ఆరేళ్ళ గరిష్టానికి... బంగారం దిగుమతులు...

ABN , First Publish Date - 2021-12-16T21:51:55+05:30 IST

బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తర్వాత డెల్టా వేరియంట్ ప్రభావం కాస్త కనిపించినప్పటికీ... నవంబరు నెలలో ఆర్థిక రికవరి కనిపించడం, కరోనా ప్రభావం తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడం తదితర అంశాలకు ముహూర్తాలు, పండుగలు వంటివి తోడుకావడంతో పసిడి కొనుగోళ్ళు ఊపందుకున్నాయి.

ఆరేళ్ళ గరిష్టానికి... బంగారం దిగుమతులు...

హైదరాబాద్ : బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తర్వాత డెల్టా వేరియంట్ ప్రభావం కాస్త కనిపించినప్పటికీ... నవంబరు నెలలో ఆర్థిక రికవరి కనిపించడం, కరోనా ప్రభావం తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడం తదితర అంశాలకు ముహూర్తాలు, పండుగలు వంటివి తోడుకావడంతో పసిడి కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి... పెళ్లిళ్లు జోరు పెరగడంతో... నవంబరు మ నుండి ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు లక్షల వేడుకలు జరిగినట్లు అంచనా. ముందటేడు(2019 లో)... మందగమనం, నిరుడు కరోనా నేపధ్యంలో భారత జెవెలరీ వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా డిమాండ్ దెబ్బతిన్న జెవెలరీ రంగం నవంబరు నెలలో పుంజుకోవడం  ఊరటనిచ్చే పరిణామమే. ఇక... మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


దీపావళి సమయంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ పండుగ సీజన్ కారణంగా ఈ ఏడాది బంగారం దిగుమతులు 900 టన్నులకు చేరుకునే అవకాశాలున్నట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్  అంచనా. గతేడాది(2020) ఆగస్టు నెలలో బంగారం ధర  దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో... ఆల్ టైమ్ గరిష్టం రూ. 56,200ను తాకింది. రిటైల్ మార్కెట్లో రూ.59,000 కు చేరువైంది. ఆ తర్వాత... కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ జోరందుకోవడం తదితర పరిణామాల నేపధ్యంలో ఫ్యూచర్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 48 వేల నుండి రూ. 49 వేల మధ్య ఉంది. రిటైల్ మార్కెట్‌లో  రూ. 50 వేలకు పైగానే ఉంది. అయితే నవంబరులో ధరలు ఇంతకంటే తక్కువగానే ఉన్నాయి. గతంలో ఓ సమయంలో ఫ్యూచర్ మార్కెట్‌లో రూ. 44 వేల దిగువకు కూడా పడిపోవడం గమనార్హం. కాగా... దీర్ఘకాలంగా రూ. 46 వేల నుండి రూ. 50 వేల మధ్య కదలాడుతోంది. దీంతో ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే ధరలు కాస్త తగ్గడం, శుభకార్యాలు తోడవడంతో కొనుగోళ్లు పెరిగాయి. గత ఏడాదిన్నర కాలంగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 


ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు భారత్. భారత్‌కు అత్యధిక స్థాయిలో బంగారం దిగమతి అవుతోంది. ప్రతి సంవత్సరం పండుగ సీజన్ అక్టోబరు-డిసెంబరు  మధ్య కాలంలో ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ప్రస్తుత సంవత్సరం అమ్మకాలు... ఈ  దశాబ్దంలోనే అత్యధికంగా ఉండవచ్చునని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. కరోనా కారణంగా ఏడాదిన్నరగా వాయిదాపడ్డ వివాహాలు... కరోనా నిబంధనల సడలింపుతో... గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. కాగా.. ఒమిక్రాన్ భయం పెరుగుతుండడంతో... రానున్న రోజుల్లో... బంగారం బుల్లిష్‌గా ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-12-16T21:51:55+05:30 IST