Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యనేతల సంప్రదింపులతో బుచ్చయ్య అధిష్టానం దగ్గరకు వచ్చారు. ఈ భేటీలో టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పార్టీ అధిష్ఠానంపై గోరంట్ల బుచ్చయ్యచౌదరి అలిగిన విషయం తెలిసిందే. తీవ్ర అసంతృప్తితో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో అప్పట్లో కలకలం రేగింది. సీనియర్‌నైనా తనకు గుర్తింపు లేదని, తనమాటకు విలువలేదని.. కావాలనే రాజమండ్రి రూరల్‌కు పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినా అక్కడి నుంచి రెండు సార్లు విజయం సాధించానని చెప్పారు. కానీ ఇటీవల పార్టీ పదవులు తాను చెప్పిన వారికివ్వలేదని ఆక్షేపించినట్లు సమాచారం. 


తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. ‘అన్ని సమస్యలూ పరిష్కరించుకుందాం.. భవిష్యత్‌ మన పార్టీదే, ఇటువంటి తరుణంలో సర్దుకోవడం అవసరం.. అయినా అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్దాం.. ఇక్కడకు రండి’ అని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన్ను ఆహ్వానించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. గోరంట్ల లాంటి సీనియర్ నేతలు టీడీపీ వదులుకోవడానికి ఇష్టంగా లేదు. అందుకే ఆయనతో టీడీపీ నేతలు అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాల అనంతరం నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement
Advertisement