రైతుకు మద్దతు ఎక్కడ?

ABN , First Publish Date - 2020-06-03T09:33:41+05:30 IST

కష్టాలతో అల్లాడుతోన్న రైతులను ధాన్యం మద్దతు ధరలను నామమాత్రంగానే పెంచడం నైరాశ్యానికి గురిచేస్తోంది. కేంద్రప్రభుత్వం మంత్రుల కమిటీ

రైతుకు మద్దతు ఎక్కడ?

ధరల పెంపు నిర్ణయంపై రైతుల్లో నైరాశ్యం

పత్తి, వరి, మొక్కజొన్నలకు నామమాత్రమే

పెంచిన ధరలను కల్పించడంలో ప్రభుత్వం విఫలం


పరిగి:  కష్టాలతో అల్లాడుతోన్న రైతులను ధాన్యం మద్దతు ధరలను నామమాత్రంగానే పెంచడం నైరాశ్యానికి గురిచేస్తోంది. కేంద్రప్రభుత్వం మంత్రుల కమిటీ వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను తక్కువగా పెంచడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతీ ఏడాది మోదీ ప్రభుత్వం భారీగా మద్దతు ధరలు పెంచక పోతుందా..? అన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేస్తారు. అయితే ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఒకవేళ అన్నీ అనుకూలించి పంటలు పండినా దళారుల దగాతో మద్దతు ధర పొందలేకపోతున్నారు. తాజాగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల గణాంకాలు చూసి అవాక్కవుతున్నారు. 


కంటితుడుపుగా మద్దతు

జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలే ఎక్కువగా పండిస్తారు. గతేడాది లక్షన్నర ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి 2,13,192 ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించారు. కందులు 1,75,900 ఎకరాలు, వరి 30 వేల ఎకరాలు, పెసర 20,800, జొన్న 15 వేలు, మినుములు 9,500 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈసారి మొక్కజొన్న సాగు చేయొద్దని ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు సూచించిన పంటలు వేయకపోతే రైతుబంధు ఉండదనే సంకేతాలతో రైతులు అధికారులు చెప్పిన పంటలే సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు.


పత్తికి మద్దతు ధర క్వింటాలకు రూ.1000 పెంచవచ్చని రైతులు భావించారు. అయితే ప్రభుత్వం రూ.275లు మాత్రమే పెంచింది. దీంతో రైతులు నిరాశ చెందారు. పత్తి పాత ధర రూ.5,550లు ఉండగా, కొత్త ధర రూ.5825లకు పెరిగింది. వరికి క్వింటాలుకు ప్రస్తుత ధర రూ.1835లు ఉండగా, రూ.1888కి పెంచింది. ప్రధాన పంట అయిన వరికే నామమాత్రంగా మద్దతు ధర పెంచడంతో రైతులు మండిపడుతున్నారు. మొక్కజొన్నలకు రూ.1840 ఉండగా రూ.1890కి పెంచింది. అలాగే రాగులకు రూ.145, సజ్జలు రూ.150, కందులు రూ.200, వేరుశగన రూ.185ల చొప్పున పెంచారు. 


రైతులకు కనీస ధర దక్కదా..? 

ఉత్పత్తి వ్యయాన్ని, స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదనలు పట్టించుకోకుండా కేంద్ర ఆర్థిక ధరల నిర్ణాయక కమిటీ మద్దతు ధరలు నిర్ణయిస్తోంది. ఏటా ఇది ఓ ప్రహసనంలా మారింది. దీంతో అన్నదాతలకు ఇది నిర్ణయించే మద్దతు ధర ఏమాత్రం ఉపయుక్తంగా లేకుండా ఉంది. ఇక కనీసం అది నిర్ణయించిన ధరలనైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా.. అంటే అదీ లేదు. జిల్లాలో వరికి సగటున అన్నదాతలు మద్దతు ధర కన్నా క్వింటాలుకు రూ.150, పత్తి రూ.500 నుంచి రూ.800, మొక్కజొన్నకు రూ.100 నుంచి రూ.300ల వరకు  తక్కువగా పొందుతున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేటుగా మారి రైతులను దోచుకుంటున్నారు. దీన్ని ఏమాత్రం అరికట్టలేని అధికారులు కనీసం ప్రభుత్వ రంగ సంస్థలతో భారీ స్థాయిలో వ్యవసాయోత్పత్తుల్ని మద్దతు ధరకు కొనిపిస్తారా.? అంటే అదీ లేదు. జిల్లాలో ప్రతి సీజన్‌లో ప్రభుత్వం ఉత్పత్తి అయిన దానిలో కేవలం 20 శాతం మాత్రమే మద్దతు ధరకు కొంటోంది. దీన్ని బట్టి రైతులు ఏస్థాయిలో దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పంటలకు క్వింటాలకు ఐదారు వందల చొప్పున పెంచితే తప్ప గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని రైతులు అంటున్నారు.


పెట్టుబడులకనుగుణంగా గిట్టుబాటు ధరలు పెంచాలి

పంటల సాగులో ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కంటి తుడుపుగా ధరలను పెంచుతోంది. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పత్తి క్వింటాలు రూ.8000, వరి రూ. 2500 చొప్పున కనీసధర నిర్ణయించాలి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పెట్టుబడులను పరిశీలించి గిట్టుబాటు ధరలపై నిర్ణయం తీసుకోవాలి. 

- అందె విజయ్‌కుమార్‌, టీ-కిసాన్‌ సంఘ్‌ అధ్యక్షుడు


Updated Date - 2020-06-03T09:33:41+05:30 IST