అన్నీ ఆయన ఆలకిస్తాడు!

ABN , First Publish Date - 2022-01-07T05:30:00+05:30 IST

అల్లాహ్‌ గుణాలు అసంఖ్యాకం. వాటిని లెక్కించడం, అంచనా వేయడం సాధ్యం కాదు. ఆయన గురించి రాయడానికి లోకంలోని వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చినా, సమస్త సముద్రాల్లోని జలాన్నీ సిరాగా మార్చినా సరిపోదనీ,...

అన్నీ ఆయన ఆలకిస్తాడు!

అల్లాహ్‌ గుణాలు అసంఖ్యాకం. వాటిని లెక్కించడం, అంచనా వేయడం సాధ్యం కాదు. ఆయన గురించి రాయడానికి లోకంలోని వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చినా, సమస్త సముద్రాల్లోని జలాన్నీ సిరాగా మార్చినా సరిపోదనీ, ఎలాంటివి ఎన్ని తెచ్చినా ఆయన గుణగణాలను వెల్లడించడం సాధ్యం కాదనీ పవిత్ర గ్రంథాలు పేర్కొన్నాయి. అంతిమ దివ్య ఖుర్‌ఆన్‌, పవిత్ర హదీసుల అల్లాహ్‌ గుణ విశేషాలను ఘనంగా కొనియాడాయి. అలాంటి గుణాల్లో ప్రధానమైనది వినడం. ఆల్లాహ్‌ సల్వ విషయాలనూ వింటాడు. అది కొన్ని రోజులకో, నెలలకో, సంవత్సరాలకో పరిమితం కాదు. ఆయన అనునిత్యం... ప్రతి క్షణం కోటానుకోట్లమంది మానవుల ప్రార్థనలు, వేడికోళ్ళు, సంభాషణలు అన్నిటినీ వింటున్నాడు. వారి ఆరాధనలు స్వీకరిస్తున్నాడు. ఇలా చేయడంలో ఆయనకు అలసట అంటదు. అది ఆయనకు ప్రయాస కలిగించే కార్యం కూడా కాదు. అసంఖ్యాకమైన దేవదూతలు కూడా నిరవధికంగా అల్లాహ్‌ను స్మరిస్తారు, పూజిస్తారు. కోటానుకోట్ల భూచరాలు, జలచరాలు, నదులు, పర్వతాలు... ఇలా సృష్టిలో అణువణువూ తనదైన రీతిలో ఆయనతో సంభాషిస్తూనే ఉంటుంది. అవన్నీ ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ఈ కృషిలో ఆయనకు ఏమాత్రం అలసట రాదు. అలాగని, ఆయన సాగించే విశ్వ పాలనకు ఎలాంటి ఆటంకం రాదు. కాబట్టి... మన ప్రార్థనలనూ, వేదనలనూ అల్లాహ్‌ వినడం లేదేమో అనే సందేహం ఎవరికీ అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఆయన పట్ల నమ్మకం ఉంచడమే విశ్వాసుల కర్తవ్యం. 

  మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-01-07T05:30:00+05:30 IST