భూములను అమ్మనివ్వం

ABN , First Publish Date - 2021-06-14T09:01:57+05:30 IST

భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, మొండిగా వ్యవహరిస్తే అడ్డుకుని తీరుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు.

భూములను అమ్మనివ్వం

  • సర్కార్‌ ఆస్తులు ప్రజల అవసరాల కోసమే.. విక్రయానికి కాదు
  • అప్పులు, భూముల అమ్మకంతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న  కేసీఆర్‌
  • తెలంగాణను కాపాడుకోవడానికి ఉద్యమం:  భట్టి విక్రమార్క  


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే  నిలిపివేయాలని, మొండిగా వ్యవహరిస్తే అడ్డుకుని తీరుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి కానీ అమ్మకూడదని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన భూముల అమ్మకంపై ఆదివారం జూమ్‌లో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అమ్మకానికి పెట్టిన భూములను సందర్శించాలని ఈ సందర్భంగా సీఎల్పీ తీర్మానించింది. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, ప్రజలు భరించలేని స్థాయిలో భారం మోపిందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి పలు సందర్భాల్లో అసెంబ్లీలోనూ, బయటా కాంగ్రెస్‌ తరఫున నిలదీసినట్టు చెప్పారు. అప్పులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు విశ్లేషించి చెప్పడానికి ప్రయత్నించినట్టు తెలిపారు.


 అప్పులు ఓ వైపు.. భూముల అమ్మకం ఇంకో వైపుతో రాష్ట్రాన్ని దివాలా తీయించడమే పనిగా కేసీఆర్‌ పెట్టుకున్నారని మండిపడ్డారు. అమ్మకానికి పెట్టిన భూములు, అప్పుల వివరాలను జనం ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ తెచ్చిన అప్పులు, అమ్మిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మియాపూర్‌ భూములు, నయీం పేరుతో రిజిస్టర్‌ అయినవి, అలాగే నయీం అక్రమ భూములు ఎంత సురక్షితంగా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. భూముల అమ్మకాన్ని ఆపేందుకు సీఎల్పీ పక్షాన గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. వేలం వేయనున్న భూములను సందర్శించి.. అక్కడినుంచే మీడియా ద్వారా ప్రజలకు అన్ని వివరాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని కోరారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే పోడెం వీరయ్య సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. 


పీసీసీ నియామకంలో నా పాత్ర చిన్నది

‘సీఎల్పీ నేతగా నా పనితీరు మీద పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావుకు సొంత అభిప్రాయం ఉంటుంది. పీసీసీ చీఫ్‌ నియామకంలో నా పాత్ర చాలా చిన్నది. పీసీసీపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


విశ్వాసం ఉన్నవారికే పీసీసీ చీఫ్‌

కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగా ఉన్న నేతనే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు.  రాజకీయంగా వివాదరహితులు, కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, గాంధీ కుటుంబంపట్ల విధేయత ఉన్నవారినే  పీసీసీ చీఫ్‌గా ఖరారు చేయాలని కోరారు. కాగా వీరయ్య రాసిన లేఖపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంతకాలు ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


వీహెచ్‌ లేఖపై మల్లు రవి ఆగ్రహం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా వి.హన్మంతరావు.. సోనియాగాంధీకి లేఖ రాయడంపై మాజీ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కోసం భట్టి విక్రమార్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. పార్టీలో సీనియర్‌ నేతగా వీహెచ్‌ తన దృష్టికి వచ్చిన సమస్యలపై సీఎల్పీ నేతకు సలహా ఇవ్వొచ్చన్నారు. 

Updated Date - 2021-06-14T09:01:57+05:30 IST