తెలుగు కావ్య సౌధానికి బంగారు వాకిలి
ABN , First Publish Date - 2020-12-21T06:55:23+05:30 IST
దాసు శ్రీరామ కవి గ్రంథాలలో దేవీ భాగవతం అత్యంత ప్రశస్తిని పొందింది. ఈ మహాకవి మొత్తం ముప్పై రెండు గ్రంథాలు రచించారు....
దాసు శ్రీరామ కవి రచనలు- కవిత్రయం, నాచన సోమన, అల్లసాని పెద్దన, ధూర్జటి, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణకవి, శ్రీనాథుడు, పోతన కావ్యాలను తలపింపజేస్తాయి. దేవీ భాగవతం చదువుతున్నప్పుడు వారి ప్రౌఢి, సమాస పరికల్పన, పద్య రచన సొగసులు అతిలోక భావుకతను స్ఫురింపజేస్తాయి. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలోనే ఈ మహనీయుడు ఉండి ఉన్నట్లైతే అల్లసాని పెద్దన అల్లిక జిగితో సరిసమానంగాగల మహాకవి ఈయన అని రథమెక్కించి ఊరేగించేవాడనిపిస్తుంది.
జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషా యశః కాయాః జరామరణజం భయమ్.
దాసు శ్రీరామ కవి గ్రంథాలలో దేవీ భాగవతం అత్యంత ప్రశస్తిని పొందింది. ఈ మహాకవి మొత్తం ముప్పై రెండు గ్రంథాలు రచించారు. ఈ మహానుభావుడు జీవించింది 62 సంవత్సరాలే. వీరేశ లింగం పంతులు గారి కన్నా వయసులో రెండేళ్లు పెద్ద. 1846లో జన్మించి 1908లో దివంగతులైనారు.
‘‘19వ శతాబ్దమున నుదయించిన యాంధ్రకవులలో ఇంతటి మహాకవి లేనే లేడు. అన్ని అదృష్టములు సంఘ టించిన కవి లేనే లేడు,’’ అన్నారు శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కవివర్యులు ఈ కవిని గూర్చి.
శ్రీదేవీభాగవతంలో 12 స్కంధాలున్నాయి. 8 వేల పద్యాలున్నవి. పింగళి లక్ష్మీకాంతంగారు తెలుగు సాహిత్య చరిత్రలో తిరుపతి వేంకట కవులను ప్రాచీన సరణికి భరత వాక్యము, నవీన సరణికి నాందీ వాక్యము పలికా రని అభివర్ణించారు. కాని ఈ అభియుక్తోక్తి తిరుపతి వేంకట కవుల కన్నా శ్రీదాసు శ్రీరామ మహాకవికి మరింత అన్వర్థం అనిపిస్తుంది. పూర్వ సంప్రదాయంలో నవ్యతను, నవ్య కవితా సంప్రదాయంలో పూర్వ ప్రౌఢి మను సాధించినవారు ఈ శ్రీదాసు శ్రీరా ములు మహాకవి. వీరి బాల్య, కౌమార జీవిత ఘటనలు అత్యంతాద్భుత సముపేత మైనవి. 1928లో అంటే 92ఏళ్ళ కిందట దేవీ భాగవతం వారి పెద్ద కుమారుడైన కేశవ రావుగారి ఉపోద్ఘాతం, కవిగారి జీవిత చరిత్రలతో మొదటిసారి ప్రచురితమైంది. కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, అల్లూరు అనే గ్రామం కవిగారి స్వస్థలం. తల్లిదండ్రులకు శ్రీరాములు ఒక్కరే కుమారుడు కావటంతో గారాబంగా పెరిగారు.
వీరి ప్రాథమిక విద్య స్వగ్రామంలో తన ఎనిమిదేళ్ళకే పూర్తి అయింది. తొమ్మిదో యేట ఆంగ్ల విద్య నభ్యసించ టానికి అక్కడకు దగ్గరలో ఉన్న మచిలీ బందరుకు తల్లి దండ్రులు పంపించారు. అక్కడ నోబిలు పాఠశాలలో ఇంగ్లీషు, ఇంటి దగ్గర పారశీ భాషలతో ప్రావీణ్యం సముపార్జించారు.
తమ తాతగారిని గూర్చి దాసు కేశవరావు పంతులు గారిట్లా చెపుతున్నారు. ‘‘ఈ చిన్నవాని కుశాగ్రబుద్ధియు, సత్ప్రవర్తనయు పాఠశాలాధ్యక్షులగు నోబిలు దొరగారి మనస్సునకు కడుసంతస మొనర్చుటచే నీ పిల్లవానిని దొరగారు తన గృహమునకప్పుడప్పుడు గొనిపోయి చిన్న పుస్తకముల నిచ్చియు, ఫలహారములనొసంగియు కడు గారాబముతో నాదరించుచువచ్చిరి. ఆ దినములలో కొందరు విద్యార్థులు, క్రైస్తవ మతావలంబనము చేయు చుండుట తటస్థించెను. ఈ యుదంతములన్నియు క్రమ క్రమమున వారి మాతాపితలకు దెలియవచ్చినవి. వెంటనే తల్లిగారు మచిలీబందరు వచ్చి యీ చిన్నవానిని ఆకస్మిక ముగా స్వగ్రామమునకు మరల్చుకొనిపోయిరి.’’
అయినా ఆయన విద్యా తృష్ణ తీరలేదు. స్వయంకృషితో పధ్నాలుగేళ్ళ వయసునకే తెలుగు, సంస్కృతాలలో గొప్ప పాండిత్యం సంపాదించారు. 18 ఏళ్ళ వయసుననే తాలుకా పట్టణమైన గుడివాడలో ప్రధానాంధ్రోపాధ్యాయ పదవి అక్కడి పాఠశాలలో నిర్వహించారు. తెలుగువారి కీర్తి పతాక అయిన రెంటాల వెంకట సుబ్బారావు వీరి అభిమాన శిష్యులైనది ఈ పాఠశాలలో చదువుకున్న రోజులలోనే. రెంటాల వేంకట సుబ్బారావు షేక్‌స్పియర్ హామ్‌లెట్, ఒథెల్లో నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి అమెరికా, ఇంగ్లండులో ప్రముఖుడైనారు.
దాసు శ్రీరామ మహాకవి కాలానుగుణంగా సంఘ సంస్కరణ పట్ల కూడా ఆసక్తి చూపి గొప్ప కృషి చేశారు. 34ఏళ్ళ వయసున ఆయన ‘కల్పవల్లి’ అనే పత్రికను నడిపి ఆధునిక సమాజావిష్కరణకు నాంది పలికారు.
‘‘శ్రీరామ పండితులు 1900 సంవత్సరం మార్చి నెలలో దేవీ భాగవతాంధ్రీకరణమునకుపక్రమించి యైుదు మాస ములలో పూర్తిజేసి ఆరవ మాసంలో శుద్ధ ప్రతి తయారు చేసి ముద్రణకిచ్చారు,’’ అని తాతగారి సంగ్రహ జీవిత చరిత్రలో ప్రసక్తం చేశారు కేశవరావుగారు.
దాసు శ్రీరామ కవి రచనలు కవిత్రయం, నాచన సోమన, అల్లసాని పెద్దన, ధూర్జటి, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణకవి, శ్రీనాథుడు, పోతన కావ్యాలను తలపింపజేస్తాయి. దేవీ భాగవతం చదువుతున్నప్పుడు వారి ప్రౌఢి, సమాస పరికల్పన, పద్య రచన సొగసులు, అతిలోక భావుకత స్ఫురింపజేస్తాయి. అంటేవారికి అను కరణ అనటం కాదు. అనురణనం అనాలి. వెయ్యేళ్ళ తెలుగు కావ్య సాహిత్యాన్ని సాముదాయికంగా, సంప్రదా యకంగా, దాసు శ్రీరాములుగారు తమ శ్రీదేవీభాగవ తాన్ని ప్రాతినిధ్య మహిమాన్వితంగా సుందర శిల్పా కృతికంగా సృష్టించారు.
పూర్వ కవులలో ఎవ్వరూ తమ జన్మభూమిని దాసు వారివలె పరమార్ద్ర భావుక సుందర సముపేతంగా వర్ణించటానికి పూనుకోలేదు అనటం సాహసం కాదేమో! తన స్వగ్రామమైన అల్లూరును, అక్కడి సకల జీవన వైచి త్రిని, సర్వ వర్ణముల సహజ సుందర సంతృప్త జీవిత వైచిత్రిని నూరు పద్యాలుగా, అరవై నాలుగు పంక్తుల లలిత మృదుల సుషమా విభవ సుందరంగా మన కను లకు కట్టిస్తే కాని శ్రీదాసు శ్రీరామ మహాకవికి తృప్తి తీర లేదు. ఇందులో మొదటి ఏడు సీస పద్యాలు కిర్మీరోజ్జ్వల రమణీయాలు. ఆ ఊళ్ళో సుప్రభాతపు లేత యెండ ఇంటి ప్రాకారపు చెట్ల సందుల నుంచి ఇంటి గోడలపై నిలువుటద్దాలుగా శోభిస్తుందట. ఇంటిముందు పందిళ్ళలో ఆర్ద్ర పురుగులు సోయగంగా కదులుతూ పగడాలను తలపింప జేస్తాయట. ఇంటి చూరులలో పిచ్చుక దంప తుల వరుసలు చెక్కి తీర్చిన చిత్రాలుగా కన్పిస్తాయట. దూలాల సందుల నుంచి తుమ్మెదలు చెలరేగి వీనుల విందైన గీత ఫణితిని విన్పిస్తాయట. ఇటువంటి భావుక చిత్రాలతో అల్లూరుని మహాకవి ఆషాడ లక్ష్మీ విలాసంతో సరిపోల్చాడు. ఇటువంటి నూరు పద్యాలు, పెద్ద వచనంగా కూర్చారు మహాకవి. శ్రీకృష్ణదేవరా యుల వారి కాలంలోనే ఈ మహ నీయుడు ఉండి ఉన్నట్లైతే అల్ల సాని పెద్దన అల్లిక జిగితో సరిస మానంగాగల మహాకవి ఈయన అని రథమెక్కించి ఊరేగించేవాడ నిపిస్తుంది.
తృతీయ స్కంధంలో రామ కథ బమ్మెర పోతన భాగవతం నవ మస్కంధంలోని శ్రీరామ చరిత్రను తలపింప చేస్తుంది. నూరు పద్యా లతో రామాయణ గాథను రస రమ్య రమణీయంగా తీర్చి సంగీత తరంగితం చేశారు శ్రీదాసు శ్రీరా మమహాకవి.
ఇంతటి ప్రతిభావ్యుత్పత్తి అభ్యాస శక్తుడై ఉండికూడా పంచమ స్కం ధంలో కాల విపర్యయతా దోషం (ఎనాక్రోనిజం) ఎందుకు వీరి దృష్టికి రాలేదో అనూహ్యం. సురదో పాఖ్యానం అని ఒక కథ ఉంది ఈ స్కంధంలో. సుమారు నూరు పద్యాలు. సురధ మహారాజును మ్లేచ్ఛులు (పర్వతవాసులైన తుర కలు) రాజ్యం నుంచి వెళ్ళగొట్టి అడవుల పాలు చేసిన కథను భావోద్వేగంతో వర్ణిస్తారు. స్వారో చిష మనువు (రెండో మనువు- కృతయుగం) కాలంలో మ్లేచ్ఛులు, తురకలు (స్పష్టంగా ఈ పదం ఉపయోగించారు) ఎక్కడ నుంచి వచ్చారు? వీరితో సురధుడి మంత్రులు, సేనానులు, దేశ ద్రోహులై, స్వార్థపరులై, కుట్రదారులై మమేకమైనారు. ఈ సురధ మహారాజు అరణ్యాలలో వసిస్తూ నిస్సహాయుడై అష్టకష్టాలు అనుభవించవలసి వచ్చింది. తరువాత ఒక తాపసాశ్రమంలో ఆ తపస్వి ‘‘నవరాత్రి వ్రతం ఆచరిం చటం ద్వారా నీ రాజ్యాన్ని, ఆలుబిడ్డలను తిరిగి పొంద గలవు’’ అని ఆశీర్వదించాడు.
దాసు శ్రీరామమహాకవి ఈ ఉపాఖ్యానం చెపుతున్న ప్పుడు ఆయనను రాణా ప్రతాపసింహుడి రాజ్యహీనతా కష్టగాథ ప్రభావితం చేసి ఉంటుంది. ద్విజేంద్రలాల్ రాయ్ ఆధునిక భారత దేశ నాటక రచయితలలో అగ్రశ్రేణి రచయిత. ఆయన రాణా ప్రతాప్ నాటకం రంగస్థలంపై ప్రదర్శిస్తుండగా ప్రేక్షకులు శోక గాద్యద్యాన్ని, వెక్కులను, నిట్టూర్పులను హాలంతా నిండింప జేసేవారని అబ్బూరి రామ కృష్ణారావుగారు తమ శాంతినికేతన అనుభవాలలో అక్షరీకరించారు. సమకాలీన భావాలు, చారిత్రక విషా దాలు, దేశ దుర్గతి స్ఫురణలు ఎంతటి మహాకవినైనా ప్రభావితం చేయటం సహజం.
విశ్వనాథ సత్యనారాయణ తన చిన్ననాటి కవితా రచన కృషిలో దాసు వారి శ్రీదేవీ భాగవతాన్ని తమకు మార్గద ర్శకం చేసుకున్నామన్నారు. ‘ఈ గ్రంథములో గడుసు పోకడలెన్నియో గలవు. తెలుగు పలుకుబళ్ళు పెక్కులు గలవు. ఈ కవి యొక్క భాషా జ్ఞానము మిక్కిలి దొడ్డది. ఈ గ్రంథము చదివినచో ఎట్టివారైన కవులు కాక తప్పదు’ అన్నారు.
అక్కిరాజు రమాపతిరావు