ధ (ఆకాశ తత్వం), ఆజ్ఞా చక్రాలలో (మనస్సు).. పంచభూతాలను, మనస్సును అణచి సుషుమ్నా మార్గచ్ఛేదన జేసి సహస్రదళ పద్మం (సహస్రారం)లో పతిదేవుడైన ఆ సదాశివునితో విహరిస్తున్నావు తల్లీ’’ అంటూ ప్రస్తుతించారు. మహా విద్యా స్వరూపిణి, సర్వ శుభంకరి, మంగళ స్వరూపిణి అయిన ఆ పరాశక్తి ఉదయ కాలంలో  దుర్గాంశగా, మధ్యాహ్నం లక్ష్మీ స్వరూపిణిగా, సాయంత్రం సరస్వతీ అంశతో తానే అన్నీ అయి విరాజిల్లుతున్నట్లు దేవీభాగవతం చెబుతోంది.


అందుకే మహాకవి కాళిదాసు తన శ్యామలా దండకంలో ఆ తల్లిని.. ‘‘సురుచిర నవర్న పీఠస్థితే సుస్థితే.. సర్వ తీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే సర్వ ముద్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వ రూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహిమాం పాహి’’ అని ప్రార్థించి ధన్యుడయ్యాడు. ఆ దుర్గాదేవి కరుణా కటాక్షం ఉంటే.. మధు, క్షీర, ద్రాక్షా సదృశ, కవితా దురంధరులవుతారనడానికి కాళిదాసే నిదర్శనం. ఆ తల్లి కన్ను తెరిస్తే సృష్టి. కన్నులు మూస్తే ప్రళయం. 

నవదుర్గాం మహాకాళీ బ్రహ్మవిష్ణు శివాత్మికా అని వేదాలు ఆ తల్లిని స్తుతించాయి. సాక్షాత్‌ ఆకాశవాణి ‘నవరత్న మాలికా స్తోత్రం’లో ఆ దివ్యశక్తి దివ్యరూపాలను కీర్తించింది. ‘ఓం’కారం ఆ పరాశక్తి ముఖము. ‘‘నమ’’.. దేవి పాదాలు. ‘శి’కారం.. నడుము. ‘వా’, ‘య’ అనే అక్షరాలు భుజాలుగా ఆ తల్లే ‘ఓం నమశ్శివాయ’ అనే మహామంత్రమైనట్లు వర్ణించబడింది. ఆమె పరంజ్యోతిగా, భగవతిగా, మణి ద్వీప వాసినియైు, విశ్వవ్యాప్తయైు, అదృశ్య రూపిణియైు కటాక్షిస్తోంది. దేవీ నవరాత్రులలో వివిధ రూపాల్లో ఆ దుర్గా మాత దర్శనమిస్తుంది. ఆ తల్లిని  స్తుతిస్తే పుణ్యతీర్థ స్నాన ఫలితం. కోటి శివలింగాలను ప్రతిష్ఠించినంత ఫలితం.

యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణా సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమఃశ్రీశ్రీ

- రాయసం రామారావు, 9492191360


Advertisement
Advertisement