‘గూగుల్‌ మ్యాప్‌’ సర్వే

ABN , First Publish Date - 2021-05-05T07:56:26+05:30 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూములపై ప్రభుత్వ విచారణ వేగవంతమైంది.

‘గూగుల్‌ మ్యాప్‌’ సర్వే

  • దేవరయాంజాల్‌ ఆలయ భూములపై 
  • రంగంలోకి ఐఏఎస్‌ల కమిటీ
  • క్షేత్రస్థాయిలో 8 బృందాలుగా 
  • నాలుగున్నర గంటలపాటు పరిశీలన


మేడ్చల్‌, మెదక్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూములపై ప్రభుత్వ విచారణ వేగవంతమైంది. మెదక్‌ జిల్లాలోని మాజీ మంత్రి ఈటల హేచరీ్‌సకు సంబంధించి ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే దేవరయాంజాల్‌లో ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీదిగింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విచారణ జరిపింది. శ్వేతామహంతి, భారతీహోళీకేరి, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సభ్యులుగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు సారథ్యంలోని ప్రభుత్వం నియమించిన ఐఏఎ్‌సల కమిటీ మంగళవారం  క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ వివాదాస్పద భూముల్లో  ఈటల నిర్మించిన గోదాము సహా అన్ని నిర్మాణాలను ఆ బృందం పరిశీలించింది. ఆ భూముల్లోని నిర్మాణాలను సర్వే నంబర్ల వారీగా గూగుల్‌ మ్యాప్‌, ఏరియల్‌ మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేపట్టాలని నిర్ణయించారు. 


ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఎనిమిది బృందాలుగా విడివడి కట్టడాలు, నిర్మాణాలను పరిశీలించారు. భూమి ఎవరి అధీనంలో ఉంది? ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు? ప్రభుత్వ అనుమతులతోనే గోదాములు, నిర్మాణాలు చేపట్టారా? అనే కోణంలో పూర్తి వివరాలను సేకరించారు. గోదాములకు సంబంధించిన అనుమతులతో పాటు ఇంటి నంబర్లు, విద్యుత్తు బిల్లులను కూడా బృందం పరిశీలించింది. ఈ ప్రాంతంలో వందల ఎకరాల్లో గోదాములు ఉండటం, కొన్ని రెండు నుంచి ఐదు ఎకరాల మేర ఉండటంతో ఇలాంటి గోదాములపై సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు సందర్శించారు. దేవరయాంజాల్‌లోని వివాదాస్పద భూముల్లో గోదాములు, షెడ్ల నిర్మాణాల అనుమతులపై ఆరా తీశారు. దేవరయాంజాల్‌ రెవెన్యూ గ్రామం తూంకుంట మునిసిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు మునిసిపాలిటీ కార్యాలయానికి చేరుకుని గ్రామంలో ఎన్ని గోదాములకు, షెడ్లను అనుమతించారు? ఎవరి హయాంలో నిర్మాణాలు జరిగాయి? ఎంతమేరకు ఆదాయం వస్తుందన్న వివరాలను సేకరించారు. దేవరయంజాల్‌లో దేవాలయం భూముల్లో నిర్మించిన గోదాములు, షెడ్లకు అనుమతులు ఎలా ఇచ్చారని, అక్రమంగా నిర్మించిన గోదాములకు పన్నులు ఎలా వసూలు చేస్తారని, అక్రమంగా కట్టిన గోదాములను ఎందుకు తొలగించలేదని, మునిసిపల్‌ సిబ్బందిని అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 


అచ్చంపేటలో అరగంటలోపే

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని జమునా హ్యాచరీ్‌సపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆర్డర్‌ ఇచ్చేలోపే ఏసీబీ, సర్వే డిపార్ట్ట్‌మెంట్‌ అధికారులు తమ విచారణను పూర్తి చేశారు. తొలుత హ్యాచరీస్‌ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అధికారుల బృందాన్ని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. కరోనా కారణంగా అందరూ వాహనాలతో లోపలికి వస్తే కోళ్లు చనిపోతాయని విచారణ బృందానికి వివరించారు. దీంతో హేచరీస్‌ లోపలికి ద్విచక్రవాహనంపై సర్వేయర్‌ లక్ష్మీసుజాతతో పాటు మరో ఇద్దరిని తీసుకుపోయారు. షెడ్ల నిర్మాణం,విస్తీర్ణం, షెడ్ల వెనుక వైపు నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు. ఇదంతా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో విచారణ ముగించుకొని బయటకు వచ్చారు. తర్వాత మాసాయిపేట తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు అక్కడ అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.   

Updated Date - 2021-05-05T07:56:26+05:30 IST