వైరా పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2021-09-19T05:08:44+05:30 IST

వైరా పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ సంఘటనలో మొత్తం 17మందిపై పోలీసులు శుక్రవారం రాత్రి కేసులు నమోదుచేశారు.

వైరా పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ

17మందిపై కేసులు నమోదు

వైరా,సెప్టెంబరు18: వైరా పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ సంఘటనలో మొత్తం 17మందిపై పోలీసులు శుక్రవారం రాత్రి కేసులు నమోదుచేశారు. వరకట్నం కోసం భార్యను భర్త వేధిస్తున్న కేసుకు సంబంధించి శుక్రవారం వైరా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాల వారు స్టేషన్‌ బయట ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇరువర్గాల వారు ఇచ్చుకున్న ఫిర్యాదుల మేరకు 17మందిపై వైరా ఎస్‌ఐ వి.సురేష్‌ కేసులు నమోదుచేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన వెలిశెట్టి మౌనికతో పాల్వంచకు చెందిన పోతనశెట్టి వెంకట రోహిత్‌కుమార్‌కు 2020 నవంబరు 21న వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నినెలల తర్వాత నుంచి భర్త, బంధువులు తనను అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారని ఈనెల ఐదోతేదీన మౌనిక వైరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు భర్త వెంకటరోహిత్‌కుమార్‌పై వైరా పోలీసులు కేసు నమోదుచేశారు. ఆతర్వాత వైరా పోలీసుల ఆదేశాలతో ఆకేసులో నోటీసులు తీసుకొనేందుకు వెంకట రోహిత్‌కుమార్‌ ఆయన తల్లిదండ్రులు, బంధువులు, షూర్టీ ఇచ్చే మరికొందరితో శుక్రవారం పాల్వంచ నుంచి వైరా వచ్చారు. ఆసమయంలో మౌనిక కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పోలీస్‌స్టేషన్‌ బయట ఇరువర్గాల వారు ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణకు సంబంధించి వెలిశెట్టి మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచకు చెందిన పోతనశెట్టి రోహిత్‌కుమార్‌, బొల్లం మధుసూదన్‌, నీలం శ్రీనివాసరావు, రజిత, వీరభద్రం, రమాదేవి, పసుపులేటి రవి, చంద్రికలపై అలాగే వెంకటరోహిత్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైరాకు చెందిన ముళ్లపాటి రంగారావు, సీతరాములు, వెలిశెట్టి మోహన్‌, మౌనిక, రంగయ్య, అరుణ, ఎం.పద్మ, ఎం.విజయ, ఎం.అనితపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఎస్‌ఐ వి.సురేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-19T05:08:44+05:30 IST