గుడివాడలో గోవా!

ABN , First Publish Date - 2022-01-17T07:35:07+05:30 IST

గుడివాడలో గోవా!

గుడివాడలో గోవా!

మంత్రి ఇలాకాలో కేసినో కల్చర్‌

చీర్‌గాళ్స్‌.. నేతల చిందులు

నాని కన్వెన్షన్‌లో జూద మేళా

ఎంట్రీ ఫీజే రూ.10 వేలు

కోతముక్క, గుండాట, తీన్‌పత్తి

మూడ్రోజుల్లో 150 కోట్ల బిజినెస్‌

ముంబై, హైదరాబాద్‌ నుంచి బౌన్సర్లు

రాష్ట్రం నలుమూలల నుంచీ జూదప్రియుల రాక

మైకుల్లో అనౌన్స్‌ చేసి మరీ ఆహ్వానాలు

నియోజకవర్గమంతటా బరులు

పోలీసుల భయం లేకపోవడంతో కళకళ

పురుషులకు దీటుగా మహిళల బెట్టింగ్‌


గుడివాడ, జనవరి 16: సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడకు గోవా కేసినో కల్చర్‌ దిగుమతి అయింది. మంత్రి కొడాలి నానికి చెందిన ‘కే’ కన్వెన్షన్‌ ప్రాంగణంలో అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో కోడిపందేలు, గుండాట, పేకాటలకు తోడు కేసినో, తీన్‌పత్తి వంటి వంద రకాల జూదక్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. భారీసెట్టింగ్‌లతో లైటింగ్‌లతో జిగేల్మనిపించారు. చీర్‌గాళ్స్‌ను తీసుకొచ్చి నృత్యాలు చేయించారు. వారితో అధికార పార్టీ నేతలు చిందులేశారు. కేసినోలోకి అడుగు పెట్టేందుకు రూ.10 వేలు ఎంట్రీ ఫీజుగా వసూలు చేశారు. మొత్తమ్మీద ఇక్కడ మూడ్రోజులు రంజుగా సాగిన జూదాల జాతరలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. వివిధ స్టాల్స్‌ ద్వారానే రూ.15 కోట్లు కొల్లగొట్టారని అంచనా. మందు, విందు వంటి సకల సౌకర్యాలు కేసినో లోపల అదనంగా ఏర్పాటు చేయడంతో పలువురు జూదప్రియులు రాష్ట్రం నలుమూలల నుంచీ విచ్చేశారు. వీడియోలు తీయకుండా కట్టడి చేయడానికి హైదరాబాద్‌, ముంబై నుంచి బౌన్సర్లను తీసుకొచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూదరులను ఆహ్వానిస్తూ పట్టణంలో పెద్దఎత్తున స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు పెట్టారు. మైకుల్లో ప్రకటనలు జారీ చేసి మరీ జూదప్రియులను ఆహ్వానించడం విశేషం. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే మందు, విందుల్లో మునిగితేలుతూ చిందేయడం విశేషం. పగలు, రాత్రి తేడా లేకుండా మూడ్రోజులూ పందేల రాయుళ్లు ఎంజాయ్‌ చేశారు. గుడివాడ ఏలూరు రోడ్డు నుంచి లింగవరం కే కన్వెన్షన్‌ ప్రాంగణం వరకూ జనజాతరను తలపించింది. మరోపక్క కోడిపందేలు, పేకాట, కేసినోలకు కే కన్వెన్షన్‌ ప్రాంగణం వద్ద చేసిన ఏర్పాట్లను చూసి పోలీసులు, చట్టాలు ఏమైపోయాయని జనం విస్తుపోయారు. కేసినోలో శుక్రవారం రాత్రి నుంచి యథేచ్ఛగా జూదాలు ఆగాయి.


కోడిపందేలు, జూదాలపై నిషేఽధం ఉన్నా, కోర్టులు హెచ్చరించినా పోలీసు శాఖ అడ్డుకోలేకపోవడం, పైగా కేసినో కల్చర్‌ను నిలువరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. సంక్రాంతి ముందు మీడియా సమావేశాలు నిర్వహించి.. కోడికి కత్తి కట్టి పందెం వేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి యంత్రాంగం కూడా పత్తా లేకుండా పోయారు. అధికార పార్టీ నాయకుల మార్గదర్శకత్వం, పోలీసు భయం లేకపోవడంతో అన్ని బరులూ కళకళలాడాయి. కొన్ని చోట్ల పురుషులకు దీటుగా మహిళామణులు సైతం పందేలు కాయడం విశేషం. గుడివాడ డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో కోడిపందేలతో పాటు గుండాట, కోతముక్క రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎంఎన్‌కే జాతీయరహదారి కౌతవరం వద్ద జూదరుల తాకిడికి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారి సమీపంలోని ప్రతి గ్రామంలో బరులు వెలిశాయి. గుడివాడ మండలంలోని బిళ్లపాడు, రామనపూడి, పామర్రు మండలం గాంధీ ఆశ్రమం వద్ద భారీ బరులు కొలువు దీరాయి. ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు, వడాలి గ్రామాలు.. కైకలూరు మండలం భుజబలపట్నం, ఆటపాక.. నందివాడ మండలం పుట్టగుంట, రామాపురం, పోలుకొండ, నందివాడల్లో పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించారు.




Updated Date - 2022-01-17T07:35:07+05:30 IST