ఇది అంబులెన్సే కానీ.. అధికారి చేసిన పని చూస్తే...!

ABN , First Publish Date - 2021-10-01T00:03:35+05:30 IST

ఇది అంబులెన్సే కానీ.. అధికారి చేసిన పని చూస్తే...!

ఇది అంబులెన్సే కానీ.. అధికారి చేసిన పని చూస్తే...!

హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖలోని రవాణా విభాగంలో అతనో ఉన్నతాధికారి. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి.... ప్రజలకు సేవ చేయాల్సిన ఆ అధికారి ఆ సేవలకే తూట్లు పొడిచారు. ఖమ్మం జిల్లా గిరిజన ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఐదేళ్ల క్రితం నగరానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ రవాణా విభాగంలో కీలక హోదాలో పని చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అధికారి తనతో పాటు ఓ అంబులెన్స్‌ను కూడా ఇక్కడికి తెచ్చుకున్నారు. అక్కడి గ్రామాలు, తండాల్లో తిరగాల్సిన అంబులెన్స్‌ నగర రోడ్లపై తిరుగుతోంది. అందులో రోగులు, వారి సంబంధీకులు కాకుండా ఓ అధికారి దర్జాగా కూర్చొని తిరుగుతున్నాడు. అంతే కాకుండా అంబులెన్స్‌ అన్న దీమాతో చలానాలు పడవని రోడ్లపై ఇష్టానుసారంగా డ్రైవింగ్‌ సాగుతోంది. వాహన పత్రాలు కూడా రెన్యువల్‌ కాకుండా దర్జాగా తిరుగుతున్నారు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారంతో ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారికి వివరణ కోరగా.. జరుగుతున్న వ్యవహారంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


గిరిజనుల అంబులెన్స్‌

నిత్యావసర వస్తువులకే కిలోమీటర్ల మేర నడిచే గిరిజనులు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పడే పాట్లు అతనికి తెలియనివి కావు. ఎమర్జన్సీలో వారి అవసరార్థం ఆరోగ్య శాఖ తరపున కొన్ని అంబులెన్స్‌లు కేటాయించారు. ఏదైనా ప్రమాదం, అనారోగ్యం.. లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆయా అంబులెన్స్‌లు వారిని ఆదుకుంటాయి. అయితే వారికి చెందాల్సిన అంబులెన్స్‌ నగర రోడ్లపై షికార్లు కొడుతోంది. అక్కడ అంబులెన్స్‌ల కొరత ఉందనే విషయం గిరిజనులకు అర్థం కాకపోవడం.. ఇక్కడ అంబులెన్స్‌ సొంత అవసరాలకు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఇలాంటి అధికారులకు కలిసొస్తుంది. అంబులెన్స్‌ను నగరానికి తరలించి ఐదేళ్లుగా అందులోనే తిరుగుతున్నారు సదరు అధికారి. 


విచారించి చర్యలు తీసుకుంటాం: ఉన్నతాధికారి

ఆరోగ్య శాఖ రవాణా విభాగంలో ఓ అధికారి అంబులెన్స్‌ను తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. గిరిజనులకు చెందాల్సిన వాహనం హైదరాబాద్‌ నగర రోడ్లపై తిరుగుతోందన్న విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా... ఆయన సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆధారాలు తనకు చూపితే దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.



మాడిఫై చేయించి...

సాధారణంగా అంబులెన్స్‌ అంటే దాని వేషభాషలు కూడా అంబులెన్స్‌ను తలపించేలా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు అందుబాటులో ఉండాలి. కానీ ఆ వాహనాన్ని చూస్తే అసలు అంబులెన్స్‌లా కనిపించదు. చెవ్రోలే టవేరా వాహనాన్ని మాడిఫై చేయించి.. వెనక స్ట్రెచర్‌ ఉన్న సీటు భాగంలోనే మరో రెడు సీట్లు అమర్చి కూర్చోడానికి వీలుగా మాడిఫై చేయించుకున్నారు. వాహనానికి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి అదే శాఖకు చెందిన మెకానిక్‌ కావడం గమనార్హం. ఇక వాహనం నగర రోడ్లపై తిరుగుతుంటే నిబంధనలను బేఖాతరు చేస్తూ రాంగ్‌సైడ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, అతివేగం లాంటి ఉల్లంఘనలు కూడా బాగానే ఉన్నాయి. వాహనంపై సుమారు 10 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అంబులెన్స్‌ కదా చలానాలు ఎలా విధిస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ వాహనాన్ని చూస్తే అది అంబులెన్స్‌లా కనిపించదు. (అలా ఓ ప్రైవేట్‌ వాహనంగా... జాగ్రత్తగా మెయింటెయిన్‌ చేస్తూ) ట్రాఫిక్‌ పోలీసులకు సైతం అంబులెన్స్‌ అనే భావన కల్గించకుండా వ్యక్తిగత అవసరాలకు అధికారి తిరుగుతున్నారు. 


టాక్స్‌ ఫ్రీ..

అంబులెన్స్‌ పేరిట రిజిస్టర్‌ అయి ఉన్న ఏపీ 20టీసీ 2701 వాహనం డాక్యుమెంట్లను పరిశీలించగా టాక్స్‌ ఫ్రీ వాహనం అని ఉంది. అంతే కాకుండా 2013లో డీఎంహెచ్‌ఓ, ఖమ్మం పేరిట రిజిస్టర్‌ అయిన వాహనానికి ఇప్పటి దాకా ఎలాంటి రెన్యూవల్స్‌ కూడా జరగలేదు. ఫిట్‌నెస్‌ 2015లోనే గడువు తీరిపోయింది. ఇన్సూరెన్స్‌ పత్రాలు కూడా రెన్యువల్‌ కాలేదు. టాక్సు చెల్లింపులు కూడా జరగలేదు. రోడ్లపై మాత్రం తిరుగుతోంది.

Updated Date - 2021-10-01T00:03:35+05:30 IST